Search Here

Feb 12, 2022

Neesima Shimeta Life History

నీసిమా షిమెటా జీవిత చరిత్ర


  • జననం: 12-02-1843
  • మహిమ ప్రవేశం: 23-01-1890
  • స్వస్థలం: ఎడో
  • దేశం: జపాన్
  • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు జపాన్

జపాన్‌లో ఒక శక్తివంతమైన సైనిక కులమైన సమురాయ్ కులానికి చెందిన నీసిమా షిమెటా తన ఖడ్గాన్ని విడిచిపెట్టి, సత్య దేవుని సేవించవలెనని బైబిలును చేత పట్టుకున్నారు. ధైర్యవంతులైన ఇటాకురా వంశంలో జన్మించిన నీసిమా మతపరంగా తన దేవుళ్లను పూజించేవారు. అయితే వారికి తాను అర్పించే అర్పణలను వారు ఏనాడూ ముట్టుకొనలేదని గమనించిన అతను, ఆ దేవుళ్ళు నిర్జీవముగా ఉన్నారని ఒక రోజున గ్రహించారు. పదిహేనేళ్ళ వయసు ఉన్నప్పుడు సంక్షిప్తముగా వ్రాయబడిన ఒక బైబిలు గ్రంథం అతనికి దొరికింది. “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” అని వ్రాసియున్న ప్రారంభ వాక్యం అతనిని బలంగా తాకింది. తన మతానికి సంబంధించిన పుస్తకాలు ఏవీ కూడా సృష్టి గురించి మాట్లాడకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. కాగా బైబిలు చెబుతున్న ఆ దేవుడెవరో అతనికి తెలియకపోయినప్పటికీ ఆయనకు ప్రార్థించడం ప్రారంభించారు నీసిమా.



వేరొక దేశమునకు చెందిన ఈ దేవుని గురించి తనకు విదేశీయుల ద్వారానే ఎక్కువగా తెలుస్తుందని వారిని కలుసుకొనుటకు అతను నిర్ణయించుకున్నారు. అందుకొరకు అతను వాణిజ్యవర్తకముల కొరకు విదేశీయులకు అనుమతించబడిన ఏకైక ఓడరేవు అయిన హకోడేట్‌ను రహస్యముగా చేరుకున్నారు. అక్కడ రష్యాకు చెందిన ఒక చాప్లిన్‌తో (ప్రార్థనాలయ అధికారి) అతను జరిపిన చర్చలు అతని మనోనేత్రములకు మరికొంత వెలుగునిచ్చాయి. జపాన్‌లో క్రైస్తవ మతం అనుమతించబడదు కాబట్టి, అక్కడి నుండి తప్పించుకోవాలని అతను నిర్ణయించుకొని, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కారు. ఆ నౌకాధికారి దయగలవాడు. అతను నీసిమాకు బైబిలు సత్యాలను బోధించారు. ప్రయాణం మధ్యలో ఒక క్రొత్త నిబంధన గ్రంథమును కొనుటకై నీసిమా తన ఖడ్గమును విక్రయించారు.



1865వ సంll లో బోస్టన్ నగరమును చేరుకున్నారు నీసిమా. అక్కడ అతను విద్యాభ్యాసమును పొందుటకు నౌకాధికారి సహాయం చేశారు. తద్వారా అండోవర్ థియోలాజికల్ సెమినరీ నుండి వేదాంత విద్యను పూర్తి చేసుకొనిన అతను, పిమ్మట ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) సంస్థలో చేరారు. కాగా ఇప్పుడు ఒక మిషనరీగా జపాన్‌కు తిరిగి వెళ్లాలని అతను అనుకున్నారు కానీ అందుకు అతనికి నిధులు ఇచ్చుటకు ఎ.బి.సి.ఎఫ్.ఎమ్. సంస్థవారు సిద్ధంగా లేరు. అయితే ఒక సమావేశంలో కన్నీటి పర్యంతమై అతను చేసిన విజ్ఞప్తి అమెరికా క్రైస్తవుల హృదయాలను ద్రవింపజేసింది. చివరికి, 1875వ సంll లో చేతిలో 5000 డాలర్లతో జపాన్ చేరుకున్నారు నీసిమా.



వెంటనే అతను క్యోటోలో దోషిషా పాఠశాలను స్థాపించడం ద్వారా విద్యా సంబంధముగా పరిచర్యను ప్రారంభించారు. పాఠశాలలో బోధించబడే నైతిక విద్య యొక్క మూలాంశాలలో అతను క్రైస్తవ్యాన్ని పొందుపరిచారు. ఆ పాఠశాల ఈనాడు ప్రతిష్ఠాత్మకమైన దోషిషా విశ్వవిద్యాలయంగా జపాన్ దేశంలో నిలిచియుంది. ఇది అనేక మంది దేశ నిర్మాతలను తయారుచేయడమే కాదు, వందలాది మంది క్రైస్తవ సంఘ నాయకులను కూడా తయారుచేసింది.



అలుపెరుగని విద్యా సంబంధ పరిచర్య మరియు సువార్త ప్రచారాల కారణంగా అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కాగా 46 సంవత్సరాల తక్కువ వయస్సులోనే ఈ లోక యాత్ర ముగించి ప్రభు సన్నిధానమును చేరుకొన్నారు నీసిమా షిమెటా.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ స్వజనుల రక్షణ కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారా? 

ప్రార్థన :

ప్రభువా, రక్షించబడని నా కుటుంబ సభ్యుల మనోనేత్రములు తెరిచి, చీకటి నుండి వెలుగులోనికి వారిని నడిపించుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment