షెర్వుడ్ ఎడ్డీ జీవిత చరిత్ర
- జననం: 19-01-1871
- మహిమ ప్రవేశం: 04-03-1963
- స్వస్థలం: కాన్సాస్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: భారతదేశం మరియు చైనా
అమెరికాకు చెందిన మిషనరీయైన జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ, తాను భారతదేశం మరియు చైనా దేశాలలో అలుపెరుగక జరిగించిన సంచార పరిచర్యకు పేరుగాంచినవారు. 1889వ సంll లో ఒక క్రైస్తవ కూడికలో అతను తిరిగి జన్మించగా, అప్పటి నుండి నశించుచున్న ఆత్మలను రక్షించుటకు లోతైన భారము అతనిలో ఏర్పడింది. తన తండ్రి మరణం తరువాత గొప్ప సంపదను అతను వారసత్వంగా పొందినప్పటికీ, దానిపట్ల అతను పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసుకొనిన పిమ్మట అతను "ఈ తరంలో ప్రపంచానికి సువార్త ప్రకటించాలి" అనే దర్శనముతో 'యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్' (వై.ఎమ్.సి.ఎ. - క్రైస్తవ యువకుల సంఘము) అనే సంస్థలో చేరారు.
అమెరికాలో చురుకుగా పరిచర్య చేస్తున్న సమయములో అతను తన స్నేహితుడు జాన్ మోట్ భారతదేశం మరియు శ్రీలంకలలో 'స్టూడెంట్ వాలంటీర్ మూవ్‌మెంట్' (ఎస్.వి.ఎమ్. - విద్యార్థి స్వచ్ఛంద విప్లవం) అను దానిని నడిపించుటను గురించి వినడం జరిగింది. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి భారతదేశములో పరిచర్య చేయుట కొరకు అతను వై.ఎమ్.సి.ఎ. వారి అంతర్జాతీయ కమిటీచే ఎంపిక చేయబడినవారై 1896వ సంll లో భారతదేశము లోని బొంబాయికి చేరుకున్నారు.
అతను అక్కడికి వచ్చిన సమయంలో బుబోనిక్ ప్లేగు విజృంభిస్తుండుట వలన బొంబాయి నగరం అల్లాడిపోతున్నది. కాగా అతను వెంటనే బ్రిటిషువారి బృందముతో కలిసి ప్రజలకు వైద్య సంరక్షణ అందించుటకును మరియు వారిని రక్షించుటకును ప్రారంభించారు. అటుపిమ్మట అతను భారతదేశంలోని అనేక నగరాలలో తీవ్రమైన సంచార పరిచర్యను ప్రారంభించారు. ఒక దేశమును క్రైస్తవ దేశముగా మార్చుటకు ప్రధాన ద్వారం క్రీస్తు కొరకు యవ్వనస్థులను సంపాదించుటయేయని ఎడ్డీ విశ్వసించారు. ప్రారంభములో అతను సువార్తను బోధించుటకు వాదనలు మరియు విమర్శలతో కూడిన విధానమును అనుసరించారు. అయితే, దాని ద్వారా వచ్చిన సత్ఫలితాలు చాలా తక్కువ. ఒకానొక సమయంలో అతను స్వామి వివేకానంద మరియు మహాత్మా గాంధీలతో కూడా వాదించారు. అయితే తరువాత అతను "మనము వాదనలలో గెలుచుటకు కాదు గానీ, ప్రజలను గెలవడానికి పంపబడ్డాము" అని గ్రహించారు. తత్ఫలితముగా అతను స్థానికుల అవసరతలకు తగినట్లు సందర్భోచితంగా సువార్తను చెప్పడం ప్రారంభించి, వారి జీవితములలో క్రీస్తు నిజముగా అవసరమని వారు విశ్వసించేలా చేశారు.
1900వ సంll లో తమిళనాడులో సేవ చేయడం ప్రారంభించారు ఎడ్డీ. అనేక వర్గాలతో విభజించబడియున్న క్రైస్తవ్యం దేవుని రాజ్యానికి ఆటంకం కలుగజేస్తుందే గానీ, దానిని విస్తరింపజేయదు అని అతను భావించారు. అందువలన అతను వి.ఎస్. అజర్యాతో కలిసి 1903వ సంll లో తిన్నెవెల్లికి చెందిన 'ఇండియన్ మిషన్ సొసైటీ' ని స్థాపించారు మరియు అన్ని క్రైస్తవ వర్గాలను, వివిధ క్రైస్తవ సమూహాలను సువార్త ప్రకటన అనే ఒకే గురివైపు మళ్ళించవలెననే భారంతో 1905వ సంll లో 'నేషనల్ మిషనరీ సొసైటీ ఆఫ్ ఇండియా' అనే సంస్థను స్థాపించారు.
భారతదేశములో చేసిన పరిచర్య నుండి పొందిన అనుభవముతో మరియు నేర్చుకొనిన పాఠాలతో అతను 1911వ సంll నుండి ఆసియాలోని అనేక దేశాలను పర్యటిస్తూ, ప్రభావవంతమైన సువార్త పరిచర్యను చేయడం ప్రారంభించారు. 1931వ సంll లో పదవీ విరమణ పొందిన తరువాత కూడా ప్రపంచవ్యాప్తంగా మిషన్‌లను జరిగించుటలో చురుకైన పాలిభాగస్థులుగా చివరి వరకు ప్రభు సేవలో సాగిపోయారు జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీరు వాదనలలో గెలుపును సాధిస్తున్నారా లేక ఆత్మలను గెలుస్తున్నారా?
ప్రార్థన :
ప్రభువా, మీ మహిమార్థమై ఫలభరితమైన పరిచర్యను చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment