Search Here

Apr 7, 2022

Gregory of Nazianzus | నాజియాంజస్‌కు చెందిన గ్రెగరీ

నాజియాంజస్‌కు చెందిన గ్రెగరీ జీవిత చరిత్ర



  • జననం : ~ క్రీ.శ. 330
  • మరణం : ~ క్రీ.శ. 390
  • స్వస్థలం : కప్పదొకియా (ప్రస్తుత టర్కీలో)
  • దర్శన స్థలము : కాన్‌స్టాంటినోపుల్


మధ్య ఆసియా మైనరులో క్రైస్తవ మతం వ్యాపిస్తున్నప్పుడు, విశ్వాసులు తమ తమ సమాజములలో వ్యక్తిగతముగా తమ విశ్వాసాన్ని ప్రకటించడమే కాకుండా, దానిని వ్యక్తీకరించుటకు కవిత్వం వంటి బహిరంగముగా సందేశాన్ని అందించే పద్ధతులను కూడా ఉపయోగించారు. అటువంటి క్రైస్తవ కవిత్వాన్ని రూపొందించిన ప్రాముఖ్యమైన మరియు ప్రభావవంతమైన రచయితలలో నాజియాంజస్‌కు చెందిన గ్రెగరీ ఒకరు. అతను ఒక వక్త మరియు ‘త్రిత్వము యొక్క వేదాంతవేత్త’ కూడా. అతని కాలంలో తూర్పు దేశాల క్రైస్తవ్యంలో ప్రబలమైయున్న "అరియానిజం" కు వ్యతిరేకంగా త్రిత్వమును గూర్చిన సిద్ధాంతాన్ని సమర్థించినవారిగా గ్రెగరీ ప్రసిద్ధి పొందారు.


అతను నాజియాంజస్, సిసెరియా, అలెగ్జాండ్రియా మరియు ఏథెన్స్‌లలో తత్వశాస్త్రం మరియు ఉత్తమమైన రీతిలో ప్రసంగించడం మరియు రచనలు చేయడమును అభ్యసించారు. అతని తోటి విద్యార్థులు మరియు సన్నిహితులలో ఒకరు సిసెరియాకు చెందిన సెయింట్ బాసిల్. కాగా తరువాతి కాలంలో బాసిల్‌తో కలిసి గ్రెగరీ అరియానిజం యొక్క తప్పుడు సిద్ధాంతములను ఎదిరించుటకు ఒక క్రైస్తవ వేదాంతశాస్త్ర పుస్తకమును వ్రాశారు. నాజియాంజస్‌లో తన తండ్రి చేస్తున్న పరిచర్యలో సహాయం చేయుటకుగాను క్రీ.శ. 362 లో అతను పాదిరిగా నియమించబడ్డారు. వేదాంత సిద్ధాంతాలలో ఉన్న భేదాలతో క్రైస్తవ సంఘం విభజించబడియుండుటను అతను చూసినప్పుడు, సంఘములో ఉన్న ఆ చీలికలను తొలగించుటకు లేఖనముల ఆధారంగా శక్తివంతమైన ఉపన్యాసాలను ఇచ్చారు. అంతేకాకుండా జూలియన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించినప్పుడు, ప్రేమ మరియు సహనం ద్వారా విశ్వాస మార్గంలో ఎదురువచ్చే అడ్డంకులను అధిగమించవలెనని అతను సంఘమును ప్రోత్సహించారు.


క్రీ.శ. 378 లో వాలెన్స్ చక్రవర్తి మరణంతో ఆ ప్రాంతములో అరియానిజం యొక్క బలము సన్నగిల్లింది. కాగా మూడు దశాబ్దాలుగా అరియానిజం యొక్క బోధకుల ప్రభావంలో ఉన్న కాన్‌స్టాంటినోపుల్‌లోని క్రైస్తవ సంఘాన్ని పునర్నిర్మించుటకు గ్రెగరీ ఆహ్వానించబడ్డారు. శ్రమలను, నిందలను, అవమానాలను, చివరికి శారీరక హింసను కూడా సహించి ఆ సంఘమును సత్యము యొక్క పునాదులపై తిరిగి కట్టుటకు అతను ఎంతో నమ్మకముగా పనిచేశారు. అతనికున్న వాక్య జ్ఞానమునకు గ్రెగరీ పేరొందారు. అతని బోధనలు సెయింట్ జెరోమ్ వంటి అనేకమంది బైబిలు పండితులను ప్రభావితం చేసినవిగా ఉన్నాయి. అతని కాలములో క్రైస్తవ వేదాంతమును గూర్చి తిరుగుబాటు లేదా ఉద్యమ ధోరణి నెలకొనియున్న అస్థిరమైన పరిస్థితులలో కూడా అతను క్రైస్తవ వేదాంతములో తనకున్న అవగాహనను మరియు విశ్వాసమును వ్యక్తపరచుటలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. పైగా క్రైస్తవ సంఘము సత్యము నుండి పడిపోకుండా కాపాడిన గ్రెగరీ, తన చివరి రోజులను కవితలు, లేఖలు మరియు వేదాంత ప్రసంగాలు వ్రాస్తూ గడిపారు. త్రిత్వమును విశ్వసించే క్రైస్తవ వేదాంతశాస్త్రమునకు రూపకల్పన చేసిన అతని రచనలు, ఈ నాటికి కూడా క్రైస్తవ వేదాంతవేత్తలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా , మీరు చేసే పనులు మరియు పరిచర్య ఇతరులను ఏవిధముగా ప్రభావితం చేస్తున్నాయి? 

ప్రార్థన :

"ప్రభువా, మీ వాక్యముపై సరియైన అవగాహన కలిగియుండి, వాక్యపు వెలుగులో మీ సంఘమును ఐక్యపరచుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment