Search Here

Apr 7, 2022

Clarinda | క్లారిండా

క్లారిండా జీవిత చరిత్ర



  • జననం : ~ 1746
  • మరణం : ~ 1806
  • స్వస్థలం : తంజావూరు 
  • దేశం   : భారతదేశం 
  • దర్శన స్థలము : తమిళనాడు, భారతదేశం


హిందూ కులాలలో సతీసహగమనం అనునది ఒక ఆచారం. అదేమంటే భర్త మరణించినట్లయితే, భార్య తన భర్త శరీరాన్ని దహనం చేసే చితిలో తాను కూడా ప్రాణాలను అర్పిస్తుంది. ఒక వైపు వితంతువులను తృణీకరిస్తున్న సనాతన భారతీయ సమాజం, మరొక వైపు మరణించిన భర్త పట్ల భార్య కలిగియున్న పతిభక్తిని క్రియారూపకముగా కనుపరిచే అత్యున్నతమైన కార్యముగా అది పరిగణించబడినందు వలన వితంతువులకు సతీసహగమనాన్ని ఆచరించడమే ఏకైక పరిష్కారమయ్యింది. అటువంటి అమానుషమైన అనాగరిక చర్య నుండి రక్షించబడిన అతి కొద్దిమంది మహిళలలో క్లారిండా ఒకరు.


క్లారిండా యొక్క అసలు పేరు కోకిల. ఆమె ఒక ప్రముఖ మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తంజావూరు రాజ దర్బారులో పనిచేసిన ఆమె భర్త, వారి వివాహం అయిన కొద్దికాలానికే మరణించడం జరిగింది. కాగా ఆమె సతీసహగమనాన్ని ఆచరించబోవుచుండగా, హెన్రీ లిటల్టన్ అనే ఆంగ్ల అధికారి ఆమె దుస్థితిని చూసి సజీవ దహనం కాకుండా ఆమెను రక్షించారు. అతను క్లారిండాను క్రైస్తవ జీవన విధానములోకి నడిపించారు. కాగా తమిళనాడులోని ఆ ప్రాంతాలలో చురుకుగా పరిచర్య చేస్తున్న క్రిస్టియన్ ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ ఆమెకు బాప్తిస్మమిచ్చి, క్లారిండా అనే క్రైస్తవ పేరును ఆమెకు పెట్టారు.


బాప్తిస్మము పొందిన పిమ్మట క్లారిండా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మిషనరీ సేవ చేయుటకు తనను సమర్పించుకున్నారు. కాగా ఆమె పాలయంకోట్టైలో స్థిరపడి, అక్కడ స్త్రీల మధ్యలో, ముఖ్యంగా వితంతువులు, అనాథలు మరియు అణగారిన నిరుపేదల మధ్యలో పరిచర్య చేశారు. ఒక చిన్న సమాజముగా వారిని కూర్చుటలో విజయవంతురాలైన ఆమె, వారి మధ్య ఆరాధన సేవలను నిర్వహించడం ప్రారంభించారు. ఆ విధంగా ఆమె అక్కడ కైస్తవ సంఘమును ప్రారంభించి కట్టిన ఆలయమును ప్రతిష్ఠించుటకు 1785వ సంll లో, ష్వార్ట్జ్ పాలయంకోట్టైకు వచ్చారు. అతను ఆ సంఘమునకు "క్లారిండా చర్చ్" అని పేరు పెట్టారు. ఆమె పాలయంకోట్టైకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను కూడా సందర్శించి, అక్కడ కూడా క్రైస్తవాలయాలను మరియు పాఠశాలలను నిర్మించారు.


క్లారిండా మంచి ఆత్మీయ గ్రహింపు కలిగియున్న స్త్రీ. ఆదర్శప్రాయమైన మరియు వాస్తవిక జీవితముల మధ్య సమతుల్యతను తీసుకురాగలిగిన ఆమె, ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ సమాన భావంతో చూసే క్రైస్తవ సంఘమును స్థాపించుటలో విజయవంతురాలయ్యారు. తన పరిచర్యలో హిందువుల నుండి ఎంతో వ్యతిరేకతను, అసంఖ్యాకమైన ఇబ్బందులను, రాజకీయ అస్థిరతను మరియు సామాజిక అన్యాయాన్ని ఆమె ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనుదిరుగక ధైర్యముగా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు క్లారిండా.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, సువార్త ప్రకటించుటకై మీరు కులం, మతం, హోదా వంటి సామాజిక అడ్డంకులను అధిగమించారా? 

ప్రార్థన :

"ప్రభువా, సువార్త ప్రకటించుటకై సామాజిక మరియు భౌతిక అడ్డంకులను అధిగమించుటకు నన్ను బలపరచుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment