ఎలిజా డేవిస్ జార్జ్ జీవిత చరిత్ర
- జననం: 1879
- మహిమ ప్రవేశం: 1979
- స్వస్థలం: టెక్సాస్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: లైబేరియా
ఎలిజా డేవిస్ జార్జ్ ఒక ఆఫ్రికన్-అమెరికన్ మిషనరీ. ఆమె లైబేరియాలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచారు. గతంలో బానిసలుగా ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన ఎలిజా, తన పదహారేళ్ల వయసులో క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. సెంట్రల్ టెక్సాస్ కళాశాల నుండి పట్టభద్రులైన పిమ్మట ఆమె అదే కళాశాలలో బోధించడం ప్రారంభించారు.
1911వ సంll లో ఎలిజా ఒక క్రైస్తవ కూడికకు హాజరవ్వడం జరిగింది. అక్కడ ఆమె వినిన ప్రసంగం దేవునికి పరిచర్య చేయుట గురించి సవాలు చేసేదిగా ఉంది. అటు తరువాత ఒకసారి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనమును చూశారు. ఆ దర్శనములో ఆఫ్రికా ప్రజలు క్రీస్తు న్యాయసింహాసనము ఎదుట నిలువబడి, “కానీ, మా కొరకు నీవు చనిపోయావని ఎవరూ మాకు చెప్పలేదు.” అని చెబుతూ విలపిస్తున్నారు. వెంటనే ఎలిజా ఆఫ్రికాలో సేవ చేయమని దేవుడు తనను అడుగుతున్నాడని తన హృదయమందు గ్రహించారు.
తాను ఆఫ్రికాకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆమె తెలియపరచినప్పుడు ఆమెకు ఎంతో వ్యతిరేకత ఎదురయ్యింది. “అమెరికాలో చేయవలసినది ఇంకా చాలా ఉంది.” అని ఇతరులు ఆమెను నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ, తన మిషన్‌కు మద్దతును పొందేందుకు ఆమె రెండు సంవత్సరాల పాటు పట్టుదలతో వేచియున్నారు. తనను వ్యతిరేకించేవారికి ఆమె ఇచ్చే సమాధానం “దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు మీరు ఉండిపోమని చెబుతారా?”
చేతిలో ఉన్న కొద్దిపాటి నిధులతో 1914వ సంll లో లైబీరియాలోని మోన్రోవియా చేరుకున్నారు ఎలిజా. తరువాత సినో కౌంటీలోని అంతర్గత భాగాలకు వెళ్ళిన ఆమె, అక్కడ బోధించడం మరియు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. పిల్లలకు బైబిలు చదవడంతోపాటు కొన్ని జీవన నైపుణ్యాలను నేర్పించేందుకు ఆమె ‘బైబిల్ ఇండస్ట్రియల్ అకాడమీ’ అనే పాఠశాలను స్థాపించారు. ఆమె చేసిన గ్రామ పరిచర్య అభివృద్ధి చెందగా ఒక ఏడాదిలోగానే వెయ్యి మంది ప్రజలు క్రీస్తును అంగీకరించారు.
నిధుల కొరత కారణంగా 1919వ సంll లో బాప్తిస్టు చర్చి ఆమె మిషన్‌ను రద్దు చేసింది. కాగా తాను అక్కడ నుండి వెళ్లిపోవాల్సి వస్తుందని ఎలిజా భయపడుతున్న సమయంలో, బ్రిటిష్ మిషనరీయైన డాll చార్లెస్ జార్జ్ ఆమెను వివాహం చేసుకొనుటకు ముందుకువచ్చారు. కాగా 1939వ సంll లో చార్లెస్ మరణించే వరకు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ మిషనరీ దంపతులు లైబేరియాలో పరిచర్యను కొనసాగించారు. అయితే, అతని మరణం తరువాత కూడా 33 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయిన ఎలిజా, 27 క్రైస్తవ సంఘములను స్థాపించారు మరియు వందలాది మంది యవ్వనస్థులకు పరిచర్య కొరకైన శిక్షణనిచ్చారు.
91 సంవత్సరాల వయస్సులో ఉష్ణమండల క్యాన్సర్ కారణంగా ఆమె సరైన చూపు లేక మరియు సరిగా నడవలేకయున్నప్పుడు కూడా ఆమె తన చేతి కర్ర సహాయముతో వెళుతూ దేవుని వాక్యము నుండి ప్రజలకు ఆలోచన చెబుతూ ఉండేవారు. చివరికి ఈ లోకంలో తన పరుగును విజవంతముగా కడముట్టించి వంద సంవత్సరాల నిండు వృద్ధాప్యమందు ప్రభు సన్నిధానమును చేరుకున్నారు ఎలిజా డేవిస్ జార్జ్.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, వెళ్ళి సేవ చేయమని దేవుడు మిమ్ములను పిలువగా మీరు ఇంకా వెళ్ళక నిలిచియుంటున్నారా?
ప్రార్థన :
ప్రభువా, నా హృదయ కాఠిన్యమును క్షమించి, అవసరతయున్న స్థలమునకు నన్ను పంపుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment