Search Here

Apr 7, 2022

Nathan Brown | నాతాన్ బ్రౌన్

నాతాన్ బ్రౌన్ జీవిత చరిత్ర



  • జననం : 22-06-1807
  • మరణం : 01-01-1886
  • స్వస్థలం : న్యూ ఇప్స్‌విచ్, న్యూ హాంప్‌షైర్
  • దేశం  : అమెరికా
  • దర్శన స్థలము : అస్సాం (భారతదేశం), జపాన్


మన చేతులలో మన మాతృభాషలోనే బైబిలును కలిగియుండటం ఎంతటి భాగ్యం! అయితే ఎంతోమందికి అటువంటి భాగ్యం లేదు. కాగా అనేక మంది దైవజనులు వారి అవసరతలను తీర్చుటకు ముందుకు వచ్చారు.


ఒక బాప్తిస్టు మిషనరీయైన నాతాన్ బ్రౌన్, అస్సామీ భాషలో చేసిన రచనలకు పేరుగాంచారు. అమెరికాలోని న్యూ ఇప్స్‌విచ్‌లో జన్మించిన అతను, మసాచుసెట్స్‌లోని విలియమ్స్‌టౌన్‌లో ఉన్న విలియమ్స్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. పిమ్మట 25 సంll ల వయస్సులో అతను తన భార్యతో కలిసి మిషనరీగా సేవ చేయుటకు బర్మాకు పయనమయ్యారు. అక్కడ కొంతకాలం పాటు మరొక మిషనరీయైన అడోనిరామ్ జడ్సన్‌కు అనువాద సేవలో  సహాయకారిగా ఉన్న నాతాన్ బ్రౌన్, తదుపరి భారతదేశంలోని అస్సాంలో సేవ చేయుటకు నియమించబడ్డారు.


అప్పటిలో అస్సామీ భాషలో లభ్యమయ్యే బైబిలు విలియం కేరీ చేసిన అనువాదం. అందులో అనేక బెంగాలీ మరియు సంస్కృత పదాలు కలిసి ఉండేవి. కాబట్టి స్వచ్ఛమైన అస్సామీ భాషలో బైబిలును అనువదించాలని తీర్మానించుకున్న బ్రౌన్, 1848వ సంll లో క్రొత్త నిబంధనను మరియు అస్సామీ వ్యాకరణంపై ఒక పుస్తకమును కూడా ప్రచురించారు. అంతేకాకుండా, పలు ప్రార్థనా పుస్తకములను అనువదించారు, అస్సామీ-ఆంగ్ల నిఘంటువును సవరించారు మరియు అనేక ఇతర చారిత్రక మరియు విద్యాసంబంధ రచనలను ప్రచురించారు. అస్సామీ భాష యొక్క సాహిత్య రచనలలో అతను చేసిన కృషి, అప్పటికి ఇంకా గుర్తించబడని ఆ భాష గుర్తింపు పొందుటలో గొప్ప పాత్ర పోషించింది.


తరువాత అమెరికాకు తిరిగి వచ్చిన అతను, అక్కడ బానిసత్వ నిర్మూలన ఉద్యమంలో చేరి దేశంలో బానిసత్వాన్ని రూపుమాపుటకు పోరాడారు. 65 సంll ల వయస్సులో మరోసారి మిషనరీ సేవకై దూరదేశ ప్రయాణమును తలపెట్టారు. ఫలితంగా జపాన్ నగరమైన యోకోహామాకు చేరుకున్న బ్రౌన్, ఆ దేశానికి మొట్టమొదటి బాప్తిస్టు మిషనరీగా వెళ్ళిన జోనాతాన్ స్కోబీ లేదా జోనాతాన్ గోబుల్ అని పేర్కొనబడే మరొక మిషనరీతో కలిసి సేవ చేశారు. వారిరువురూ కలిసి 1873వ సంll లో యోకోహామాలో మొట్టమొదటి జపానీయుల బాప్తిస్టు చర్చిని స్థాపించారు. తక్కువ విద్యాభ్యాసం కలిగియున్నవారు కూడా బైబిలును చదువగలిగేలా సులభముగా చదువగలిగే సరళమైన లిపిలో జపాన్ బైబిలును ముద్రించుటకు బ్రౌన్ ఎంతో శ్రమించారు. తన మిగిలిన జీవితమంతా జపాన్ దేశములోనే సేవ చేసిన నాతాన్ బ్రౌన్, అదే దేశంలో 1886వ సంll లో తన స్వదేశానికి దూరంగా తుది శ్వాస విడిచారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ తెలివితేటలను దేవుని వాక్యాన్ని ప్రజలకు సమీపముగా తీసుకువచ్చుటకు ఉపయోగించెదరా? 


ప్రార్థన :

"ప్రభువా, చదువులేని వారు కూడా గ్రహించగలిగేలా మీ వాక్యమును వివరించగలుగునట్లు నాకు కృప దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment