జాషువా మార్ష్‌మాన్ జీవిత చరిత్ర
- జననం: 20-04-1768
- మహిమ ప్రవేశం: 05-12-1837
- స్వస్థలం: విల్ట్‌షైర్, గ్రేట్ బ్రిటన్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: భారతదేశం
విల్ట్‌షైర్‌లోని వెస్ట్‌బరీ లీ అనే ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు మార్ష్‌మాన్. అతని కుటుంబం అతనికి మంచి విద్యను అందించలేక పోయినప్పటికీ, దేవుని కృప వలన అతను బైబిలు వేదాంతశాస్త్రం అభ్యసించి, గ్రీకు, హిబ్రూ, అరబిక్, సిరియా మరియు లాటిన్ భాషలను కూడా అధ్యయనం చేయగలిగారు. అతని యొక్క భాషా నైపుణ్యాలు మరియు జ్ఞాపకశక్తి అద్భుతమైనవి. భారతదేశంలో విలియం కేరీ చేస్తున్న మిషనరీ పని నుండి ప్రేరణను పొందిన మార్ష్‌మాన్ ఇంకా మిషనరీలు అవసరమని కేరీ నుండి వచ్చిన అభ్యర్థనను గురించి తెలుసుకున్నప్పుడు, ఆ పని కొరకై తనను సమర్పించుకున్నారు. కాగా అతను తన భార్యయైన హన్నా మరియు పిల్లలతో కలిసి 1799వ సంll లో భారతదేశానికి వచ్చారు.
ఆ మిషనరీ దంపతులు బెంగాల్‌లో ఒక బోర్డింగ్ పాఠశాలను స్థాపించారు. పిల్లల విద్యాభ్యాసం గురించి ఎంతో శ్రద్ధాసక్తులు కలిగియున్న మార్ష్‌మాన్ వారి కొరకు పాఠశాలలను ఏర్పరచే ప్రణాళికల కొరకు అధిక సమయాన్ని వెచ్చించారు. చిన్నపిల్లల రక్షణ మరియు ఆత్మీయ ఎదుగుదల కొరకై "స్కూల్ డైలాగ్స్; ఆఁర్, లెసన్స్ ఆన్ ది కమాండ్మెంట్స్ అండ్ ది వే ఆఫ్ సాల్వేషన్" అనే చిన్న పుస్తకాన్ని కూడా మార్ష్‌మాన్ రచించారు.
మార్ష్‌మాన్, విలియం కేరీ మరియు విలియం వార్డ్–వారు ముగ్గురూ 'సెరాంపూర్ త్రిత్వము' గా పేరొందారు. ప్రభుత్వం వారికి అనుకూలముగా లేకపోయినప్పటికీ మరియు అనేక నిరుత్సాహకరమైన అనుభవాలు ఎదురైనప్పటికీ వారు వెనుకంజ వేయక భారతదేశంలో సత్యము మరియు జ్ఞానము విస్తరించుట కొరకు ఎడతెగని సేవలనందించారు. లేఖనభాగములను అనువదించడం మరియు క్రైస్తవ రచనలను ముద్రించడం వారి ప్రధాన కర్తవ్యాలలో భాగమయ్యాయి. ఈ ముగ్గురూ కలిసి 1818వ సంll లో స్థాపించిన సెరాంపూర్ కళాశాల నేటికీ సేవలను అందిస్తున్న భారతదేశంలోని రెండవ పురాతన కళాశాలగా నిలిచి ఉంది. ప్రతిభావంతులైన భాషావేత్త అయిన మార్ష్‌మాన్ 1806వ సంll లో చైనా వారి భాషను అధ్యయనం చేయడం ప్రారంభించారు. లాస్సర్‌తో కలిసి 15 సంవత్సరాల పాటు అతను చేసిన కృషి ఫలితముగా 1821వ సంll లో చైనా భాషలోకి అనువదించబడిన మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథము ప్రచురించబడింది.
మార్ష్‌మాన్ యొక్క క్రమశిక్షణ కలిగియున్న జీవితం దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికీ మాదిరిగా నిలుస్తుంది. అతను సాధారణంగా వేకువనే నాలుగు గంటలకు లేచి, అల్పాహారం తీసుకునే సమయానికల్లా ఆ దినము యొక్క కర్తవ్యాలలో సగము పనులను పూర్తిచేసేవారు. అతను ఎదుర్కొనిన ప్రతి శ్రమ తరువాత దేవుని సేవ కొరకై అతను కలిగియున్న అమితమైన శ్రద్ధాసక్తులు మరింతగా పెరిగేవి. చివరిగా తన చుట్టూ ఉన్నవారిని అతను అడిగిన ఆఖరి ప్రశ్న ఏమిటంటే "నేను ఇంకా దేనినైనా చేయగలనని మీరు అనుకొనునది ఏమైనా కలదా?“
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుని పని కొరకైన మీ సమర్పణ ఎంత తీవ్రతను కలిగియుంది?
ప్రార్థన :
"ప్రభువా, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కలిగియుండి, నా యొక్క సమయమును మీ పని చేయుట కొరకు వెచ్చించులాగున సమర్పణ కలిగియుండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment