Search Here

Apr 7, 2022

Frederick Douglass | ఫ్రెడరిక్ డగ్లస్

ఫ్రెడరిక్ డగ్లస్ జీవిత చరిత్ర



  • జననం : 14-02-1818
  • మరణం : 20-02-1895
  • స్వస్థలం : మేరీల్యాండ్
  • దేశం  : అమెరికా
  • దర్శన స్థలము : అమెరికా


దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని సువార్త సందేశం తెలియజేస్తుంది. ఈ లోకములో జాతి, లింగం లేదా సామాజిక స్థితులలో బేధాలు ఉన్నప్పటికీ, క్రీస్తులో అందరూ సమానమే. "ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు." అని గలతీ 3:28లో దేవుని వాక్యం చెబుతుంది. అయితే, కొంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారు కూడా ఈ సత్యాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు. ఇతరులకన్నా తాము గొప్పవారని భావించి బానిసత్వాన్ని ప్రోత్సహించారు. క్రైస్తవ సంఘములో ఉన్న ఈ వేషధారితనమును సరిదిద్దుటకు దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. అటువంటి వారిలో ఫ్రెడరిక్ డగ్లస్ ఒకరు.

ఫ్రెడరిక్ డగ్లస్ 1818వ సంll లో మేరీల్యాండ్‌లోని టాల్బోట్‌లో జన్మించారు. బానిసత్వంలో పుట్టిన అతను బాల్యంలోనే తన తల్లి నుండి వేరుచేయబడి, ఒక బానిసగానే ఉన్న తన అమ్మమ్మ బెట్సీ బెయిలీతో కలిసి జీవించుటకు బలవంతం చేయబడ్డారు. 6 సంll ల వయస్సులో అతను తన తాతయ్య అమ్మమ్మల నుండి కూడా వేరుచేయబడి, హ్యూ మరియు సోఫియా  ఆల్డ్‌లకు ఇవ్వబడ్డారు. అక్కడ అతను సోఫియా బైబిలు చదవడం వినేవారు మరియు చర్చికి వెళ్ళుటకు కూడా కొన్నిసార్లు అతనికి అవకాశాలు లభించాయి. కాగా దేనివలననో అతను దేవునిలో తనకు ఒక స్నేహితుడు దొరికినట్లు భావించారు. బైబిలు చదవడం మరియు ప్రార్థన చేయడం నేర్చుకున్న అతను, ఎంత ఎక్కువగా ప్రార్థించారో, అంత ఎక్కువగా పాపం వలన తాను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో గ్రహించారు. తత్ఫలితంగా అతను తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించి, తన చింతలన్నింటినీ ఆయనపైనే విడిచి పెట్టారు.


విలియం ఫ్రీలాండ్ అనే వ్యక్తి కొరకు పని చేయుటకు నియమించబడినప్పుడు, డగ్లస్ ఇతర బానిసలకు బైబిలు చదవడం నేర్పించారు. వారి కొరకు అతను ప్రతి వారం కూడికలను కూడా నిర్వహించేవారు. అయితే 1838వ సంll లో అతను తన యజమాని నుండి తప్పించుకొని మసాచుసెట్స్‌లోని న్యూ బెడ్‌ఫోర్డ్‌కు పారిపోయారు. అక్కడ స్థానిక సంఘ సహవాసములో చేరిన అతను, ‘క్రీస్తు యొక్క క్రైస్తవ్యము’ మరియు ‘క్రైస్తవుల యొక్క క్రైస్తవ్యము’ మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసాన్ని చూశారు. కాగా దేవుని వాక్యం చెబుతున్నదాని పట్ల అతను కలిగియున్న అవగాహన, సమాజములోను మరియు క్రెస్తవ సంఘములోనూ రంగు మరియు జాతి తారతమ్యాలు లేకుండా సమానత్వాన్ని పెంపొందించుటకు అతను పోరాడునట్లు చేసింది. బానిసత్వానికి మద్దతు ఇస్తున్న క్రైస్తవులను దేవుని వాక్యాన్ని చూపిస్తూ అతను తీవ్రంగా విమర్శించారు. బానిసత్వాన్ని నిర్మూలించాలన్న పోరాటానికి బైబిలు అతనికి మార్గనిర్దేశం చేసింది. దేవునిపై అతనికున్న దృఢమైన విశ్వాసం ద్వారా డగ్లస్ బానిసత్వ బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించడమే కాకుండా క్రైస్తవ సంఘమును కూడా వేషధారితనము నుండి విడిపించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మీరు సమానత్వ భావముతో చూస్తున్నారా?


ప్రార్థన :

"ప్రభువా, సమాజంలో సమానత్వాన్ని పెంపొందించుటకు నన్ను ఒక సాధనముగా వాడుకొనుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment