మోసెస్ క్లార్క్ వైట్ గారి జీవిత చరిత్ర
- జననం: 24-07-1819
- మహిమ ప్రవేశం: 24-10-1900
- స్వస్థలం: ఒనిడా కౌంటీ
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: చైనా
మోసెస్ క్లార్క్ వైట్ అమెరికన్ మెథడిస్టు సంఘము తరఫున చైనాకు వెళ్ళి సేవ చేసిన ఒక మార్గదర్శక వైద్య మిషనరీ. రెవ. స్టీఫెన్ ఓలిన్ చేసిన ఒక ప్రసంగం ద్వారా ప్రభావితులై తన జీవితమును మిషనరీ సేవకై సమర్పించుకొనవలెనని నిర్ణయించుకున్నారు వైట్. 1845వ సంll లో పట్టభద్రులైన తరువాత అతను యేల్ అనే ప్రాంతములో రెండు సంవత్సరాల పాటు వైద్యశాస్త్రమును మరియు రెవ. ఓలిన్ యొక్క మార్గదర్శకత్వంలో తత్వశాస్త్రమును అభ్యసించారు. ఆ సమయంలో అతను యేల్‌కు ప్రక్కన ఉన్న మిల్‌ఫోర్డ్ పట్టణములో దేవుని వాక్యమును బోధించారు కూడా.
1847వ సంll మార్చి 13న జేన్‌ను వివాహం చేసుకున్నారు వైట్. జేన్ కూడా మిషనరీ సేవకైన పిలుపును కలిగియున్నవారు. వారిరువురు కలిసి 1847వ సంll ఏప్రిల్ 15వ తారీఖున చైనాకు పయనమయ్యారు. ఐదు నెలల పాటు సాగిన కష్టతరమైన సముద్రయానం తరువాత 1847వ సంll సెప్టెంబరు 7వ తారీఖున చైనాలోని ఫూ చౌ ప్రాంతమునకు చేరుకున్నారు ఆ మిషనరీ దంపతులు. అక్కడ మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో ప్రబలంగా ఉన్న నల్లమందు వ్యసనాన్ని చూసి వైట్ ఆశ్చర్యపోయారు. పెరిగిపోతున్న పేదరికం, నేరాలు మరియు అనారోగ్యంతో ఆ భూభాగం ఎంతో దుస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల మధ్య అక్కడ సువార్తను విస్తరింప చేయడం ప్రారంభించారు వైట్.
తన వైద్య పరిజ్ఞానమును ఉపయోగించి అతను నల్లమందు ప్రజల ఆరోగ్యముపై చూపిన విష ప్రభావాలకు చికిత్స చేయడం ప్రారంభించారు. మాదక ద్రవ్యాల యొక్క బానిసత్వం నుండి ప్రజల దృష్టిని మరల్చవలెనని అతను ఒక చిన్న పాఠశాలలను ప్రారంభించి ప్రజలకు విద్యను అందించడం మొదలుపెట్టారు. అదే సమయంలో స్థానికముగా మాట్లాడే ఫూ చౌ భాషా మాండలికమును కూడా నేర్చుకొనిన అతను, కొన్ని స్తుతికీర్తనలను ఆ భాషలోనికి అనువదించారు. అంతేకాకుండా మత్తయి సువార్తను కూడా అతను స్థానిక మాండలికంలోకి అనువదించారు.
క్రమంగా అక్కడ సమాజంలో మార్పు వచ్చినప్పటికీ క్రైస్తవ్యమునకు మారినవారైతే ఎవరూ లేరు. అయినప్పటికీ ఆ ఫలితాలతో నిరాశ చెందక, తాను ఏ పని చేయుటకైతే పిలువబడ్డారో దానిని కొనసాగించారు వైట్. పైగా అతని పరిచర్యకు వ్యతిరేకత కూడా ఎదురయ్యింది. ఒకసారి కొంతమంది గుంపుగా వచ్చి అతనిని తీవ్రంగా కొట్టారు. ప్రజలలో విదేశీయత పట్ల నెలకొనియున్న వ్యతిరేక భావం కారణంగా అతను తాను కొనుగోలు చేసే భూములలో కూడా క్రైస్తవాలయాలు నిర్మించుటకు అనుమతించబడలేదు. చైనాకు వచ్చిన మూడేళ్ళకే అతను తన భార్యను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ, అతను ఏడు సంవత్సరాల పాటు ఫూ చౌలో సేవను కొనసాగించారు.
అయితే, తన అనారోగ్యం కారణంగా వైట్ న్యూయార్క్‌కు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. కానీ అతని కృషి వ్యర్థము కాలేదు. అతని అడుగుజాడలను అనుసరించి మరికొందరు ఫూ చౌకు తమ మార్గమును మళ్ళించినవారై, అక్కడ అతను వేసిన పునాదులపై దేవుని రాజ్యమును నిర్మించారు. న్యూయార్క్‌లో అతను తన వైద్యశాస్త్ర విద్యాభ్యాసమును పునఃప్రారంభించారు మరియు అదే సమయంలో మెథడిస్టు సంఘములో ఒక మతాధికారిగా పనిచేశారు.
ప్రియమైనవారలారా, మాదకద్రవ్యాలకు మరియు మద్యానికి బానిసలైనవారి రక్షణ కొరకు మీరు ఏమి చేస్తున్నారు?
"ప్రభువా, ఫలితాలను బట్టి నిరాశ చెందక, మీరు నాకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment