Search Here

Nov 26, 2021

Joseph van Someran Taylor Life History

జోసఫ్ వాన్ సోమరన్ టేలర్ గారి జీవిత చరిత్ర




  • జననం: 03-07-1820
  • మహిమ ప్రవేశం: 02-06-1881
  • జన్మస్థలం: బళ్ళారి, భారతదేశం
  • దర్శన స్థలము: గుజరాత్, భారతదేశం

 ‘గుజరాతీ వ్యాకరణ పితామహుడు’ అని పిలువబడే వ్యక్తి గుజరాతీ కాదు, భారతీయుడు కాదు, స్కాటిష్ మూలానికి చెందిన వ్యక్తి అని చెబితే మీరు నమ్మగలరా? అది నిజం! అతని పేరు జోసఫ్ వాన్ సోమరన్ టేలర్. అతను గుజరాతీ ప్రజల మధ్య తాను జరిగించిన మిషనరీ పరిచర్యకు ప్రసిద్ధి చెందారు. అతను కర్ణాటకలోని బళ్ళారిలో ఒక మార్గదర్శక మిషనరీ దంపతులకు జన్మించారు. మొదట కలకత్తాలో విద్యను అభ్యసించిన టేలర్, తదుపరి తన చదువును కొనసాగించుటకు ఇంగ్లాండుకు వెళ్ళారు. అక్కడ అతనికి డేవిడ్ లివింగ్‌స్టన్‌తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ద్వారా డేవిడ్ లివింగ్‌స్టన్‌ అతనిపై శాశ్వతమైన ముద్ర వేశారు. 1843వ సంll లో గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి అతను పట్టభద్రులవ్వగా, అదే సంవత్సరంలో అతనిని మిషనరీ సేవకు అంగీకరించిన లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) భారతదేశంలోని గుజరాత్‌లో సేవ చేయుటకు అతనిని పంపింది.

 1846వ సంll లో బరోడాకు చేరుకున్న టేలర్, అక్కడ మరొక ఎల్.ఎమ్.ఎస్. మిషనరీ అయిన విలియం క్లార్క్‌సన్‌ను కలిశారు. వీరిరువురు కలిసి గుజరాత్‌లోని మహి కంఠ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య ప్రారంభించారు. సహజముగానే ఇతరుల యెడల విశాల హృదయమును కలిగియుండే టేలర్, సువార్తను అద్భుతముగా ఇతరులకు అందించగలరు. కాగా అతను హిందూ, ముస్లిం మరియు పార్సీ వర్గాలకు చెందినవారి మధ్య స్నేహితులను సంపాదించి, వారికి క్రీస్తు ప్రేమను గురించి తెలియపరిచారు. త్వరలోనే అతను గుజరాతీ భాషను నేర్చుకుని, అందులో సువార్త సందేశాలను వ్రాయడం ప్రారంభించారు. మనిషి యొక్క మనస్తత్వముపై ఎంతో అవగాహనను కలిగియున్న అతను, అక్షరాస్యత కలిగియున్న సమాజాలవారికి మతపరమైన చర్చలు కాకుండా రచనల ద్వారా సువార్తను తెలియపరచడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు. అతను గుజరాతీ వ్యాకరణంలో మంచి పట్టు సాధించినవారై ‘గుజరాతీ భాషాను వ్యాకరణ్’ (గుజరాతీ భాష యొక్క వ్యాకరణం) అను పుస్తకమును ప్రచురించారు.

 అటుపిమ్మట గుజరాతీ భాషలో నిష్ణాతులైన అతను, విలియం కేరీ యొక్క గుజరాతీ బైబిలు అనువాదమును సవరించుటకు తలపెట్టారు. ఆ సమయంలో అతను ఎల్.ఎమ్.ఎస్. సంస్థవారి మద్దతును మరియు ఆర్థిక సహాయమును కోల్పోయినప్పటికీ, గుజరాతీ ప్రజలపై అతను కలిగియున్న ప్రేమ అక్కడ పరిచర్యను కొనసాగించేలా అతనిని ప్రేరేపించింది. 1861వ సంll నాటికి గుజరాతీ బైబిలును సవరించడం పూర్తిచేశారు టేలర్. ఆ అనువాదం నేటికీ ప్రామాణిక గుజరాతీ బైబిలు గ్రంథముగా మిగిలిపోయింది. గుజరాతీ భాషలో అతను వ్రాసిన స్తుతికీర్తనలు ఆ భాష యొక్క సమృద్ధిని కలిగియుండుటచే అతను “గుజరాతీ కవితా పితామహుడు” అనే పేరును కూడా సంపాదించుకున్నారు. టేలర్ గుజరాతీ భాషలోకి అనువదించిన అనేక క్రైస్తవ పుస్తకాలు ఈ నాటికి కూడా గుజరాత్‌లోని అనేకమంది జీవితాలలో వెలుగును నింపుతున్నాయి.

ప్రియమైనవారలారా, మీ పరిచర్యలో మీరు ఎక్కువగా దేవునిపై ఆధారపడుతున్నారా లేక మనుష్యుల నుండి అందే ఆర్థిక సహాయముపై ఆధారపడుతున్నారా?

"ప్రభువా, ఇతరుల నుండి నాకు లభించే సహాయముతో సంబంధం లేకుండా, మీపైనే ఆధారపడి, మీరు నాకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుటలో ముందుకు సాగిపోవుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment