Search Here

Nov 21, 2021

Katie Davis Majors Biography

కేటీ డేవిస్ మేజర్స్ గారి జీవిత చరిత్ర






  • జననం: 01-11-1989
  • స్వస్థలం: నాష్విల్లే
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శనము: ఉగాండా

 ఉగాండాలో పేదరికంలో ఉన్న ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించుటకు తన మంచి జీవితమును విడిచిపెట్టిన ఒక యువ అమెరికా మిషనరీ కేటీ డేవిస్ మేజర్స్. చిన్నప్పటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రబలముగా ఉన్న పేదరికం గురించి అవగాహన కలిగియున్న ఆమె తన ఆశీర్వాదకరమైన జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. సంవత్సరాలు గడిచేకొద్దీ పేదరికంలో ఉన్న ప్రజలను గురించిన భారం కూడా ఆమె హృదయంలో పెరిగింది. కాగా ఆమె తన కలలను విడిచిపెట్టి, అట్టి స్థితిలొ క్రీస్తు ఏమి చేయునో ఆలాగున చేయుటకు యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఆమెను బలవంతపరిచింది.

 18 సంll ల వయస్సులో ఉన్నప్పుడు ఉగాండాలో కిండర్ గార్టెన్ ఉపాధ్యాయినిగా పనిచేసే అవకాశాన్ని పొందారు కేటీ. తన వయస్సులో ఉన్న అమ్మాయిలు ప్రాపంచిక ఆనందాలను కోరుతూ, విజయవంతమైన భవిష్యత్తునిచ్చే మార్గాలను ఎన్నుకొనుచుండగా, కేటీ మాత్రం ఉగాండాకు వెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు. కాగా తన తల్లితో కలిసి 2006వ సంll లో ఉగాండాలో అడుగుపెట్టిన ఆమె, అక్కడ పేదరికానికి కారణమవుతున్న నిరక్షరాస్యత, తత్ఫలితముగా బాల్య నేరస్థులను తయారుచేస్తూ భయంకరమైన పర్యవసానాలకు దారితీస్తున్న దుస్థితిని చూశారు. ఎవరి దగ్గర నుండైనా ఆర్థిక సహాయం దొరుకుతుందేమోయని వెతుకుటకు బదులుగా ఆమె తాను దాచుకొనిన ధనమును వెచ్చించి పది మంది నిరుపేద పిల్లలకు విద్యను అందించుట ద్వారా మొదట తాను ఇతరులకు ఒక మాదిరిగా నిలిచారు. అది ఆమె స్నేహితులు మరియు బంధువులలో చాలా మందికి ప్రేరణ కలిగించగా, అది 150 మంది పిల్లలకు తగినంత నిధుల సేకరణకు దారితీసింది. 

 ఒక సంవత్సరం పాటు మిషన్ పని చేసిన తరువాత తన పట్టా చదువు పూర్తిచేసుకొనుటకుగాను ఆమె అమెరికాకు తిరిగి వచ్చారు. అటు పిమ్మట ఉగాండాకు తిరిగి వెళ్ళాలనే ఆమె నిర్ణయానికి ఆమె కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ తన భూసంబంధమైన తండ్రి కంటే తన పరలోకపు తండ్రినే సంతోషపెట్టుటకు ఎంచుకున్న కేటీ, 2007వ సంll లో జింజాకు తిరిగి వచ్చారు. ఉగాండా ప్రజలకు క్రీస్తును తెలియపరచుట ద్వారా వారి జీవితాలను మార్చవలెననే లక్ష్యంతో అక్కడ ఆమె ‘అమాజిమా మినిస్ట్రీస్‌’ ను ప్రారంభించారు. నేడు అక్కడ ఒక క్రీస్తు కేంద్రీకృత పాఠశాలను నడుపుతున్న ఆమె, దాని ద్వారా జింజాలోని అనేక కుటుంబాలలో ఆత్మీయ మరియు భౌతికపరమైన మార్పును తీసుకువచ్చారు.

 తన భర్త బెంజి మేజర్స్ నుండి తన పరిచర్యకు మంచి మద్దతు పొందిన కేటీ, ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 13 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. పరిచర్యలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, “మీరు చిన్న చిన్న పనులన్నీ దేవుని యొక్క గొప్ప ప్రేమతో చేస్తున్నప్పుడు మీరు మీ జీవితముతో ఏదో ఒక గొప్ప పనిని చేస్తున్నారని అర్థం. మీరు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని మారుస్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే మారుస్తున్నారని అర్థం. క్రీస్తు వలె ప్రేమను చూపించుటకు కలిగే అవకాశాలను మీరు కోల్పోనప్పుడు మీరు మీ ఉత్తమ జీవితాన్ని కోల్పోరు.” అని ఆమె చిరునవ్వుతో చెబుతారు. 

ప్రియమైనవారలారా, మీ యవ్వన జీవితం ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమ యొక్క మాధ్యమముగా ఉన్నదా?

"ప్రభువా, చిన్న పనులు అయినా మీ యొక్క గొప్ప ప్రేమతో చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment