Search Here

Jan 6, 2022

Mary Moffat Livingstone Life History

మేరీ మోఫాట్ లివింగ్‌స్టన్ గారి జీవిత చరిత్ర



  • జననం: 12-04-1821
  • మహిమ ప్రవేశం: 27-04-1862
  • స్వస్థలం: గ్రిక్వాటౌన్
  • దేశం: ఆఫ్రికా
  • దర్శన స్థలము: ఆఫ్రికా

 దక్షిణాఫ్రికాలోని కురుమన్ అనే ప్రాంతంలో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన రాబర్ట్ మోఫాట్ మరియు మేరీ మోఫాట్ బెచువానా ప్రజల మధ్య సేవ చేశారు. ఈ మిషనరీ దంపతుల పెద్ద కుమార్తెయే మేరీ. చిన్నప్పటి నుండీ దేవుని యందలి భయభక్తులతో పెరిగిన మేరీ తాను కూడా ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేయాలని ఎప్పుడూ కోరుకునే వారు. ఆమె ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొంది, కురుమన్‌లో ఉన్న పాఠశాలలో పని చేశారు. నైపుణ్యం గలిగిన ఉపాధ్యాయినిగా మరియు గృహిణిగా స్థానిక ప్రజల మధ్య ఆమె మంచి గౌరవాన్ని పొందారు.

  1845వ సంll లో ఒక వైద్య మిషనరీ మరియు ఆఫ్రికా ఖండ అన్వేషకుడు అయిన డేవిడ్ లివింగ్‌స్టన్‌తో మేరీ యొక్క వివాహం జరిగింది. తన భర్త చేసే మిషనరీ సేవకు తనను పూర్తిగా అంకితం చేసుకున్న ఆమె లివింగ్‌స్టన్ సేవలో భాగముగా చేసే ప్రతి ప్రయత్నములోనూ అతనికి బలాన్ని మరియు తోడ్పాటును ఇచ్చే మంచి సహచారిణిగా మారారు. సింహాల యొక్క దాడులతో పీడింపబడుతూ, భయాందోళనలతో నిండుకొనియున్న మాబోట్సా అనే గ్రామ నివాసులకు లివింగ్‌స్టన్‌తో కలిసి సువార్త ప్రకటించుటకు ఆమె ధైర్యముగా ముందుకు వచ్చారు. ఒక ఆసక్తి గల అన్వేషకుడైన తన భర్తతో కలిసి ఆమె తన పిల్లలతో పాటు తరచుగా ఆఫ్రికా యొక్క దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూనే ఉండేవారు. ఎంతో కష్టతరమైన ఆ ప్రయాణాలు ప్రమాదకరమైనవిగా ఉండేవి. కొన్నిసార్లు రోజుల తరబడి నీరు దొరకని పరిస్థితులగుండా కూడా వారు ప్రయాణాన్ని సాగించారు. వారు మొట్ట మొదటిగా తలపెట్టిన ప్రయాణములో మేరీ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా, క్రొత్తగా జన్మించిన తమ కుమార్తెను కూడా కోల్పోయారు. అనారోగ్యంగానీ, గర్భము దాల్చిన క్లిష్ట పరిస్థితులు గానీ, తన బిడ్డను కోల్పోయిన హృదయ వేదన గానీ, ఏవీ కూడా తన భర్త యొక్క సేవలో సహకరించుటకు ఆమెను అడ్డుకోలేక పోయాయి. నాలుగవ సారి గర్భిణిగా ఉన్నప్పుడు కూడా మకోలోలో ప్రజలకు సువార్తను అందించుటకై 1500 మైళ్ళు కలహారి ఎడారి గుండా తన భర్తతో కలిసి ప్రయాణించుటకు ఆమె వెనుకంజ వేయలేదు. 

  సేవను ప్రారంభించిన తొలి దినములలో తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఎటువంటి లోటూ తెలియకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించిన జ్ఞానవంతురాలు మేరీ. తన పిల్లల యొక్క విద్యాభ్యాసం కొరకు 1852-56 వరకు భర్తను విడిచి ఆమె ఇంగ్లాండు దేశములో గడిపారు. మిషనరీ సేవలో ఆఫ్రికా అడవులలో ప్రయాణాలు కొనసాగిస్తున్న తన భర్త యొక్క యోగ క్షేమాలు తెలియక పోయినప్పటికీ, పిల్లలను పోషిస్తూ, వారిని క్రమశిక్షణలో పెంచుతూ ఆ నాలుగు సంవత్సరాలు ఆమె ఎంతో క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. తన వైవాహిక జీవితములో తాను అనుభవించిన ఒంటరితనాన్ని, ఎన్నో కష్టాలను ఆమె మౌనముగా భరించారు. జాంబెజి నది అన్వేషణలో ఉన్న తన భర్తను చేరుకొనుటకు 1858వ సంll లో ఆమె తిరిగి ఆఫ్రికాకు వెళ్ళారు. అక్కడ షుపాంగా మిషన్ శిబిరంలో మలేరియా బారిన పడిన మేరీ మూడు నెలల తరువాత మరణించారు.

ప్రియమైనవారలారా, మిషనరీ సేవకు సహకరించుటలో మీ పాత్ర ఏమిటి?

"ప్రభువా, ప్రపంచ నలుమూలలా జరుగుతున్న మిషనరీ సేవకు సహాయకారిగా ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment