Search Here

Jan 3, 2022

జియోకొండో పెండిన్ గారి జీవిత చరిత్ర

జియోకొండో పెండిన్ గారి జీవిత చరిత్ర








  • జననం: 09-08-1939
  • మహిమ ప్రవేశం: 09-03-2021
  • స్వస్థలం: విల్లావెర్లా
  • దేశం: ఇటలీ
  • దర్శన స్థలము: మొజాంబిక్

 ఇటలీకి చెందిన జియోకొండో పెండిన్ మిషనరీగా మొజాంబిక్‌లో పరిచర్య జరిగించారు. అతను ఎనిమిది మంది పిల్లలతో కూడిన దేవుని యందలి భయభక్తులు కలిగిన కుటుంబం నుండి వచ్చారు పెండిన్. పెరిగి పెద్దయినప్పుడు ఆ ఎనిమిది మంది కూడా వివిధ స్థాయిలలో పరిచర్య జరిగించినవారే. పెండిన్ ప్రాథమికోన్నత పాఠశాలలో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన తరువాత 1955వ సంll లో ఫ్లోరెన్స్ ఆశ్రమంలో ప్రవేశించి క్రైస్తవ సన్యాసిగా తన శిక్షణను ప్రారంభించారు. ఆ సమయంలో దేవుని వాక్యం అతనిని బలంగా దర్శించింది. పితరుల భక్తి వలన తాను దేవుని బిడ్డ కాలేనని, తన పాపాలకు పశ్చాత్తాపం చెందడం ద్వారా మాత్రమే ఆయన బిడ్డగా మారగలనని అతను గ్రహించారు. కాగా 1957వ సంll లో తిరిగి జన్మించిన అనుభవమును పొందారు పెండిన్.

 తదుపరి అతను బైబిలు వేదాంత శాస్త్రమును అధ్యయనం చేయుటకు రోమ్ నగరమునకు వెళ్ళారు. అక్కడ అతను ఊపిరితిత్తుల వ్యాధికి గురవ్వగా, ఐదు సంవత్సరాల పాటు అతను పరిచర్యకు దూరంగా ఉండవలసి వచ్చింది. తాను కొంచెం కోలుకోవడం ప్రారంభించిన వెంటనే అతను కోమోకు వెళ్లి సెమినరీలో (బైబిలు కళాశాలలో) పరిచర్య చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో మొజాంబిక్‌లో పరిచర్య చేయుటకు దేవుడు అతనికి ద్వారమును తెరువగా, 1972వ సంll లో నంపులాకు చేరుకొనిన పెండిన్, మొజాంబిక్‌లోని ముయేరియా, కాబాసీరా, నమహాకా, లూరియో మరియు కారపిరా ప్రాంతాలలో పరిచర్య చేయడం ప్రారంభించారు.

 ఆ సమయంలో పోర్చుగీసువారి పరిథిలో ఉన్న మొజాంబిక్ దేశం స్వాతంత్ర్యం కొరకు పోరాడుతోంది. తీవ్రమైన యుద్ధ సమయాలలో అక్కడ పరిచర్య చేసిన పెండిన్, యుద్ధ సమయాలలో కలిగే శ్రమలను అనుభవించారు. ఒక రోజు సాయంత్రం అతను కూడికను ముగించిన సమయములో కొంతమంది వ్యక్తులు ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి అతనిని మెడపై కాల్చారు. అతను రక్తస్రావంతో నేలపై పడియుండగా, వారు మందిరమును దోచుకొని, అతను చనిపోయాడని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే పెండిన్ ప్రాణాలతో బయటపడ్డారు! కొంతకాలం అతను పక్షవాతంతో బాధపడినప్పటికీ, తిరిగి నడవడం ప్రారంభించిన వెంటనే అతను పరిచర్య చేయుటకు తిరిగి వచ్చారు.

 అయితే అతను చురుకుగా సంచార పరిచర్యను చేయలేకపోయారు. కాగా అతను 1988వ సంll లో బైరాలో పాదిరిగా పరిచర్యను చేపట్టారు. అతను బైబిలును స్థానిక భాషయైన సిండావులోకి అనువదించడం ప్రారంభించి, ఐదేళ్ళలో దానిని పూర్తి చేశారు. చురుకైన బుద్ధిని, సృజనాత్మకతను మరియు స్పష్టమైన దృష్టిని కలిగియున్న అతను, తన చమత్కార స్వభావంతో కష్టమైన నిర్ణయాలను కూడా సులభముగా తీసుకునేవారు. పక్షవాతం మరియు మళ్ళీ మళ్ళీ తిరుగబెడుతున్న ఊపిరితిత్తుల వ్యాధులు శారీరక బాధను కలిగిస్తున్నప్పటికీ, మొజాంబిక్‌ను విడిచిపెట్టి వెళ్ళాలని అతను ఏనాడూ కోరుకొనలేదు. యాభై సంవత్సరాలకు పైగా పరిచర్యలో కొనసాగిన జియోకొండో పెండిన్, కోవిడ్-19 కారణంగా 2021వ సంll లో తన తుది శ్వాసను విడిచారు.

ప్రియమైనవారలారా, దేవుడు మీకు మంచి ఆరోగ్యమును దయచేశాడు. దానిని మీరు ఇతరులు ఆత్మీయముగా ఆరోగ్యవంతులైయుండుటకు ఉపయోగించుచున్నారా?

"ప్రభువా, మీరు నాకు దయచేసిన శారీరక ఆరోగ్యానికై వందనములు. దానిని సువార్త వ్యాప్తికై వినియోగించుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment