సువార్తికుడైన ఫిలిప్పు (డీకన్ అయిన ఫిలిప్పు) జీవిత చరిత్ర
- జననం : -
- మరణం : ~ క్రీ.శ. 58
- స్వస్థలం : గలిలయ
- దర్శన స్థలము : సిసెరియ (కైసరయ)
యెరూషలేములోని ఆది సంఘములో గ్రీకుభాష మాట్లాడు యూదులలోని విధవరాండ్రను చిన్నచూపు చూచారనే విభేదం తలెత్తినప్పుడు అందరికీ సరియైన రీతిలో ఆహారమును పంచిపెట్టుటకు ఎన్నుకొనబడిన ఏడుగురు డీకన్లలో (సహాయక సేవకులలో) ఫిలిప్పు కూడా ఒకరు. అతను హతసాక్షిగా మరణించిన స్తెఫనుకు సమకాలీనుడు. పరిశుద్ధాత్మ చేత ‘సువార్తికుడు’ అని అతను పిలువబడిన దానిని బట్టి లేఖనములలో ఫిలిప్పును గూర్చి కొంచెముగానే చెప్పబడినప్పటికీ, అది ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అతను అపొస్తలుల పరిచర్యలో సహాయకారిగా ఉండుటయే గాక, ఒక సువార్తికునిగా సువార్త విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
స్తెఫను హతసాక్షిగా మరణించిన తరువాత యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయారు. ఆ సమయంలో ఫిలిప్పు కూడా యెరూషలేమును విడిచిపెట్టి, పాలస్తీనాలోని సమరయకు వెళ్ళి, అక్కడ సువార్తను ప్రకటించారు. ఒక శక్తివంతమైన బోధకుడైన అతను దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుటలో తన దృష్టిని కేంద్రీకరించారు. అంతేకాకుండా అక్కడ ఫిలిప్పు అనేక సూచక క్రియలను చేశారు, అపవిత్రాత్మలను పారద్రోలారు మరియు అనేకులను స్వస్థపరిచారు. అతని పరిచర్య మూలముగా అనేకమంది యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిస్మము పొందారు. తత్ఫలితముగా ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది.
సువార్త ప్రకటించుటలో అతనికున్న తలాంతును బట్టి, క్రీస్తు గురించి ఏ వ్యక్తితోనైనా మాట్లాడుటకు ఫిలిప్పు ఎల్లప్పుడూ సంసిద్ధులై యుండేవారు. ఒక పెద్ద జనసమూహానికి ప్రసంగిచినా లేదా వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి బోధించినా, తన బోధనలో యేసు క్రీస్తు ప్రభువును హెచ్చించడమే అతని యొక్క ఉద్దేశ్యమై యుండేది. తన ప్రభువుతో సన్నిహిత సహవాసాన్ని కలిగియున్న అతని జీవితం, అంతరంగములో ఇమిడిపోయి ఉన్న విధేయతకు సరియైన ఉదాహరణ. ఒకసారి దేవుడు యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమునకు వెళ్ళుమని ఫిలిప్పుకి చెప్పినప్పుడు, అతను వెంటనే విధేయత చూపించి ఆ మార్గములో ప్రయాణిస్తున్న ఐతియొపీయ మంత్రియైన ఒక నపుంసకుడిని కలుసుకున్నారు. ఆ నపుంసకుడు తన రథములో కూర్చుని లేఖన భాగములను చదువుతూ, వాటిని గ్రహించలేని స్థితిలో ఉండగా, ఫిలిప్పు దేవుని వాక్యమును వివరించి అతనికి గ్రహింపును కలుగజేశారు. తత్ఫలితముగా రక్షణ పొందిన నపుంసకుడైన ఆ మంత్రికి అతను బాప్తిస్మమిచ్చారు. పిమ్మట ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోగా, అతను పాలస్తీనాలోని ఒక నగరమైన అజోతుకు చేరుకున్నారు. అక్కడి నుండి కైసరయ (సిసెరియ) కు వెళ్ళువరకు పట్టణములన్నిటిలో అతను సంచరించుచు సువార్త ప్రకటించారు. ఆత్మీయ పునాదులపై తన కుటుంబమును కట్టిన ఫిలిప్పు, తన కుమార్తెలను పరిశుద్ధత కలిగియుండువారిగా పెంచారు. కాగా వారు కూడా తాము కలిగియున్న ప్రవచన వరము ద్వారా సంఘమునకు పరిచర్య చేశారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుని పిలుపుకు మీరు ఎటువంటి విధేయతను చూపిస్తున్నారు?
ప్రార్థన :
"ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను నాలో కలిగించుమని మిమ్ములను వేడుకొనుచున్నాను. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment