చెన్ డేయోంగ్ జీవిత చరిత్ర
జననం: -
మహిమ ప్రవేశం: 05-06-1900
స్వస్థలం: బీజింగ్
దేశం: చైనా
దర్శన స్థలము: చైనా
చైనాకు చెందిన చెన్ డేయోంగ్ ఒక మెథడిస్టు సువార్తికులు మరియు చైనా గోడ ఆవల ఉన్న ప్రజల మధ్య మిషనరీ పరిచర్య జరిగించినవారు. యవ్వనప్రాయములో ఉన్నప్పుడు అతను పుస్తకములు చదువుటకు ఎంతో ఆసక్తిని కలిగియుండేవారు. ఒక రోజు అతనికి ఒక క్రైస్తవ పుస్తకం కనిపించగా, అది ఎంతో ఆసక్తికరంగా అతనికి అనిపించింది. ఆ పుస్తకానికి ఎంతగానో మంత్రముగ్ధులైన అతను, లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) సంస్థవారి క్రైస్తవాలయములో ఆదివారపు సంఘారాధన కూడికకు హాజరయ్యారు. కొన్ని నెలల తర్వాత, తన కుటుంబ అంగీకారమునకు వ్యతిరేకంగా బాప్తిస్మము తీసుకున్నారు చెన్.
ఆ సమయంలో తన తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితో చెన్‌కు నిశ్చితార్థం అయియున్నది. కాగా అతని కుటుంబ సభ్యులు త్వరగా అతని వివాహమును జరిగించి, తద్వారా అతని యొక్క ఆ నూతన విశ్వాసము నుండి అతని దృష్టి మరల్చవలెనని ప్రయత్నించారు. అయితే క్రైస్తవ వివాహం అయితేనే తాను వివాహం చేసుకుంటానని చెన్ చెప్పడంతో, ఆగ్రహముతో నిండిపోయిన అతని కుటుంబం అతనికి తమకు ఇక ఎటువంటి సంబంధము లేదని అతనిని పూర్తిగా తిరస్కరించింది. ఏదేమైనప్పటికీ, అతనితో నిశ్చితార్థం అయిన ఆ అమ్మాయి చెన్ యొక్క విశ్వాసంలో ఉన్న సత్యాన్ని గమనించి, తన కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పటికీ అతనితో వివాహమునకు సిద్ధమవ్వగా, చివరికి వారిరువురు వివాహములో జతపరచబడ్డారు.
అయితే ఈ నూతన క్రైస్తవ దంపతులకు క్రైస్తవ సంఘము తప్ప ఈ లోకములో ఎవరూ లేరు. చెన్ ఎల్.ఎమ్.ఎస్. వారి చర్చిలో కాపలాదారునిగా పని చేయడం ప్రారంభించారు. ఆ అవకాశమును అతను వీధులలో ఇతరులతో సువార్తను పంచుకొనుటకు ఉపయోగించుకున్నారు. చివరికి చైనా గోడ ఆవల ఉన్న ప్రజలను గూర్చిన గొప్ప భారంతో అతను బీజింగ్‌ను విడిచిపెట్టి వెళ్ళి వారి మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు.
అది చైనాలో బాక్సర్ల తిరుగుబాటు తారాస్థాయికి చేరుకున్న సమయం. ఆ సమయంలో క్రైస్తవులు కనికరం లేకుండా ఊచకోత కోయబడ్డారు. పట్టణవాసులు చెన్‌ను పర్వతాలకు పారిపోమని అభ్యర్థించారు. కానీ, అతను ప్రియమైన తన మందను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళుటకు నిరాకరించారు. తన సంఘ విశ్వాసుల భద్రత కొరకు తగిన ఏర్పాట్లు చేసిన పిమ్మట అతను తిరుగుబాటు తగ్గే వరకు దాగుకొనియుండుటకై యాన్కింగ్ పర్వతాలకు పయనమయ్యారు.
అయితే, కొంతమంది బాక్సర్ తిరుగుబాటుదారులు చెన్ యొక్క కుటుంబాన్ని పట్టుకొనగా, చెన్ తన భార్యాపిల్లల కళ్ళ ఎదుటనే తల నరికి చంపబడ్డారు. తన తల్లి వెనుక ఏడుస్తూ దాగుకొనియున్న అతని చిన్న కుమార్తె “అయ్యో అమ్మా, ఏం చేద్దాం?” అని అడుగగా, కదిలింపబడని స్థిరమైన విశ్వాసముతో ధైర్యముగా ఆ తల్లి తన బిడ్డను ఓదారుస్తూ, “మనమందరము కలిసి మన పరలోకపు తండ్రి వద్దకు వెళ్తాము!” అని చెప్పారు. ఆమె ఈ మాటలు పలికిన వెంటనే ఆ తల్లీ బిడ్డలు కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపబడ్డారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, క్రీస్తు కొరకు మీరు ప్రాధాన్యతనిచ్చేవాటిని, మీకు ఆనందమిచ్చేవాటిని, మీ కుటుంబమును మరియు బంధుమితృలను త్యాగం చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?
ప్రార్థన :
ప్రభువా, ఈ దినమున సజీవయాగముగా నా దేహమును మీకు అర్పించుచున్నాను. నేను నా జీవితము, సమయము, ధనము, ఆశయాలు, ప్రణాళికలు, ఆశలు మరియు కోరికలను మీకే సమర్పించెదను. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment