రాబర్ట్ మోఫాట్ గారి జీవిత చరిత్ర
- జననం: 21-12-1795
- మహిమ ప్రవేశం: 09-08-1883
- స్వస్థలం: ఓర్మిస్టన్
- దేశం: స్కాట్లాండు
- దర్శన స్థలము: దక్షిణాఫ్రికా
స్కాట్లాండుకు చెందిన రాబర్ట్ మోఫాట్ లండన్ మిషనరీ సొసైటీ ద్వారా ఆఫ్రికాలో సేవ చేసిన ఒక మిషనరీ. అతను ప్రసిద్ధిచెందిన మిషనరీ మరియు అన్వేషకుడు అయిన డేవిడ్ లివింగ్‌స్టన్ యొక్క మామగారు. బాల్యం నుండీ అతను క్రైస్తవత్వం ద్వారా బలముగా ప్రభావితం చేయబడ్డారు. తరువాత ఉపాధి కోసం ఇంగ్లాండుకు వెళ్ళిన రాబర్ట్ అక్కడ ఒక తోటమాలిగా పనిచేశారు. అక్కడ తన యొక్క మెథడిస్టు స్నేహితుల ద్వారా రక్షణానుభవములోనికి అతను నడిపింపబడ్డారు. మిషనరీ పని పట్ల ఆసక్తి కలిగియున్న రాబర్ట్ ఒకసారి ‘‘ది లండన్ మిషనరీ సొసైటీ’’ అని రాయబడియున్న బోర్డు ఒకటి చూడటం జరిగింది. అది దేవుని సేవ చేయాలనే ఆసక్తిని అతనిలో రేకెత్తించింది. ఆ సొసైటీలో ఉన్న రెవ. డబ్ల్యు. రాబీ అతనిని చేరదీసి, భవిష్యత్తు సేవ కొరకు రాబర్టును సిద్ధపరిచారు.
1817వ సంll లో లండన్ మిషనరీ సొసైటీ రాబర్ట్‌ను దక్షిణాఫ్రికాకు పంపింది. అతనికి అప్పగింపబడిన మొట్టమొదటి బాధ్యత ఏమనగా నమక్వాలాండ్‌లో సేవ చేయడం. అప్పటిలో ఆ ప్రాంతం ఆఫ్రికానెర్ అనే ఒక చట్టవిరుద్ధమైన వ్యక్తి యొక్క నియంత్రణలో ఉంది. గతములో మిషనరీలను భయాందోళనలకు గురిచేసి, మిషన్ శిబిరాలను నాశనం చేసినవానిగా పేరొందిన బందిపోటు అతను. అయినప్పటికీ ఆ కష్టమైన ప్రయాణానికి ధైర్యముగా ముందుకు వచ్చిన రాబర్ట్‌కు ఆ గ్రామములో కేవలం వ్యతిరేకత మాత్రమే ఎదురయ్యింది. అయితే ఆ శ్రమలన్నింటినీ అతను సహనముతో భరించి అక్కడి ప్రజలకు సువార్తను ప్రకటించారు. తద్ఫలితముగా ఆఫ్రికానెర్ యొక్క మనోనేత్రాలు తెరువబడి ఒక మంచి క్రైస్థవునిగా మారారు. తరువాతి కాలములో అతను మిషనరీ పరిచర్యలో రాబర్ట్‌కు మంచి సహాయకారిగా కూడా ఉన్నారు. ఈ ఫలితం రాబర్ట్‌కు మిగుల సంతోషాన్ని కలిగించింది.
తన పరిచర్యలో భాగస్వామి అయిన మేరీ స్మిత్‌ను 1819వ సంll లో రాబర్ట్ వివాహం చేసుకున్నారు. తదుపరి కురుమన్ ప్రాంతములో స్థిరపడిన ఈ మిషనరీ దంపతులు అక్కడి బాట్స్వానా ప్రజల మధ్య సేవ చేశారు. అక్కడ వారు ఎదుర్కొన్న కష్టాలను, శ్రమలను, అవమానాలను, బెదిరింపులను, అన్నింటినీ భరించి, దేవుని పరిచర్య చేయుటకు మిగుల వాంఛ కలిగినవారై తమ సేవను కొనసాగించారు. వారు రోజుల తరబడి ఆకలితోనే నిద్రించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ఆకలి బాధను తట్టుకోవడానికి వారి కడుపులను గట్టిగా కట్టి ఉంచుకునేవారు కూడా. ఈ శ్రమలన్నింటి మధ్య రాబర్ట్ త్స్వానా భాషకు ఒక శైలిని అభివృద్ధి చేసి, 1840వ సంll లో ఆ భాషలో క్రొత్త నిబంధనను మరియు 1857వ సంll లో పూర్తి బైబిలు గ్రంథాన్ని ప్రచురించారు. అంతేకాకుండా అక్కడి ప్రమాదకరమైన బెచువానా మరియు మాంటటీ తెగలకు కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించారు రాబర్ట్. తదుపరి 1870వ సంll లో అనారోగ్యం కారణంగా రాబర్ట్ మరియు మేరీలు తమకు ప్రియమైన కురుమన్‌కు వీడ్కోలు పలికి, ఇంగ్లాండు దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ దేవుని సేవను కొనసాగించిన రాబర్ట్ మోఫాట్ బోధిస్తూ, ప్రజలను మిషనరీ సేవ కొరకై ప్రోత్సహిస్తూ తన మిగిలిన జీవితాన్ని గడిపారు.
ప్రియమైనవారలారా, చట్టవిరుద్ధముగా జీవించేవారి యెడలను మరియు నేరస్థుల యెడలను క్రీస్తు కలిగియున్నటువంటి భారమును మీరు కలిగియున్నారా?
ప్రభువా, ఖైదీలకును, నేరస్థులకును మీ ప్రేమను ప్రకటించుటకు నాకు ధైర్యము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment