విన్సెంట్ ఫెర్రర్ గారి జీవిత చరిత్ర
- జననం: 23-01-1350
- మహిమ ప్రవేశం: 05-04-1419
- స్వస్థలం: వాలెన్సియా
- దేశం: స్పెయిన్
- దర్శన స్థలము: ఐరోపా
ఒకానొకసారి ఒక మూరుల రాజు ఒక దైవజనుని యొక్క అద్భుతములను గురించి విన్నాడు. కాగా, ఆ దైవజనుడు అనుసరిస్తున్న మతం సరియయినది కాదని నిరూపించాలని తలంచిన ఆ రాజు అతనిని తన నగరానికి ఆహ్వానించి ప్రసంగించమని కోరాడు. అప్పుడు ఆ దైవజనుడు తన భాష అయిన స్పానిష్ భాషలో మాట్లాడినప్పటికీ, ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో అక్కడ రాజు యొక్క ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతను పలికిన ప్రతియొక్క పదాన్నీ తమ స్వంత భాషలో మాట్లాడినట్లు అర్థంచేసుకొనగలిగారు! ఆ నగరంలో అతను మూడు ఉపన్యాసాలు ప్రసంగించిన తరువాత దాదాపు ఎనిమిది వేల మంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందారు. ఆ దైవజనుడు మరెవరో కాదు, అనేక ఆత్మీయ వరములను కలిగియున్న విన్సెంట్ ఫెర్రర్.
స్పెయిన్ దేశంలోని ఒక ఉన్నతమైన కుటుంబములో జన్మించిన విన్సెంట్ తన బాల్యము నుండే ఆధ్యాత్మికత కలిగిన జీవితాన్ని గడిపారు. చాలా చిన్న వయస్సులోనే "ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్" (బోధకుల క్రమము)లో చేరిన అతను లేఖనములన్నింటినీ కంఠస్థం చేశారు. సంఘ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు మరియు విబేధాల కారణంగా క్రైస్తవ సంఘము క్లిష్ట పరిస్థితులగుండా వెళుతున్న సమయమది. ఆ విబేధాలను సరిచేయుటకు విన్సెంట్ తన వంతు ప్రయత్నం చేశారు.
తీవ్రమైన అస్వస్థత వలన ప్రాణాన్నే కోల్పోయేంత పరిస్థితులను ఎదుర్కొనిన తరువాత విన్సెంట్ దేవుని యొక్క నిజమైన పిలుపును కనుగొని, ఒక మిషనరీగా మారారు. 20 సంవత్సరాల పాటు అతను ఐరోపా ఖండమంతటా స్పెయిన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, జర్మనీ, స్కాట్లాండ్, ఇటలీ మొదలగు దేశాలలో ప్రసంగిస్తూ ప్రయాణించారు. ఒక అద్భుతమైన బోధకుడైన అతని యొక్క ప్రసంగాలన్నీ అధికశాతం బహిరంగ కూడికలలోనే ఇవ్వబడేవి. ఎందుకనగా అతను బోధించే దేవుని యొక్క ప్రేమాక్షమాపణలు, పాపం మరియు తీర్పులను గురించి వినడానికి తరలి వచ్చే ఆ గొప్ప జనసమూహాలను కూర్చుండబెట్టుటకు ఏ క్రైస్తవ ఆలయము కూడా సరిపోదు. ఆ బోధలు విన్నవారు తమ పాపముల నిమిత్తమై విచారిస్తూ, పశ్చాత్తాపపడి, క్రీస్తు కొరకు జీవించుటకు తమ జీవితాలను సమర్పించుకొనేవారు. అతను యూదా ప్రజల మధ్యను మరియు మూరుల మధ్యను కూడా సేవ చేసి, వారిలో వేలాదిమందిని క్రీస్తు వైపుకు నడిపించారు.
ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించిన విన్సెంట్ తన కొరకని దేనినీ తీసుకొనలేదు. అతనిపై ఉన్న గౌరవం కొలదీ అనేకమంది తమ ఆస్తులను అతనికి ఇచ్చారు. అయితే, అవియన్నియూ సువార్త సేవ విస్తరణ కొరకే వినియోగించబడ్డాయి. దేవుని శక్తితో నింపబడిన విన్సెంట్ అసంఖ్యాక రోగులను స్వస్థపరచడమే కాక చనిపోయినవారిని కూడా తిరిగిలేపారు. అతను చేసిన పరిచర్య యేసు క్రీస్తు ప్రభువును ప్రతిబింబిస్తుంది.
ప్రియమైనవారలారా, మీరు దేవుని శక్తి యొక్క సంపూర్ణతతో ఆయనను సేవిస్తున్నారా?
"ప్రభువా, నా శక్తిని మరుగుపరచి మీ యొక్క శక్తితో నన్ను నింపుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment