Search Here

Apr 7, 2022

Johannes Gutenberg | జోహన్నెస్ గుటెన్‌బర్గ్

జోహన్నెస్ గుటెన్‌బర్గ్ జీవిత చరిత్ర





  • జననం : ~1398
  • మరణం : 1468
  • స్వదేశం : జర్మనీ
  • దర్శన స్థలము : -


బైబిల్ అంటే దేవునికి మానవాళికి మధ్య ఉన్న అద్భుతమైన ప్రేమకథ అని వర్ణించవచ్చు. ఆ కథను ప్రతి ఒక్కరూ వినడం ఆవశ్యకం! పరిశుద్ధ లేఖనములు దేవుని యొక్క ప్రేరణతో ఇవ్వబడ్డాయి మరియు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును అవి ప్రయోజనకరమైయున్నవి. అత్యంత శ్రేష్ఠమైన ఈ అద్భుత గ్రంథం ఈ నాడు మన చేతులలో ఉందంటే, దానిని పరిశీలించి, ప్రతులను తయారు చేసి, పురాతన భాషలలో నుండి ఆధునిక భాషలలోనికి అనువదించడంలో ఎంతోమంది దేవుని బిడ్డలు చేసిన త్యాగాలే కారణం. అలాంటి వారిలో ఒకరే జోహన్నెస్ గుటెన్‌బర్గ్.


జర్మనీ దేశానికి చెందిన జోహన్నెస్ గుటెన్‌బర్గ్ ఒక లోహకారుడు, ముద్రణ లేదా అచ్చువేసేవాడు మరియు ప్రచురణకర్త. అతను 1450వ సంll లో ప్రపంచంలోని మొట్టమొదటి ముద్రణాయంత్రాన్ని కనుగొన్నారు. జర్మనీలోని మెయిన్జ్ నగరంలో జన్మించిన అతను, తన తల్లిదండ్రులు మరియు సంపన్నులైన వారి యొక్క స్నేహితులు కలిగియున్న వ్రాతప్రతు‌లను చదువుటకు ఇష్టపడేవారు. అప్పటిలో పుస్తకములను కలిగియుండటం ధనవంతులకు మాత్రమే సాధ్యమని గ్రహించిన అతను, అందును బట్టి నొచ్చుకున్నారు. కాగా పుస్తకములను ముద్రించుటకు ఏదైనా ఒక సులభమైన మరియు శీఘ్రమైన మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. కాగా అతను స్ట్రాస్‌బర్గ్‌లో ఒక శిధిలమైన భవనాన్ని అద్దెకు తీసుకొని, ముద్రణాయంత్రాన్ని కనుగొనుటకు పలు విధములైన పద్ధతులను అనుసరించి అక్కడ పరిశోధనలు జరిపారు. తన దగ్గర ఉన్న డబ్బు అయిపోయినప్పుడు, అతను మరొక లోహకారుడైన జోహాన్ ఫస్ట్ వద్ద ధనమును రుణముగా తీసుకున్నారు. ఏదేమైతేనేమి, చివరికి తాను అనుకున్నది సాధించిన గుటెన్‌బర్గ్, తన అద్భుతమైన ఆవిష్కరణను ఉపయోగించి మొదటిగా బైబిలును ముద్రించుటకు ఎంచుకున్నారు. కాగా 1455వ సంll లో ఒక చక్కటి లాటిన్ బైబిల్ రెండు సంపుటాలలో ముద్రించబడింది. వాటిలో ప్రతి సంపుటిలో మూడు వందల పేజీలు ఉన్నాయి. అయితే తాను సాధించిన గొప్ప పని నుండి గుటెన్‌బర్గ్ ఎటువంటి లాభమునూ పొందలేదు. ఎందుకంటే ఆ యంత్రం జోహాన్ ఫస్ట్ యొక్క స్వాధీనంలోకి వెళ్ళింది.


గుటెన్‌బర్గ్ యొక్క ముద్రణాలయ ఆవిష్కరణ బైబిలు గ్రంథముల ఉత్పత్తిని మరియు సువార్త ప్రచారమును తీవ్రం చేసింది. బైబిలును ముద్రించుటలోనే కాదు, మార్టిన్ లూథర్ మరియు జాన్ కాల్విన్ వంటి వారి రచనలను ముద్రించుటలో కూడా ఆ యంత్రం ఉపయోగించబడి ప్రొటెస్టంట్ ఉద్యమం విజయం సాధించుటలో పాలుపంచుకుంది. అనేకమందికి సరఫరా చేయగలుగునంతగా బైబిలును ముద్రించడం దేవుని వాక్యమును చదువుటకు ప్రతి విశ్వాసిని ప్రోత్సాహపరిచింది. తద్వారా ఇది ప్రతి ఒక్కరూ కూడా తమ రక్షణకు తామే బాధ్యులమనే సత్యాన్ని గ్రహింపునకు తీసుకువచ్చింది. గుటెన్‌బర్గ్ చేసిన కృషి ఫలితముగా క్రైస్తవ్యం అనునది ఆలయ తలుపుల వద్దనే ముగియకుండా, ప్రతి విశ్వాసి యొక్క గృహము కూడా శిక్షణాలయముగా మారుటకు ద్వారం తెరువబడింది.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మానవాళి కొరకైన దేవుని ప్రేమ కథ ప్రతి ఒక్కరూ వినేలా మీరు కృషి చేస్తున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, నేను కలిగియున్న బైబిలుకై మీకు వందనములు. మీ యొక్క రాజ్య విస్తరణకై వినూత్నమైన పద్దతుల ద్వారా తోడ్పాటు నందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment