Search Here

Dec 15, 2021

Patricia Anne Wikinson Life History

ప్యాట్రిసియా అన్నే వికిన్సన్ గారి జీవిత చరిత్ర







  • జననం: 15-04-1944
  • మహిమ ప్రవేశం: 06-03-2011
  • స్వస్థలం: హర్ట్స్‌విల్లే
  • దేశం: ఆస్ట్రేలియా
  • దర్శన స్థలము: నైజీరియా మరియు ఆస్ట్రేలియా

 ఆస్ట్రేలియాకు చెందిన వైద్య మిషనరీయైన ప్యాట్రిసియా అన్నే వికిన్సన్, నైజీరియాలో అందించిన సేవలకు ప్రసిద్ధి చెందారు మరియు ఆస్ట్రేలియాలో ‘ఉమెన్-చర్చ్ మూవ్‌మెంట్’ (స్త్రీల క్రైస్తవ సంఘ ఉద్యమం) యొక్క నాయకురాలిగా కూడా పేరుగాంచారు. ముగ్గురు కుమార్తెలున్న కుటుంబములో జన్మించిన ప్యాట్రిసియా దేవుని యందలి భయభక్తులతో పెంచబడగా, చిన్నతనం నుండే ఆమెలో మిషనరీ సేవ కొరకైన మనస్సు పెంపొందించబడింది. ఆమె చాలా తెలివైన విద్యార్థిని. బాల్యంలో ఆమె పాఠ్యేతర కార్యకలాపాలపై కూడా ఆసక్తి కలిగియుండేవారు. ఆమె సిడ్నీలో వైద్యశాస్త్రం చదువుటకు కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకొనగా, అది నైజీరియా మరియు ఆస్ట్రేలియా దేశాలలో ఆమె యొక్క మిషనరీ సేవకు పునాదిగా మారింది.

 తన ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకొనిన వెంటనే ప్యాట్రిసియా ఆఫ్రికాలో అనేక ఆసుపత్రులను కలిగియున్న ఒక మిషనరీ సంస్థ అయిన ‘సొసైటీ ఇంటర్నేషనల్ మిషనైర్’ (SIM - ఎస్.ఐ.ఎమ్.) తో కలిసి పనిచేశారు. 1968వ సంll లో ఆమె నైజీరియాలోని జోస్‌లో ఉన్న ‘సూడాన్ ఇంటీరియర్ మిషన్ హాస్పిటల్‌’ లో చేరి, వైద్యురాలిగాను మరియు శస్త్ర చికిత్స నిపుణురాలిగాను పని చేయడం ప్రారంభించారు. తదుపరి కొంతకాలం ఆస్ట్రేలియాకు తిరిగివెళ్ళిన ఆమె, ఆ సమయంలో రాబర్ట్ బ్రెన్నాన్‌ను వివాహం చేసుకున్నారు. అటుపిమ్మట త్వరలోనే ఆఫ్రికాకు తిరిగి వెళ్ళారు ప్యాట్రిసియా. అక్కడ ఆమె భర్త విద్యపరమైన పరిచర్యను ప్రారంభించగా, ఆమె వైద్యురాలిగా సేవ చేయుటను కొనసాగించారు. అంతేకాదు, ఆఫ్రికా మహిళల దుస్థితిని చూసి చలించిపోయిన ఆమె, వారికి న్యాయం చేకూర్చుటకు, ప్రత్యేకించి అత్యాచారానికి గురైన వారి పునరావాసం కొరకు మరియు వారిని బలోపేతులను చేయుట కొరకు పనిచేయడం ప్రారంభించారు.

 అమోఘమైన తెలివితేటలు మరియు శక్తి కలిగియుండి ప్రపంచంలో మంచితనం మరియు సత్యం ప్రబలంగా ఉండాలనే ఆకాంక్ష కలిగియున్న ఒక స్త్రీ పాట్రిసియా. ఆ విధంగా ఈ లోకంలో మంచితనం మరియు సత్యం విరాజిల్లుటలో స్త్రీకి ముఖ్యమైన పాత్ర ఉందని ఆమె విశ్వసిస్తారు. కావున, ఆమె వివిధ క్రైస్తవ సంఘములకు చెందిన స్త్రీలను ఏకం చేసి, వారి ఆత్మీయపరమైన స్వేచ్ఛను పెంపొందించడం ప్రారంభించారు. ఆమె కృషి మరియు దర్శన ఫలితముగా ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా మహిళలు వివిధ హోదాల్లో పరిచర్య చేస్తున్నారు. ఆమె తనదు ఎనభైల మధ్య సంవత్సరాల నుండి తొమ్మిది పదుల వయస్సు వరకు రేడియో మరియు దూరదర్శిని (టి.వి.) రెండింటిలోనూ ‘ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్’ (ఎ.బి.సి.) యొక్క మతపరమైన ప్రసార బృందముతో కలిసి పనిచేశారు.

 ప్యాట్రిసియా నైపుణ్యం కలిగిన ఒక శస్త్ర చికిత్స నిపుణురాలు, కనికరముతో నిండిన మిషనరీ మరియు ఒక ఆకర్షణీయమైన క్రైస్తవ నాయకురాలు. కొంతకాలం క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడిన తరువాత 2011వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచివెళ్ళారు 
ప్యాట్రిసియా అన్నే వికిన్సన్. 

ప్రియమైనవారలారా, ప్రపంచంలో మంచితనం మరియు సత్యం ప్రబలంగా ఉండుటకుగాను మీరు మీ నైపుణ్యమును మరియు అనుభవమును ఉపయోగించుచున్నారా?

"ప్రభువా, బలహీనులను బలపరుచుటకును మరియు విశ్వాసుల ఆత్మీయ స్వేచ్ఛను పెంపొందించుటకును నన్ను ఒక సాధనముగా వాడుకొనుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment