Search Here

Jan 26, 2022

Ann Wilkins Life History

ఆన్ విల్కిన్స్  గారి జీవిత చరిత్ర





  • జననం: 30-06-1830
  • మహిమ ప్రవేశం: 13-11-1857
  • స్వస్థలం: హడ్సన్ వ్యాలీ
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: లైబేరియా

మెథడిస్టు మిషనరీ సొసైటీ యొక్క కార్యదర్శియైన (సెక్రటరీ) నాథన్ బ్యాంగ్స్ ఒక చిన్న ఉత్తరమును అందుకున్నారు. అందులో ఈ విధంగా వ్రాసియుంది, “కొద్దిపాటి డబ్బును కలిగియున్న ఒక సహోదరి, ఆ కొంచెం డబ్బునే ఉత్సాహముగా పరిచర్య కొరకు ఇస్తుంది. అవసరమైతే తాను ఒక మిషనరీ ఉపాధ్యాయురాలిగా సేవ చేయుటకు తన జీవితమును సమర్పించుటకు ఆమె సిద్ధంగా ఉంది." ఈ గొప్ప మాటలను నాథన్‌కు వ్రాసినవారు ఆన్ విల్కిన్స్.

క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆన్ విల్కిన్స్ పద్నాలుగేళ్ళ వయసులో క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో న్యూయార్క్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి బోధించడం ప్రారంభించిన ఆమె, మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ఆదివారపు బైబిలు పాఠశాలను (సండే స్కూల్‌ను) కూడా నడిపించేవారు. ఆ సమయంలో ఆమెకు మిషనరీ సేవ పట్ల ఆసక్తి ఏర్పడింది. కాగా తన కోరిక గురించి తెలియపరచుచూ ఆమె మిషనరీ సొసైటీకి లేఖను వ్రాశారు. మిషనరీ సంస్థ నుండి తనకు ఆహ్వానం అందకపోయినప్పటికీ, ఆమె మిషనరీ సేవ కొరకు తనకు ద్వారము తెరువబడుటకు ప్రార్థనాపూర్వకంగా వేచియున్నారు.

1836వ సంll లో, లైబేరియాలో సేవ చేస్తున్న జాన్ సేస్ అనే మిషనరీ ఆఫ్రికాలో జరుగుతున్న మిషనరీ పనిలో తనతో చేరమని ప్రజలను అభ్యర్థించడం ఆన్ వినడం జరిగింది. కాగా దేవుని పరిచర్య చేయుటకు తనకున్న సుముఖతను తెలియపరుస్తూ తిరిగి మిషనరీ సొసైటీకి ఆమె లేఖను వ్రాయగా, ఈసారి ఆమె లైబేరియాలో సేవ చేయుటకు అంగీకరించబడ్డారు.

1837వ సంll లో మరికొంతమందితో కలిసి లైబేరియాకు చేరుకున్న ఆన్, వెంటనే మన్రోవియాలో విద్యా సంబంధమైన పనిని ప్రారంభించారు. ఆమె ఎంతో ఉత్సాహము కలిగిన ఒక ఉపాధ్యాయురాలు. అక్కడి కఠినమైన వాతావరణం తన శరీరానికి సరిపడక పోయినప్పటికీ, ఆమె ఉత్సాహంగా గ్రామాలలో తిరుగుతూ పిల్లలకు మరియు మహిళలకు విద్యను అందించారు మరియు సువార్తను బోధించారు. తరువాత ఆమె కాల్డ్‌వెల్‌లో ఒక పాఠశాలను మరియు మోంట్‌సెరాడో కౌంటీలో ఒక మహిళా బోర్డింగ్ పాఠశాలను స్థాపించారు.

లైబేరియాలో తన పరిచర్య ప్రారంభించిన నాటి నుండి భయంకరమైన జ్వరాల బారినపడుతూనే ఉన్నారు ఆన్. ఒకసారి ఆమె మరణపుటంచులలో ఉండగా, కోలుకొనుటకుగాను అమెరికాకు తిరిగివెళ్ళుటకు ఆమెను ఆమె స్నేహితులు బలవంతం చేశారు. కోలుకొనిన తరువాత కూడా ఆమె ఆరోగ్యం బలహీనంగా ఉన్న కారణంగా ఆమెను తిరిగి ఆఫ్రికాకు పంపుటకు మెథడిస్టు మిషన్ సిద్ధంగా లేదు. కానీ, ఆమె దృఢ సంకల్పం ఆమెను వెనక్కు తగ్గనివ్వలేదు. కాగా పరిచర్యను కొనసాగించుటకు మరో ముగ్గురు మిషనరీలతో కలిసి 1854వ సంll లో ఆమె లైబేరియాకు తిరిగి వచ్చారు.

అయితే ఆమె దేహం వెంటనే కృశించిపోవడం మొదలైంది. కావున 1857వ సంll ఏప్రిల్ మాసంలో అమెరికాకు తిరిగి వచ్చిన ఆన్ విల్కిన్స్, అదే సంవత్సరం నవంబరు మాసంలో తుది శ్వాస విడిచారు.

ప్రియమైనవారలారా, భౌతిక సంబంధమైన అర్పణలే కాక, మిషనరీ పని కొరకు మీ జీవితమును సమర్పించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

ప్రభువా, నేను నా జీవితమును మీకు సమర్పిస్తున్నాను. మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment