ఫ్లోరెన్స్ యంగ్ | Florence Young జీవిత చరిత్ర
- జననం: 10-10-1856
- మహిమ ప్రవేశం: 28-05-1940
- జన్మస్థలం: మోటుయేకా
- దేశం: న్యూజిలాండ్
- దర్శనము: సొలొమోన్ ద్వీపవాసులు
ఫ్లోరెన్స్ సెలీనా హ్యారియెట్ యంగ్ న్యూజిలాండ్‌లోని మోటుయేకాలో జన్మించారు. వ్యవసాయదారుడైన ఆమె తండ్రి ఒక ఆంగ్లేయుడు. ఇంటిలోనే చదువుకున్న ఫ్లోరెన్స్, రెండు సంవత్సరాలు మాత్రం ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు 18సంll ల వయసు ఉన్నప్పుడు ఒక ప్రార్థనా కూడికలో దేవుడు యెషయా 43:25 ద్వారా ఆమెతో మాట్లాడగా, తన పాపములను క్షమించుటకు దేవుడు కలిగియున్న శక్తిని ఆమె అనుభవించారు.
తన తల్లిదండ్రుల మరణం తరువాత, 1882వ సంll లో తన సోదరులు చెరకు తోటను కలిగియున్న క్వీన్స్‌లాండ్‌లోని ఫెయిరీమీడ్‌కు వెళ్ళారు ఫ్లోరెన్స్. అక్కడ ఆమె మొక్కల పెంపకదారుల కుటుంబముల కొరకు ప్రార్థనా కూడికలు నిర్వహించడం ప్రారంభించగా, తరువాత అది ‘యంగ్ పీపుల్స్ స్క్రిప్చరల్ యూనియన్’ గా మారింది. క్రమేణా ఆమె దృష్టి తోటలలో పనిచేసే సొలొమోన్ ద్వీపవాసుల వైపు మళ్ళింది. వారిని ‘కనకాలు’ అని పిలిచేవారు. వారికి నేర్పించడము గానీ లేదా వారిని మార్చడం గానీ సాధ్యం కాని పని అని పలువురు ఆమెకు చెప్పేవారు. అయితే, ఫ్లోరెన్స్ పిడ్జిన్ ఆంగ్లములో వారికి తరగతులు నిర్వహించడం ప్రారంభించారు మరియు చిత్రాలు మరియు ప్రకృతిలోని సహజ దృష్టాంతాలను ఉపయోగించి బైబిలు సత్యాలను బోధించారు. చివరికి 1886వ సంll లో ఫెయిరీమీడ్‌లో ‘క్వీన్స్‌ల్యాండ్ కనకా మిషన్’ (క్యూ.కే.ఎమ్.) ను స్థాపించారు ఫ్లోరెన్స్. ఇది ఏ క్రైస్తవ వర్గమునకు చెందనిది మరియు సువార్తను ప్రకటించే క్రైస్తవ సంఘం. ‘విద్య లేదా నాగరికతకు ముందు రక్షణ బోధించబడాలి’ అని ఈ మిషన్ నొక్కి చెప్పేది. 1904-1905 సంll ల మధ్య కాలంలో 19 మంది మిషనరీలు మరియు 118 మంది స్థానిక ఉపాధ్యాయులను కలిగియున్న క్యూ.కే.ఎమ్. మిషన్ ద్వారా 2,000 కంటే ఎక్కువ మంది మారుమనస్సు పొందారు.
1891వ సంll నుండి 1900వ సంll మధ్య కాలంలో ఆరు సంవత్సరాల పాటు ‘చైనా ఇన్‌ల్యాండ్ మిషన్’ లో పనిచేశారు ఫ్లోరెన్స్. ఈ అనుభవం ద్వీపవాసులతో కలిసి మిషనరీ సేవ కొరకు ప్రణాళికలను సిద్ధపరచుటకు ఆమెకు సహాయపడింది. ఆమె ద్వారా మారుమనస్సు పొందిన వారిలో ఒకరైన పీటర్ అంబుఫా అనే వ్యక్తి మరియు ఇతరులు తమ స్వంత స్థలములలో తమ స్వంత సంఘములకు బోధించుటకు తమకు సహాయం చేయమని కోరారు. వారు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, 1904వ సంll లో సొలొమోన్ దీవులలోని మలైటాలో క్యూ.కే.ఎమ్. యొక్క శాఖగా ‘సౌత్ సీ ఇవాంజెలికల్ మిషన్’ (ఎస్.ఎస్.ఇ.ఎమ్.) స్థాపించబడింది. ఆ దీవులలో నూతనముగా స్థాపించబడిన క్రైస్తవ సంఘములకు ఆత్మీయ ఆహారమును అందించుటకుగాను ఆ సంవత్సరం ఫ్లోరెన్స్ ఒక మిషనరీల బృందమును సొలొమోన్ దీవులకు నడిపించారు. ఆమె 1926వ సంll వరకు కూడా ఆ దీవులకు ప్రతి ఏడూ సుదీర్ఘ సందర్శనలను చేపట్టారు. 1940వ సంll లో ఆమె మరణించే సమయానికి ఎస్.ఎస్.ఇ.ఎమ్. లో నమోదు చేయబడిన మారుమనస్సు పొందినవారి సంఖ్య 7900 పైగా ఉంది.
ఒక యువతిగా ఫ్లోరెన్స్ బిడియముతోనే ప్రార్థనా కూడికలను నిర్వహించడం ప్రారంభించారు. ఆమె తన ప్రభువును మరియు ఆయన వాక్యమును ప్రేమించారు. ఆమె తన పరిచర్యలో అడ్డంకులను ఎదుర్కొన్నారు, మానసిక అనారోగ్యానికి గురైయ్యారు మరియు కష్టతరమైన, ప్రమాదకరమైన ప్రయాణాలను చేపట్టారు. అయినప్పటికీ, ఎన్నడూ వెనుకంజ వేయక, వేలాది మంది జీవితాలలో వెలుగును తీసుకువచ్చారు ఫ్లోరెన్స్ యంగ్.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం:
ప్రియమైనవారలారా, మీ జీవితములో దేవుని కొరకు మీరు ఏమి సాధించారు?
"ప్రభువా, ఈ దినాన నా జీవితమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా జీవితములో మీ కొరకు ఏదైనా చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment