థామస్ వాల్పీ ఫ్రెంచ్ | Thomas Valpy French
- జననం: 01-01-1825
- మహిమ ప్రవేశం: 14-05-1891
- స్వస్థలం: బర్టన్-ఆన్-ట్రెంట్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: బ్రిటిష్ కాల భారతదేశం మరియు మస్కట్
మస్కట్ సమీపంలోని సముద్రతీరంలో ఒక సమాధి మీద “లాహోర్ యొక్క మొదటి బిషప్ మరియు మస్కట్‌కు వచ్చిన మొదటి మిషనరీ” అనియు, దాని క్రింద యోహాను 12:24 వాక్యము వ్రాయబడియుంటుంది. ఇది ఒక మిషనరీ యొక్క సమాధి. అతను బ్రిటీష్ కాలంలోని భారతదేశంలోను మరియు ముస్లింల మధ్యను కఠినముగా పరిచర్య చేసి, ఆరోగ్య పరిస్థితి క్షీణించినా అరేబియాకు వెళ్ళి, చివరికి మస్కట్ నేలపై రాలిపోయిన ఒక గోధుమ గింజ.
థామస్ వాల్పీ ఫ్రెంచ్ ఆంగ్లికన్ సంఘములో ఒక మతాధికారి యొక్క జ్యేష్ఠ కుమారుడు. తన చిన్నతనంలో అతను మిషనరీలను సందర్శించడం వలన విదేశాలలో పరిచర్యపై అతనికి ఆసక్తి ఏర్పడింది మరియు అతను తన తోడబుట్టినవారితో కలిసి వారి కొరకు ప్రార్థించేవారు. అతను తెలివైనవారు మరియు ఉన్నత విద్యావంతులు. భారతదేశంలో మిషనరీ అయిన హెచ్. డబ్ల్యూ. ఫాక్స్ యొక్క అభ్యర్థన మరియు బిషప్ శామ్యూల్ విల్బర్‌ఫోర్స్ యొక్క ఒక ప్రసంగం అతను తన జీవితమును మిషనరీ సేవకు సమర్పించుకొనుటకు కారణమయ్యాయి. కాగా “చర్చి మిషనరీ సొసైటీ” (సి.ఎమ్.ఎస్.) లో చేరిన అతను, 1850వ సంll లో భారతదేశానికి పయనమయ్యారు.
1851వ సంll లో థామస్ భారతదేశంలోని ఆగ్రాలో సెయింట్ జాన్స్ కళాశాలను స్థాపించారు. కళాశాల యొక్క నిర్వాహక పనులతో విరామం లేకుండా ఉన్నప్పటికీ, అతను ఎల్లప్పుడూ సువార్తను ప్రకటించుటకు సమయం కేటాయించారు. అతను స్థానిక అంగడి ప్రాంతాలలో సువార్తను ప్రకటించేవారు, ఆగ్రా చుట్టుప్రక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటన పర్యటనలను చేపట్టారు మరియు ఎల్లప్పుడూ వ్యక్తిగతముగా సువార్తను ప్రకటించుటకు సమయం గడిపేవారు. ఏడు భారతీయ భాషలు నేర్చుకున్న అతను, “ఏడు భాషల వ్యక్తి” అని పిలువబడేవారు. 1862వ సంll లో అతను మరొక మిషనరీతో కలిసి పాకిస్థాన్ ప్రాంతంలో డేరాజత్ మిషన్‌ను స్థాపించారు. కానీ, అటు వెంటనే అధిక పనిభారం కారణంగా అతని ఆరోగ్యం క్షీణించడంతో అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.
భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత అతను 1869వ సంll లో లాహోర్‌లో సెయింట్ జాన్స్ డివినిటీ స్కూల్‌ను స్థాపించారు. ఇది పరిచర్య చేయుటకు మరియు వివిధ వృత్తిపరమైన రంగాలలో సాక్షులుగా ఉండుటకును శిక్షణనిస్తుంది. విద్యావంతులైన క్రైస్తవులు ప్రతి రంగములోను ఉద్యోగాలలో ప్రవేశించి, అక్కడ సాక్షులుగా నిలబడవలెనని థామస్ విశ్వసించారు. 1877వ సంll లో అతను లాహోర్ డైయోసెస్ యొక్క మొదటి ఆంగ్లికన్ సంఘ బిషప్‌గా నియమించబడ్డారు. స్థానిక సంస్కృతికి తగిన విధముగా స్వదేశీ సంఘమును అభివృద్ధి చేయుటకు అతను శ్రమించారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతను మరలా 1887వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళారు. అయితే, 1891వ సంll లో అరేబియాలో స్వచ్ఛందముగా సేవ చేసేవారి కొరకు సి.ఎమ్.ఎస్. సంస్థవారు ఇచ్చిన పిలుపుకు స్పందించారు థామస్. అరవై ఆరేళ్ల వయసులో అతను మస్కట్‌లో అడుగు పెట్టారు. కానీ, అలుపెరుగక చేసిన సేవతో సొమ్మసిల్లిపోయిన థామస్ వాల్పీ ఫ్రెంచ్, తీవ్రమైన అలసటతోను మరియు జ్వరముతోను బాధపడి, మూడు నెలల తరువాత అక్కడ ప్రాణం విడిచారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం:
ప్రియమైనవారలారా, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో అక్కడ మీరు సాక్షిగా నిలుస్తున్నారా?
ప్రార్థన :
"ప్రభువా, నా శారీరక బలం క్షీణించిపోయినప్పటికీ మిమ్మును సేవించవలెననే వాంఛను మరియు ఆసక్తిని కలిగియుండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment