Search Here

Jun 19, 2022

Archibald Forder Biography

ఆర్చుబాల్డ్ ఫోర్డర్ జీవిత చరిత్ర

జననం: 1863
మహిమ ప్రవేశం: ~1920
స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
దర్శన స్థలము: అరబ్బు దేశాలు 

 ఆర్చుబాల్డ్ ఫోర్డర్ మధ్యప్రాచ్య ప్రాంతంలో (మిడిల్ ఈస్ట్) 13 సంవత్సరాల పాటు సేవచేసిన ఒక అమెరికన్ మిషనరీ. ఆ ప్రాంతంలో అతను ప్రధానంగా పాలస్తీనాలోని అల్-కారాక్ (కెరాక్) అనే ప్రదేశంలో పరిచర్య చేశారు. ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అతను ఒక మిషనరీ కూడికకు హాజరవ్వగా, అందులో ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయుటలో ఒక మార్గదర్శక మిషనరీగా నిలిచిన రాబర్ట్ మోఫాట్ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజున అతని హృదయంలో జ్వలించిన మిషనరీ సేవ కొరకైన జ్వాలలు ఏనాడూ ఆరిపోలేదు. కొద్ది రోజుల తరువాత చైనాకు చెందిన ఒక మిషనరీ ఫోర్డర్ హాజరైన ప్రార్థనా మందిరమును సందర్శించి, మిషనరీలుగా చైనాకు రమ్మని యువకులను ప్రోత్సహించారు. తత్ఫలితంగా, మిషనరీ కావాలన్న ఫోర్డర్ యొక్క వాంఛ మరింతగా బలపడింది.

 1888వ సంll లో అతను ఒక మిషనరీ పత్రికలో అల్-కారాక్‌లోని మిషనరీ పరిచర్యను గురించి చదవడం జరిగింది. అతను చదువుతున్నప్పుడు, “అది నీ కొరకే” అనే ఒక స్వరం అతని అంతరంగములో ధ్వనించింది. కాగా కొన్ని నెలల పాటు వైద్యములో శిక్షణ పొందిన పిమ్మట, అతను తన భార్యతో కలిసి కెరాక్‌కు పయనమయ్యారు. కౄరమైన అనాగరిక ప్రజల వలన కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, అతను వారితో ఎంతో యుక్తిగా వ్యవహరించారు. అతను రోగులను వారి గృహాలలో సందర్శించి వైద్య సహాయం అందించారు. తద్వారా సువార్తకు ద్వారములు తెరువబడ్డాయి. 1892వ సంll లో అతని భార్య మరణించినప్పటికీ, 1896వ సంll వరకు కూడా ఫోర్డర్ పాలస్తీనా ప్రజల మధ్య సేవను కొనసాగించి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించారు.

  కెరాక్‌లో ఐదున్నర సంవత్సరాల పాటు పరిచర్య చేసిన ఫోర్డర్, తదుపరి మధ్య అరేబియా ప్రాంతమునకు సువార్తను మోసుకువెళ్ళవలెనని తలంచారు. కాగా 1900వ సంll లో అతను మోయాబు మరియు ఎదోము ప్రాంతాలకు ఆవల ఉన్న ప్రాంతములను చేరుకొనవలెనని అరేబియా ఎడారి గుండా ఎంతో ప్రమాదకరమైన ప్రయాణమును ప్రారంభించారు. అరబ్బులు క్రైస్తవులను ద్వేషిస్తారని, మధ్య అరేబియాకు వెళ్తే ఖచ్చితముగా అతనికి మరణమే సంభవిస్తుందని ఫోర్డర్ హెచ్చరించబడ్డారు. అయినప్పటికీ ఏమాత్రం జడియక, నిరుత్సాహపడక ముందుకు సాగిపోయిన ఫోర్డర్, అరేబియాలోని ముఖ్య పట్టణాలలో సువార్తను ప్రకటించారు. వాటిలో కాఫ్ మరియు జోఫ్ పట్టణములు కూడా ఉన్నాయి. ముస్లింలు మరియు అనాగరికమైన ప్రజల గుంపు అనేక సార్లు అతనిపై దాడి చేశారు. కానీ, ప్రతిసారీ అతను మరణం నుండి తప్పించుకున్నారు. అతను ఎడారిలో వేల మైళ్ళ కొలది ప్రయాణించి అరబ్బు భాషలోని సువార్తలను మరియు కీర్తనలను పంచిపెట్టి, వందలాది మందిని అంధకారం నుండి ఆశ్చర్యకరమైన సువార్త వెలుగులోనికి నడిపించారు.

ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుటకై మీ తలుపు తడుతున్న అవకాశములకు మీరు స్పందిస్తున్నారా?

"ప్రభువా, మిమ్మును ద్వేషించే ప్రజలకు సువార్తను తీసుకువెళ్ళే ధైర్యమును నాకు దయచేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక
  • WhatsApp
  • No comments:

    Post a Comment