Search Here

Apr 7, 2022

Eric Henry Liddell | ఎరిక్ హెన్రీ లిడెల్

ఎరిక్ హెన్రీ లిడెల్  జీవిత చరిత్ర




  • జననం : 16-01-1902
  • మరణం : 21-02-1945
  • స్వదేశం : చైనా
  • దర్శన స్థలము : చైనా


ఎరిక్ హెన్రీ లిడెల్ చైనాలో స్కాట్లాండుకు చెందిన మిషనరీ దంపతులకు జన్మించారు. మొదటిగా  లండన్‌ నగరంలోని ఎల్తామ్ కళాశాలలో చదువుకొనుటకు పంపబడిన అతను, తదుపరి  స్కాట్లాండ్‌లోని ఈడెన్‌బర్గ్  విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. అక్కడ అత్యుత్తమ క్రీడాకారునిగా ఎదిగిన ఎరిక్, స్కాట్లాండ్‌లో అత్యంత వేగంగా పరుగెత్తే ఆటగానిగా మారారు. కాగా 1924వ సంll లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌ క్రీడలలో బ్రిటన్‌ తరఫున 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనుటకు అతను ఎంపికయ్యారు. అయితే ఆ పోటీ ఆదివారం రోజున నిర్వహించబడుతుండటంతో అతను అందులో పాల్గొనుటకు నిరాకరించారు. ఏమనగా ప్రభువు కొరకు మాత్రమే కేటాయించబడిన పరిశుద్ధ దినముగా అతను ఆదివారమును పరిగణించారు. అయితే అందుకు బదులుగా మరొక రోజు నిర్వహించబడే 400 మీటర్ల పందెంలో పాల్గొనుటకు నిశ్చయించుకున్నారు. అందుకొరకు సరియైన శిక్షణ మరియు సిద్ధపాటు లేనప్పటికీ అతను ఆ పందెములో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. తనను ఘనపరిచిన వారిని దేవుడు నిశ్చయముగా ఘనపరుస్తాడనే సత్యమునకు ఇది ఒక మచ్చు తునక.

లిడెల్ తాను క్రీడలలో సాధించిన ఘనతను సువార్తను పంచుకొనుటకు ఒక అవకాశముగా భావించారు. తద్వారా అనేకమంది యవ్వనస్థులను క్రీస్తు యొక్క వెలుగు వైపుకు నడిపించారు లిడెల్. నమ్రత కలిగిన యువ క్రీడకారుడైన అతను, ప్రఖ్యాతిని ఘనతను పొందుకున్నప్పటికీ, ఆ అద్భుతమైన భవిష్యత్తును విడిచిపెట్టి, చైనాలో మిషనరీగా సేవలందించుటకు అతని తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించారు. చైనాకు వెళ్ళే ముందుగా ఈడెన్‌బర్గ్‌లోని 'స్కాటిష్ కాంగ్రిగేషనల్ కాలేజ్' లో సేవ కొరకైన శిక్షణ పొందారు.

1925వ సంll లో చైనాకు వచ్చిన అతను, టియెంట్సిన్‌లోని  'ఆంగ్లో-చైనీస్ క్రిస్టియన్ కాలేజ్' లో విజ్ఞానశాస్త్రం, ఆంగ్లం మరియు క్రీడలను బోధించారు. ఒక దేశాన్ని మార్చాలంటే పాశ్చాత్య విజ్ఞానం మరియు క్రైస్తవ విలువలతో కూడిన ఒక విద్యార్థుల తరమును లేవనెత్తవలెనని అతను విశ్వసించారు. 1941వ సంll లో జపాన్ దళాలు చైనాపై దాడి చేసినప్పుడు, ఆంగ్లదేశ పౌరులు చైనా విడిచి వెళ్ళవలెనని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయినప్పటికీ, లిడెల్ తన కుటుంబాన్ని మాత్రం పంపించి, తాను చైనాలోనే ఉండిపోయారు. తత్ఫలితంగా జపాన్ సైనికులకు పట్టుబడ్డారు. ఆ యుద్ధ సమయంలో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, సరియైన ఆహారం లేకపోయినప్పటికీ, అతను చైనావారికి సేవలందించుటకు కాలినడకన మరియు సైకిల్‌పై ప్రయాణించేవారు. ఒకసారి 'ఖైదీల మార్పిడి' పధ్ధతి ప్రకారం లిడెల్‌కు చైనాను విడిచి వెళ్ళే అవకాశం దొరికింది. అయితే అతను తన స్థానాన్ని మరొక గర్భిణీ స్త్రీకి ఇచ్చి తాను బంధీగానే ఉండిపోయారు. అతను తన మిగిలిన జీవితమంతా యుద్ధ శిబిరాలలో ఆదివారపు కూడికలను నిర్వహిస్తూ గడిపారు. తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఎంతో బలహీనపడిపోయిన ఎరిక్ లిడెల్, 1945వ సంll లో ఈ ప్రపంచ యుద్ధములను విడిచిపెట్టి పరలోకములో తన సృష్టికర్తతో కలిసి నిత్య శాంతిలో జీవించుటకు వెళ్ళారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీకు ముఖ్యమైనది ఏది–క్రైస్తవునిగా గుర్తింపు పొందడమా లేక ప్రాపంచిక ఘనత పొందడమా?


ప్రార్థన :

"ప్రభువా, లిడెల్ వలెనే శ్రమలను సహించి, ఓర్పుతో మరియు ధైర్యముతో విశ్వాస పరుగులో ముందుకు సాగుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment