బెంజమిన్ హాబ్సన్ గారి జీవిత చరిత్ర
- జననం: 02-01-1816
- మహిమ ప్రవేశం: 16-02-1873
- స్వస్థలం: వెల్ఫోర్డ్, నార్తాంప్టన్‌షైర్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: చైనా
చాలా మంది క్రైస్తవ మిషనరీలు సువార్త యొక్క ప్రచార సాధనంగా విద్య, వైద్యం మొదలైన సామాజిక సేవలను ఉపయోగించారు. అటువంటి పరిస్థితులలో కొందరు సువార్త ప్రకటన నుండి తొలగిపోయి కేవలం సామాజిక సేవలను అందించుటలో మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. అయితే భౌతిక సేవలను అందిస్తూనే సువార్త ప్రకటన పై నుండి తమ దృష్టిని మరల్చని వారు కూడా ఉన్నారు. అటువంటి మిషనరీలలో ఒకరు బెంజమిన్ హాబ్సన్. మన భూసంబంధమైన సేవ క్రీస్తును కేంద్రంగా కలిగియుండాలనునది ఇది తెలియపరుస్తుంది.
బెంజమిన్ హాబ్సన్ చైనాలో పరిచర్య చేసిన బ్రిటిష్ వైద్య మిషనరీ. వైద్య విద్యను మరియు శిక్షణను పూర్తిచేసుకొనిన తరువాత లండన్ మిషనరీ సొసైటీలో చేరారు హాబ్సన్. 1839వ సంll లో 23 ఏళ్ళ ఈ యువ మిషనరీ తన జీవిత భాగస్వామితో పాటు చైనాలోని మకావో చేరుకున్నారు. మెడికల్ మిషనరీ సొసైటీ పర్యవేక్షణలో ఉన్న మకావోలోని ఒక ఆసుపత్రిలో హాబ్సన్ తన సేవను ప్రారంభించారు. మొదటి ఆంగ్లో-చైనీస్ యుద్ధం (1839-42) సమయంలో ఒక బ్రిటిష్ మిషనరీకి అది ఎంతో ప్రమాదకరం అయినప్పటికీ మకావోలో సేవ చేయడం కొనసాగించి, అతను వైద్య మిషనరీగా తన సమర్పణను కనుబరిచారు. ఆ సమయంలో అతను కరువు, మశూచి, కలరా, కుష్ఠు వ్యాధి మరియు నల్లమందు వ్యసనం కారణంగా బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడంపై తన దృష్టిని కేంద్రీకరించారు.
‘మెడికల్ మిషనరీ హాస్పిటల్ హాంకాంగ్’ ను స్థాపించుటకుగాను 1843వ సంll లో హాంకాంగ్‌కు వెళ్ళారు హాబ్సన్. తన భార్య అనారోగ్యం కారణంగా 1845వ సంll లో అతను ఇంగ్లాండుకు వెళ్ళుటకు పయనమయ్యారు కానీ, వారు ఇంగ్లాండు చేరుకునేలోపే అతని భార్య మరణించారు. 1847వ సంll లో హాంకాంగ్‌కు తిరిగివచ్చిన హాబ్సన్, 1848వ సంll లో కాంటన్ (ప్రస్తుతం గ్వాంగ్‌జౌ) అనే ప్రాంతమునకు వెళ్ళారు. ఎందుకంటే హాంకాంగ్ కంటే క్రైస్తవ మిషనరీల పట్ల తక్కువ సహనాన్ని కలిగి ఉన్న ప్రదేశమైన కాంటన్ అధిక అవసరతలో ఉందని అతను గ్రహించారు. అయితే రెండవ ఆంగ్లేయ-చైనా యుద్ధం (1856-60) అతని ఆసుపత్రి మూసివేతకు కారణమైంది మరియు అతను కాంటన్ వదిలి వెళ్ళవలసి వచ్చింది. కావున, హాంకాంగ్‌లో ఆశ్రయం పొందిన అతను, తరువాత 1857వ సంll లో షాంఘైకి వెళ్ళారు. అనారోగ్యం కారణంగా 1859వ సంll లో తాను ఇంగ్లాండుకు తిరిగి వచ్చే వరకు కూడా హాబ్సన్ అక్కడ సేవ చేశారు.
బెంజమిన్ హాబ్సన్ చైనా వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తారు. అనేక పుస్తకాలను రచించిన హాబ్సన్ చైనా భాషలో విజ్ఞాన శాస్త్రం (సైన్స్) గురించి రచనలు చేసిన మొదటి ప్రొటెస్టంట్ రచయిత. అతను అనేక మంది చైనా వైద్య విద్యార్థులకు కూడా శిక్షణనిచ్చారు. అతని రచనలు చైనా వైద్యంలో విప్లవము కలుగుటకు సహాయపడటమే కాక జపనీయుల వైద్యంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపాయి. విజ్ఞాన శాస్త్రంలో అతను అందించిన సేవలన్నింటికీ ఆధారం అతని క్రైస్తవ విశ్వాసమే. సువార్త ప్రకటనపై తాను దృష్టిని కేంద్రీకరించడం ద్వారా వైద్య సేవలను అందించడం అనేది ఆత్మీయ అవసరతలో ఉన్న ప్రజలతో తమ విశ్వాసమును పంచుకొనుటకు ఒక మార్గమని ఎత్తి చూపారు బెంజమిన్ హాబ్సన్.
ప్రియమైనవారలారా, మీరు ఏ సేవ చేసినా, ప్రజల ఆత్మీయ అవసరతలను తీర్చడంపై మీరు దృష్టి నిలుపుతున్నారా?
"ప్రభువా, భూసంబంధమైన నా సేవ కూడా క్రీస్తును కేంద్రముగా కలిగియుండునట్లు సహాయము చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment