Search Here

Nov 18, 2021

Constant Lievens | కాన్‌స్టాంట్ లీవెన్స్

కాన్‌స్టాంట్ లీవెన్స్ గారి జీవిత చరిత్ర








  • జననం: 11-04-1856
  • మహిమ ప్రవేశం: 07-11-1893
  • స్వస్థలం: మూర్స్‌లెడ్
  • దేశం: బెల్జియం
  • దర్శన స్థలము: మధ్య భారతదేశం


 “చోటా నాగ్‌పూర్ యొక్క అపొస్తలుడు” అని పిలువబడే కాన్‌స్టాంట్ లీవెన్స్ మధ్య భారతదేశంలో పరిచర్య చేసిన బెల్జియం దేశపు ఒక మిషనరీ. అతను ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించినందున పంట భూములలో అతనికున్న అనుభవం మధ్య భారతదేశంలోని గిరిజనుల మధ్య, ప్రధానంగా ముండా, ఉరావ్ మరియు ఖరియా అనే తెగల మధ్య ఏడు సంవత్సరాల పాటు చేసిన పరిచర్యలో అతనికి ఉపకరించింది.
 విదేశాలలో మిషనరీ సేవ చేయవలెనన్న బలమైన కోరికతో ‘సొసైటీ ఆఫ్ జీసస్‌’ అనే సంస్థలో చేరిన లీవెన్స్, బ్రూగెస్‌లో ఆత్మీయపరమైన శిక్షణను ప్రారంభించారు. తదుపరి తన వేదాంత శిక్షణను పూర్తి చేసుకొనుటకుగాను 1880వ సంll లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు పంపబడ్డారు.
 1885వ సంll లో లీవెన్స్ చోటా నాగ్‌పూర్ పీఠభూమికి పంపబడగా, అక్కడ అతను స్థానిక భాషను మరియు వారి జీవన విధానమును నేర్చుకున్నారు. అటు తరువాత అతను రాంచీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న టోర్పాలో స్థిరపడ్డారు. అక్కడి పరిస్థితులను కొంచెం పరిశీలించిన పిమ్మట అక్కడి జాగీర్దారులు, జమిందారులు మరియు తికేదారుల నుండి గిరిజనులు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనియు మరియు శారీరకముగా శ్రమపెట్టబడుతున్నారనియు అతను కనుగొన్నారు. కాగా ఆచరణాత్మకమైన సువార్తతో వీరిని చేరుకొనగలిగే ఒక మార్గం వారి దుస్థితి నుండి విడుదల పొందుటకు వారికి సహాయపడుటయని గ్రహించారు లీవెన్స్. అందుకొరకు అతను సంప్రదాయ గిరిజన చట్టాలు మరియు బ్రిటిషువారి చట్టాలను అధ్యయనం చేసి, న్యాయస్థానములలో గిరిజనుల కేసులకు బలమైన మద్దతునిచ్చారు. వారు వారి భూములను తిరిగి పొందేందుకును మరియు వారి హక్కుల కొరకు నిలబడగలుగునట్లును అతను వారికి సహాయం చేశారు. చాలా మంది ఆదివాసులు అతనిని తమకు ఒక ‘రక్షకుని’ గా పరిగణించారు మరియు యేసు క్రీస్తు ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించడం ప్రారంభించారు.
 ‘అగ్ని జ్వలించుచుండాలి’ అనే నినాదముతో జార్ఖండ్‌లోని కొండ ప్రాంతాలలో అలుపెరగకుండా ప్రయాణించారు లీవెన్స్. జార్ఖండ్ గిరిజనుల అభివృద్ధి కొరకు నిర్విరామంగా పనిచేసిన అతను, వారికి న్యాయం, విద్య మరియు ఆత్మీయ అభివృద్ధిని సమకూర్చారు. మరికొంతమంది మిషనరీలు కూడా వచ్చి అతనికి సహాయమందించారు. రెండేళ్ళ వ్యవధిలో అక్కడి క్రైస్తవుల సంఖ్య పదిహేను వేలకు పెరిగింది.
 విస్తారమైన పని వలన క్షీణించిపోయిన అతను, 1891వ సంll లో క్షయవ్యాధి బారినపడ్డారు. కాగా కోలుకొనుటకు డార్జిలింగ్‌లో కొంత సమయం గడిపిన తర్వాత, అతను తిరిగి బార్వా ప్రాంతానికి వచ్చి పన్నెండు వేల మందికి బాప్తిస్మం ఇచ్చారు. అయితే వ్యాధి తిరిగి రావడం అతనికి ప్రాణాంతకంగా మారింది. కాగా భారతదేశానికి తిరిగి వస్తానని ఆశిస్తూ, “నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని చెప్పి 1893వ సంll లో బెల్జియంకు తిరిగి వెళ్ళారు కాన్‌స్టాంట్ లీవెన్స్. అయితే 1893వ సంll నవంబరు మాసం 7వ తారీఖున తన సేవకుడిని మహిమలోకి పిలవడం దేవుని దృష్టికి మంచిదైయున్నది.

ప్రియమైనవారలారా, మీలో ఆత్మీయ జ్వాలలు మండుచున్నాయా?

"ప్రభువా, నీ సేవకులచే అసంపూర్తిగా విడిచిపెట్టబడిన ఏ పరిచర్యనైనా కొనసాగించి సంపూర్తి చేయుటకు నన్ను నేను సమర్పించుకొనెదను. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment