Search Here

Feb 19, 2022

Wilfred Grenfell Life History

విల్‌ఫ్రెడ్ గ్రెన్‌ఫెల్ జీవిత చరిత్ర



Credit: Corbis via Getty Images/Historical

  • జననం: 28-02-1865
  • మహిమ ప్రవేశం: 09-10-1940
  • స్వస్థలం: పార్క్‌గేట్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: లాబ్రడార్
లాబ్రడార్‌లోని ఒక చిన్న గృహములో యువకుడైన ఒక వైద్యుడు తన భార్యాబిడ్డలతో కలిసి రాత్రి భోజనం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఎస్కిమో (మంచు ప్రాంతములలో నివసించెడివారు) అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న తన చిన్న కుమారుడిని రక్షించమని ఆ వైద్యుడిని కోరారు. ఆ ఎస్కిమో యొక్క ఇల్లు అక్కడికి 50 మైళ్ల దూరంలో ఉంది. దానిని చేరుకొనవలెనంటే ఆ ప్రాంతంలో కదులుతున్న మంచు దిబ్బలను దాటుకొని వెళ్ళాలి. అయితే ఆ వైద్యుడు తన కుటుంబమును ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, పైగా కదులుతున్న మంచు దిబ్బలపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. అది అతని మరణానికి కూడా దారితీయవచ్చు. అయితే ఏదీ నిశ్చయించుకోలేక సతమతమవుతున్న అతని స్థితిని చూసి, ధైర్యవంతురాలైన అతని భార్య మెల్లని స్వరముతో ఇలా చెప్పారు "విల్ఫ్రెడ్, తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు" (మత్తయి 10:37). వెంటనే ఆ వైద్యుడు "ప్రభువా, నా ప్రియులైన వారిని రక్షించు" అని ప్రార్థించి, వైద్య సహాయమును అందించుటకు మంచు మీద ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. లాబ్రడార్‌లో విల్‌ఫ్రెడ్ గ్రెన్‌ఫెల్ యొక్క త్యాగపూరితమైన సేవా జీవితం అటువంటిది.

విల్‌ఫ్రెడ్ థామస్ గ్రెన్‌ఫెల్ ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో తాను చేసిన సేవకు పేరుగాంచిన ఒక గొప్ప వైద్య మిషనరీ. వైద్య కళాశాలలో చదువుకుంటున్న సమయంలో అతను డి.ఎల్. మూడీ యొక్క ఒక ఉజ్జీవ కూడికలో క్రీస్తును అంగీకరించారు. త్వరలోనే పరిచర్యలో పాలుపంచుకొనడం ప్రారంభించిన అతను, ఆదివారపు బైబిలు పాఠశాలకు (సండే స్కూల్‌కు) నాయకత్వం వహించడం ప్రారంభించారు. పట్టభద్రులైన తరువాత అతను ఒక మిషనరీ నుండి లాబ్రడార్‌లోని మత్స్యకారుల దుర్భరమైన జీవితముల గురించి విన్నారు గ్రెన్‌ఫెల్.

ఏడాదిలో ఎనిమిది నెలల పాటు శీతాకాలం ఉండే ప్రమాదకరమైన ప్రదేశం లాబ్రడార్. కానీ గ్రెన్‌ఫెల్ దానిని ఒక సవాలుగా తీసుకుని ఉత్సాహంగా అక్కడ పని ప్రారంభించారు. మత్స్యకారుల మధ్య సేవచేసే 'ది రాయల్ నేషనల్ మిషన్ టు డీప్ సీ ఫిషర్‌మెన్' అనే సంస్థ యొక్క మద్దతు పొందిన అతను, 1892వ సంll లో ఒక ఓడను అద్దెకు తీసుకుని లాబ్రడార్ తీరం వెంబడి వైద్య సేవలను అందించడం ప్రారంభించారు. త్వరలోనే అతను పాఠశాలలు, అనాథాశ్రమాలు మరియు ఆసుపత్రులను అభివృద్ధి చేయడం ద్వారా ఆ మిషన్‌ను విస్తరింపజేయడం ప్రారంభించారు. అతని ద్వారా ప్రధాన భూభాగంలో నివసించే ప్రజలే కాకుండా అనేక మంది ఆదిమవాసులు కూడా క్రీస్తు ప్రేమను అనుభవించారు. అతని వలెనే ధైర్యవంతురాలైన గ్రెన్‌ఫెల్ యొక్క భార్య అన్నే పరిచర్యలో అతనికి ఆదరణను, ప్రోత్సాహమును ఇచ్చి పరిచర్యను మెరుగుపరచుటలో తోడ్పాటునందించారు. 1938వ సంll లో తాను మరణించే వరకు కూడా ఆమె తన భర్త ఏవిధంగానూ నిరుత్సాహమొందకూడదని తన శారీరక బలహీనతలను అతనికి మరుగుపరచి ఉంచారు.

యాభై సంవత్సరాలకు పైగా ఇతరులకు ప్రేరణ కలిగించేటటువంటి మాదిరికరమైన పరిచర్య చేసిన గ్రెన్‌ఫెల్ కూడా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 1940వ సంll లో తనువు చాలించి పరమవాస స్థలమును చేరుకున్నారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు మీ కుటుంబం కంటే క్రీస్తును అధికముగా ప్రేమిస్తున్నారా?

ప్రార్థన :
ప్రభువా, మీరు నా కుటుంబమును నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు వందనములు. మీకు తగినట్లు నేను జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్ !

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment