రీన్‌హార్డ్ బోంకే | Reinhard Bonnke
- జననం: 19-04-1940
- మహిమ ప్రవేశం: 07-12-2019
- స్వస్థలం: కోనిగ్స్‌బర్గ్
- దేశం: జర్మనీ
- దర్శన స్థలము: ఆఫ్రికా
ఒక తొమ్మిదేళ్ళ బాలుడి తల్లి అతను చేసిన పాపం గురించి అతనితో మాట్లాడుతుంది. ఆ బాలుడు వెంటనే తన పాపాలను ఒప్పుకొని, క్షమాపణ కొరకు వేడుకొని, ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. 10 సంll ల వయస్సు ఉన్నప్పుడు అతను ఆఫ్రికాలో మిషనరీ సేవ కొరకైన దేవుని పిలుపును గ్రహించాడు. తన జీవితపు తదుపరి భాగంలో ఆ పిలుపుకు ప్రతిస్పందించిన ఆ బాలుడు “ఆఫ్రికా యొక్క బిల్లీ గ్రాహం” అని పేరుగాంచాడు. ఆ బాలుడు రీన్‌హార్డ్ బోంకే.
పట్టభద్రులైన తరువాత, ఆఫ్రికా వెళ్ళుటకు ముందుగా జర్మనీలో పరిచర్య చేశారు బోంకే. 1967వ సంll లో ఆఫ్రికాలోని లెసోతో అనే ఒక చిన్న గ్రామానికి చేరుకున్న అతను, అక్కడ స్థానిక సంఘమునకు పాదిరిగా సేవలందించారు. “పరలోకమును ప్రజలతో నింపుటకు నరకమును కొల్లగొట్టండి” అనే నినాదంతో అతను తన పరిచర్యను ప్రారంభించారు. అప్పటిలో లెసోతోలో నిరుద్యోగం ప్రబలంగా ఉండటంతో అది చివరికి అక్కడ నేరాల రేటు అధికమగుటకు దారితీసింది. అందువలన అతను యువకులకు సలహాలను ఆలోచనలను ఇచ్చి, సువార్తను వ్యాప్తి చేయుటకు వారిని నియమించుకున్నారు. లెసోతో నలుమూలలకు మరియు ఆ గ్రామ వెలుపల ప్రాంతములకు కూడా బైబిళ్ళను మరియు సువార్త కరపత్రాలను తీసుకువెళ్ళుటకు సైకిల్ బృందాలను అతను ఏర్పరిచారు.
ఇతరుల వలె ‘స్మారక కట్టడాలు’ కాకుండా అతను ‘దేవుని రాజ్యమును’ నిర్మించాలనుకున్నారు. అందుకే విశ్వాసంతో అతను పెద్ద ఆడిటోరియంలను అద్దెకు తీసుకొని కూడికలు నిర్వహించడం ప్రారంభించారు. ప్రారంభములో పరిచర్య నిరాశపరిచినప్పటికీ, త్వరలోనే దక్షిణాఫ్రికాలోని అనేక ప్రాంతాలలో ఉజ్జీవం అగ్ని జ్వాలల్లా వ్యాపించింది. దేవుడు తనను నడిపించువాడనియు మరియు పరిశుద్ధాత్మ తనకు ఆదరణ, నడిపింపు మరియు శక్తిని ఇచ్చేవాడనియు అతను విశ్వసించేవారు.
“సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించవలెననే క్రీస్తు యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చవలెననే వాంఛ దివారాత్రములు మిమ్ములను నడిపిస్తున్నదా? లేనట్లయితే నా జీవిత గాథ మీలో ఆ అగ్ని జ్వాలలను కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. సమస్తమునూ మార్చగలిగిన ఒక అగ్ని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మిమ్ములను ఒప్పించగలిగే ఒక పరిశుద్ధ అగ్ని.” అనునవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు సవాలును ఇచ్చే బోంకే మాటలు. తనలోని మండుతున్న అగ్ని మరియు అణచివేయలేని ఆసక్తి ఉత్సాహాలతో అతను ‘క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్’ అనే సంస్థను ప్రారంభించారు. ఇది ప్రస్తుతం 9 దేశాలలో పరిచర్యను జరిగిస్తున్నది.
వేలాది మంది ప్రజలను రక్షణ వెలుగులోనికి నడిపించిన ఈ శక్తివంతుడైన దైవజనుడు
79 సంll ల వృద్ధాప్యములో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు.
ప్రియమైనవారలారా, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడనే క్రీస్తు యొక్క ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు మీలో పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ప్రజ్వలిస్తున్నదా?
"ప్రభువా, పరిశుద్ధాత్ముని అగ్నితో నన్ను నింపి, మీ కొరకు నేను అసాధ్యమైనటువంటి పనులను తలపెట్టుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment