Search Here

Apr 7, 2022

George Wishart | జార్జ్ విషార్ట్

జార్జ్ విషార్ట్ జీవిత చరిత్ర



  • జననం : 1513
  • మరణం : 1546
  • స్వస్థలం : మాంట్రోస్
  • దేశం         : స్కాట్లాండు 
  • దర్శన స్థలము : స్కాట్లాండు


మాంట్రోస్‌లోని ఒక ఉన్నత కుటుంబములో జన్మించిన జార్జ్ విషార్ట్ మంచి విద్యాభ్యాసాన్ని కలిగియున్నారు. లూవెన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన అతను, మాంట్రోస్‌లోని ఒక పాఠశాలలో గ్రీకు బోధించడం ప్రారంభించారు. అక్కడ అతను క్రొత్త నిబంధనను గ్రీకు భాషలో చదవమని విద్యార్థులకు బోధించినందుకుగాను తప్పుడు మత విశ్వాసాలను బోధిస్తున్నవానిగా ఆరోపణలు ఎదుర్కున్నారు. కాబట్టి అతను తన దేశమును విడిచి పారిపోయి, ఐరోపా ఖండమంతటా పర్యటిస్తూ ప్రొటెస్టంట్ వేదాంతశాస్త్రం గురించి స్పష్టమైన అవగాహన పొందుటకు ప్రయత్నించారు. 1542వ సంll లో అతను కేంబ్రిడ్జిలోని కార్పస్ క్రిస్టి కళాశాలలో చేరగా, అక్కడ అతను స్విట్జర్లాండు మరియు జర్మనీ దేశాలకు చెందిన క్రైస్తవ సంస్కర్తల బోధనల ద్వారా చాలా ప్రభావితులయ్యారు.


కాగా సత్యాన్ని బోధించవలెనన్న శ్రద్ధాసక్తులతో అతను 1543వ సంll లో స్కాట్లాండు‌కు తిరిగి వచ్చారు. అది అతని ప్రాణాలకే ప్రమాదకరముగా మారింది. ఒకసారి అతనిపై జరిగిన హత్యాప్రయత్నం నుండి అతను కొద్దిలో తప్పించుకున్నారు. అయినప్పటికీ వెనుకంజవేయక పోప్ యొక్క లోపాలను మరియు క్రైస్తవ సంఘములో నెలకొనియున్న ఆత్మీయ దౌర్భాగ్యమును ఖండిస్తూ అతను స్కాట్లాండు దేశమంతటా పర్యటించారు. ఆర్‌షైర్‌లో పరిచర్య చేస్తున్నప్పుడు డండి అనే ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందని తెలుసుకొనిన జార్జ్, వెంటనే అక్కడికి వెళ్ళారు. ఆ తెగులు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే వరకు కూడా బాధితుల ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీరుస్తూ అక్కడే ఉన్నారు. ఆ సమయములో అతను ప్లేగు కంటే ప్రాణాంతకమైన పాపమనే తెగులు గురించి వారికి తెలియజేస్తూ, యేసు క్రీస్తు పొందిన గాయముల ద్వారా ఆ తెగులు నుండి ఏ విధంగా స్వస్థత పొందగలరో వారికి బోధించారు.


డండీలో అతను చేసిన నమ్మకమైన పరిచర్య కారణముగా అత్యాగ్రహులైన కార్డినల్ బీటన్‌, అతనిని చంపుటకు కుట్ర పన్నారు. అటువంటి సమయంలో తరువాతి కాలంలో ప్రొటెస్టంట్ సంస్కరణకు నాయకుడయ్యిన జాన్ నాక్స్ అనే యువకుడు విషార్ట్‌కు అంగరక్షకునిగా సేవలందించాడు. తదుపరి తన పైన మోపబడిన ఆరోపణలన్నింటికీ దేవుని వాక్యములో వ్రాయబడినవి చూపిస్తూ సమాధానమిచ్చినప్పటికీ,  అతనిని బంధించి, మరణశిక్ష విధించారు. అతనిని కాల్చివేసే ముందు, అక్కడ అతను తనను నిందించిన వారి కొరకు ప్రార్థన చేసి, వారి పట్ల తన క్షమాపణను వెల్లడిపరిచారు. సుదీర్ఘ కాలం అతను సువార్త పరిచర్య చేయనప్పటికీ, అతని బోధనలు ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపాయి. అవి పదహారవ శతాబ్దపు మధ్యభాగంలో ప్రొటెస్టంట్ సంస్కరణకు పునాది వేశాయి.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు తప్పుడు బోధలను ఎదిరించి, సత్య మార్గములోనికి ప్రజలను నడిపిస్తున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, తప్పుడు బోధలను ఎదిరించి నిలబడుటకు నాకు వివేకమును మరియు ధైర్యమును దయచేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment