Search Here

Apr 7, 2022

Saint Polycarp | సెయింట్ పాలికార్ప్

సెయింట్ పాలికార్ప్ జీవిత చరిత్ర





  • జననం : ~ క్రీ.శ. 65
  • మరణం : ~ క్రీ.శ. 155
  • స్వస్థలం : స్ముర్న (ప్రస్తుత ఇజ్మీర్, టర్కీ) 
  • దర్శన స్థలము : స్ముర్న


అపొస్తలుల పాదముల వద్ద కూర్చుని,  ఈ లోకములో యేసు క్రీస్తు జీవించినప్పటి విషయములను వారి నోటి నుండే వినడం ఎంత గొప్ప ధన్యత! పాలికార్ప్ తన యవ్వనంలో అటువంటి అనుభవాన్నే కలిగియున్నారు. అతను మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు యొక్క ఆది అపొస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడిన కుటుంబములో జన్మించారు. అంతియొకయకు చెందిన ఇగ్నేషియస్‌తో పాటు అతను కూడా అపొస్తలుడైన యోహాను యొక్క శిష్యునిగా ఉన్నారని చెప్పబడుతుంది. అటు పిమ్మట అతను స్ముర్న సంఘమునకు బిషప్పు‌గా ఆది అపొస్తలుల ద్వారానే నియమించబడ్డారు.


అపొస్తలులకు ఉన్నటువంటి ఆసక్తితోనే ఒక బిషప్పుగా తనకు అప్పగింపబడిన మందను కూడా అతను ఎంతో నమ్మకముగా నడిపించారు. ఆసియా మైనర్‌లో ఉన్న క్రైస్తవులందరికీ అతను ఒక బలమైన కోటగా మారారు. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే ప్రభుత్వం క్రింద, అన్యజనుల మధ్య సేవ చేయుటకు ఎంతో ధైర్యం మరియు దేవుని నుండి శక్తితో నింపబడాలి. వాటిని దేవుని మీదనే ఆధారపడి విశ్వాసముతో దేవుని యొద్ద నుండి పొందుకున్నారు పాలికార్ప్. ఆది అపొస్తలుల కాలం ముగిసినప్పుడు అనేక అబద్ధ బోధకులు పుట్టుకువచ్చారు. అంతేకాకుండా సంఘ క్రమమును గూర్చిన వివాదాలు చెలరేగాయి. వాటన్నింటి మధ్యలో ఒకే ఒక్క సమాధానం మాత్రమే పాలికార్ప్ వద్ద ఉంది. అదేమంటే "క్రీస్తును పోలి నడుచుకొనుట". అతను వివిధ అబద్ధ బోధకుల సమూహాలను ఎదిరించి, దేవుని మందను తప్పుడు బోధల నుండి కాపాడుటకు ఎంతో శ్రమించారు. పాలికార్ప్ వ్రాసిన అనేక పత్రికలలో ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక భద్రపరచబడింది. ఆ పత్రికలో అతను సహనం మరియు నిరీక్షణలతో స్థిరులుగా ఉండవలెనని విశ్వాసులకు సూచించారు. 


రోమా రాజ్య చక్రవర్తిగా మార్కస్ అరేలియస్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, క్రైస్తవులను హింసించుటకు అతను ఉత్తర్వులు జారీ చేశాడు. కాగా రోమా అధికారులు పాలికార్ప్‌ను బంధించి, తన విశ్వాసాన్ని త్యజించి ప్రాణాలను కాపాడుకొనుమని అతనిని కోరారు. అయితే విశ్వాసంలో స్థిరముగా నిలబడిన పాలికార్ప్, "ఎనభై ఆరు సంవత్సరాలు నేను ఆయనకు సేవ చేశాను. ఏనాడూ ఆయన నాకు కీడు చేయలేదు... అలాంటప్పుడు నా రాజు మరియు రక్షకుడైన ఆయనను నేను ఎలా దూషించగలను?" అని సమాధానమిచ్చారు. ఆ విధంగా పాలికార్ప్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టక బహిరంగముగా తెలియపరచగా, అది అతని మరణానికి దారితీసింది. రోమా చక్రవర్తికి ధూపం వేయనందుకుగాను అతనిని స్తంభమునకు కట్టి కాల్చివేయగా, రాజులకు రాజైన తన పరలోక దేవునికి ఇంపైన సువాసనతో కూడిన ధూపముగా మారారు పాలికార్ప్.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, క్రైస్తవులని మిమ్ములను అణచివేయుటకు ప్రయత్నించే ఎటువంటి చర్యనైనా తట్టుకొని, క్రీస్తును ప్రకటించే ధైర్యమును మీరు కలిగియున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, నేను స్థిరముగా నిలబడి, నా విశ్వాసమునకు సాక్షిగా ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment