- జననం: 24-12-1810
- మహిమ ప్రవేశం: 16-09-1849
- స్వస్థలం: బెర్రీవ్
- దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
- దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం
ఇంగ్లాండుకు చెందిన థామస్ జోన్స్ భారతదేశంలోని అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాలలో ఉన్న ఖాసీ అనే తెగలవారి మధ్య మొదటిగా జరిగించిన పరిచర్యకు పేరుగాంచిన మిషనరీ. బాల్యం నుండి అతను తమ కుటుంబ పోషణ కొరకై తన తండ్రి యొక్క వడ్రంగి పనిలో సహకారిగా ఉండేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను అధికారికంగా విద్యను అభ్యసించలేకపోయారు. అయినప్పటికీ, వారి క్రైస్తవ సంఘ కార్యకలాపాలలో చాలా చురుకుగా ఉండే అతను, 25 సంవత్సరాల వయస్సులోనే బోధించడం ప్రారంభించారు.
అతను లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) తరఫున మిషనరీ సేవ చేయుటకు ముందుకువచ్చారు గానీ, ఆరోగ్యపరంగా అతని యొక్క బలహీన స్థితిని బట్టి ఆ సంస్థవారు అతనిని మిషనరీగా పంపుటకు నిరాకరించారు. అయినప్పటికీ దేవుని పిలుపును గురించి దృఢమైన నిశ్చయం కలిగియున్న జోన్స్ 1840వ సంll లో ‘కాల్వినిస్టిక్-మెథడిస్ట్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ (సి.ఎమ్.ఎఫ్.ఎమ్.ఎస్.) అనే సంస్థను స్థాపించారు. ఎక్కడికి వెళ్ళవలెనని అతను ప్రార్థనాపూర్వకంగా వివిధ ప్రదేశాలను పరిగణలోకి తీసుకొని యోచిస్తుండగా, దేవుడు ఈశాన్య భారతదేశంలో పరిచర్య చేయుట కొరకు అతనికి ద్వారము తెరిచాడు.
తన జీవిత భాగస్వామి అన్నేతో కలిసి 1841వ సంll ఏప్రిల్ మాసములో భారతదేశంలోని కలకత్తా నగరమును చేరుకున్నారు జోన్స్. అక్కడి నుండి అతను ఖాసీ కొండలలోని ప్రజలను చేరుకొనుటకై పయనమయ్యారు. సహాయం చేయుటకు ఎటువంటి స్నేహితులు వారికి లేరు. ఆ మిషనరీ దంపతులు ప్రయాణంలో అధిక భాగం కాలినడకనే కొండలను ఎక్కుతూ 4000 అడుగుల ఎత్తులో ఉన్న చిరపుంజి ఊరికి చేరుకున్నారు. స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకొనుటకు జోన్స్‌కు కొంత సమయం పట్టింది. అతను సువార్తతో వారిని సంధించుటకు తన వడ్రంగి మరియు వ్యవసాయ సంబంధిత నైపుణ్యములను ఉపయోగించారు.
జోన్స్ స్థానిక భాషను నేర్చుకుని దానికి లిపిని కల్పించారు. అతను మత్తయి సువార్తను ఖాసీ భాషలోకి అనువదించారు మరియు ఖాసీ నిఘంటువును కూడా ప్రచురించారు. విశ్రాంతి, విరామం లేకుండా ఖాసీ-జైన్తియా కొండల అంతటా సువార్త ప్రకటించుచూ ప్రయాణించిన అతను, అనేక మిషన్ కేంద్రములను స్థాపించారు. అంతేకాదు, అస్సాం మరియు మేఘాలయలలో సామాజిక, ఆత్మీయ, సాహిత్య మరియు ఆర్థిక పునరుజ్జీవనానికి నాయకునిగా మారారు జోన్స్.
ఈ పరిచర్య అంతటినీ అనేక పరీక్షలను, శ్రమలను అధిగమించి జరిగించారు జోన్స్. భారతదేశమునకు వచ్చిన నాలుగేళ్ళలోనే తన బిడ్డను మరియు భార్యను అతను కోల్పోయారు. ఉష్ణమండల వాతావరణం మరియు సువార్త ప్రకటించుటకు అలుపెరుగక తాను చేసిన ప్రయాణాల వలన అతని దేహము కూడా బాగా దెబ్బతిన్నది. మలేరియా బారినపడిన అతను, 39 సంll ల తక్కువ వయస్సులోనే ఈ లోక యాత్రను ముగించి ప్రభు సన్నిధానమును చేరుకున్నారు.
దేవుడు తన సేవకుని ఘనపరిచాడు. మేఘాలయ ప్రజలు అతను అక్కడికి వచ్చిన జూన్ 22వ రోజును “రెవ. థామస్ జోన్స్ డే” గా జరుపుకుంటారు మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజును సెలవుదినముగా ప్రకటించింది. అక్కడ అతను చూపిన ప్రభావం అటువంటిది!
ప్రియమైనవారలారా, ఇతరులు అంగీకరించని కారణంగా మీరు మీ పరిచర్యలో నిరాశ చెందియున్నారా?
దేవుడు మీ కొరకు నిశ్చయముగా వేరొక ద్వారమును తెరుస్తాడు
ప్రభువా, మీ అంగీకారమునకే గానీ మనుష్యుల ఆమోదమునకై నేను ఎదురుచూడకయుండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment