Search Here

Jan 30, 2022

Algernon Stanley Smith Life History

అల్జర్నాన్ స్టాన్లీ స్మిత్ గారి జీవిత చరిత్ర




 

  • జననం: 14-02-1890
  • మహిమ ప్రవేశం: 28-07-1978
  • స్వస్థలం: లురా షాన్సీ
  • దేశం: చైనా
  • దర్శన స్థలము: ఉగాండా మరియు రువాండా


అల్జీ అని ఆప్యాయంగా పిలువబడే అల్జర్నాన్ స్టాన్లీ స్మిత్, ఉగాండా మరియు రువాండాలలో పరిచర్య జరిగించిన బ్రిటిష్ ప్రొటెస్టంట్ వైద్య మిషనరీ. అతని తండ్రి ‘ది కేంబ్రిడ్జ్ సెవెన్’ అని పిలువబడే ఏడుగురు మిషనరీలలో ఒకరైన స్టాన్లీ స్మిత్. కేంబ్రిడ్జ్‌కు చెందిన అతను చైనాలో సేవ చేశారు. ఒక ఏడాది వయస్సున్నప్పుడు తన తల్లిని కోల్పోయిన అల్జీ, క్రైస్తవ పరిచర్యలో ఆసక్తి కలిగియున్న అలిస్ మరియు ఎమిలీ వాట్నీ అనేవారి సంరక్షణలో ఇంగ్లాండులో పెరిగారు. వారి నుండి పొందిన ఆర్థిక సహాయంతో అతను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో వైద్య శాస్త్రమును అభ్యసించి 1914వ సంll లో వైద్య పట్టాను పొందారు.


అతని తల్లిదండ్రులు మిషనరీలు అయినప్పటికీ మిషనరీ సేవకైన దేవుని పిలుపు వ్యక్తిగతమైనదని అల్జీ విశ్వసించారు. కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో అల్జీ మరియు అతని స్నేహితుడు డాll లియోనార్డ్ షార్ప్ ఆఫ్రికాలో వైద్య మిషనరీ పని యొక్క ఆవశ్యకతను గురించి వినడం జరుగగా, అందుకొరకు దేవుడు తమకు బలమైన పిలుపునిస్తున్నట్లు వారు భావించారు. కావున, ఆఫ్రికాలోని ఉగాండాలో సేవ చేసేందుకు వారిరువురూ ‘చర్చి మిషనరీ సొసైటీ’ (సి.ఎమ్.ఎస్.) అనే సంస్థతో కలిసి పనిచేయుటకు ముందుకు వచ్చారు.


1916వ సంll లో లియోనార్డ్ షార్ప్‌తో కలిసి ఉగాండా చేరుకున్న అల్జీ, కంపాలా అనే ప్రాంతంలో వైద్య సేవను ప్రారంభించారు. తరువాత వారు పరిచర్యను విస్తరింపజేయుటకుగాను చుట్టుప్రక్కల గ్రామాలను పరిశీలించుటకు వాటిని సందర్శించడం ప్రారంభించారు. అయితే, నిధుల కొరత కారణంగా మిషన్ విస్తరణకు సి.ఎమ్.ఎస్. సంస్థవారు అంగీకరించలేదు. ఇది వారిని నిరుత్సాహపరచలేదు సరికదా, బదులుగా వారు విశ్వాసము పైనే ఆధారపడి చుట్టుప్రక్కల గ్రామాలలో పరిచర్య చేయడం ప్రారంభించారు. దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు. కాగా ఏ సంస్థ సహాయం లేకుండానే వారు తదుపరి నాలుగు సంవత్సరాలలో అనేక గ్రామాలకు మిషన్ పనిని విస్తరింపజేశారు.


1921వ సంll లో తన భార్యతో కలిసి కబాలే చేరుకున్నారు అల్జీ. ఈ పర్యాయం అతను వైద్య సేవ మరియు సువార్త పరిచర్య మాత్రమే కాకుండా విద్యాసంబంధమైన పనిని కూడా ప్రారంభించారు. క్రీస్తు యొక్క జ్ఞానంలో ఎదుగులాగున ప్రస్తుత తరం పిల్లలకు బోధించినట్లయితే ఉగాండా యొక్క భవిష్యత్తు సురక్షితముగా ఉంటుందని అతను విశ్వసించారు. దేశానికి మరియు క్రైస్తవ సంఘమునకు కూడా సేవ చేయునట్లు విద్యార్థులకు శిక్షణనిచ్చుటను కూడా పాఠశాల పాఠ్యప్రణాళికలో పొందుపరిచారు. అంతేకాదు, రువాండా మిషన్‌ను ఏర్పాటు చేయడంలో కూడా అల్జీ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ మిషన్ ద్వారా అనేక మంది మిషనరీలు ఉగాండా, రువాండా, బురుండి మరియు తూర్పు కాంగోలోని ప్రాంతాలకు సిలువ సందేశమును తీసుకువెళ్ళారు.


ఉగాండా మరియు రువాండా యొక్క జనాభాలో 80% కంటే ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉండుటకు కారణమైన కొద్ది మంది వ్యక్తులలో అల్జర్నాన్ స్టాన్లీ స్మిత్ ఖచ్చితముగా ఒకరిగా నిలుస్తారు.


ప్రియమైనవారలారా, మీరు వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నారా?


ప్రభువా, సందేహం మరియు భయం వలన కలిగే అపోహలను నిరోధించి, విశ్వాసముతో ధైర్యముగా మీ కొరకు పని చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!


 దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment