Search Here

Jul 26, 2022

Fidelia Fisk | ఫిడేలియా ఫిస్క్

ఫిడేలియా ఫిస్క్  గారి జీవిత చరిత్ర



  • జననం: 01-05-1816
  • మహిమ ప్రవేశం: 09-08-1864
  • స్వస్థలం: షెల్‌బర్న్, మసాచుసెట్స్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: ఇరాన్ (పర్షియా)


పర్షియాలోని ఉర్మియా నగర ప్రజలను “ఫిడేలియా ఫిస్క్ ఎలాంటి వ్యక్తి?” అని అడిగినట్లయితే వారి నుండి వచ్చే సర్వసాధారణమైన సమాధానం “ఆమె యేసును పోలినవారు” అనునదే! పెండ్లికాని యువతిగా అమెరికా నుండి వచ్చి పర్షియాలో పరిచర్య చేసిన మొట్టమొదటి మిషనరీలలో ఒకరు ఫిడేలియా ఫిస్క్. అక్కడ ఆమె పొందిన సాక్ష్యం అటువంటిది.


మంచి మేధోశ్చక్తి మరియు దైవభక్తి కలిగిన బాలికయైన ఫిడేలియా, చిన్న వయస్సులోనే ఆత్మీయ విషయములపై ఆసక్తిని కనుపరిచారు. పదిహేడేళ్ళ వయసులో ఆమె క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. 1842వ సంll లో ‘మౌంట్ హోలీక్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాల నుండి పట్టభద్రురాలైన పిమ్మట, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె, తన విద్యార్థులను క్రీస్తు నొద్దకు నడిపించువారిగా పేరొందారు. తన తండ్రి సోదరుడైన ప్లినీ ఫిస్క్ చేసిన మిషనరీ సేవ ద్వారా ప్రభావితమైన ఆమె, ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థ యొక్క ఆహ్వానమును అంగీకరించి, 1843వ సంll లో పర్షియాకు మిషనరీగా వెళ్ళారు.


పర్షియా దేశం క్రైస్తవులకు, మరిముఖ్యముగా స్త్రీలకు జీవించుటకు కష్టతరమైన ప్రదేశమై యున్నది. అక్కడి స్థానిక సంస్కృతిపరంగా బాలికలు చదువుకొనుట అవమానకరం. కాగా తల్లిదండ్రులు తమ కుమార్తెలు పాఠశాలకు వెళ్ళవలెనని కోరుకునేవారుకాదు. అయినప్పటికీ, పర్షియాలో మహిళల సామాజిక ప్రమాణాలను మార్చుటకై ఫిడేలియా ఎంతో శ్రమించారు. చిన్న వయసులోనే వివాహం చేయటం మరియు విద్యను నిర్లక్ష్యం చేయటం వంటి వాటికి వ్యతిరేకంగా ఆమె ఎంతో జ్ఞానయుక్తముగా పోరాడారు. దయాహృదయులైన వ్యక్తుల సహాయంతో ఆమె చివరికి బాలికల కొరకు ఒక బోర్డింగ్ పాఠశాలను నిర్మించగలిగారు. క్రమక్రమంగా పర్షియాలోని వివిధ సమాజములవారు తమ కుమార్తెలు చదువుకొనవలసిన ఆవశ్యకతను గ్రహించగా ఆ పాఠశాల అభివృద్ధిని చూరగొంది.


తన 15 సంవత్సరాల సేవలో తన విద్యార్థులకు తల్లివలె వ్యవహరించిన ఫిడేలియా, ఆ విద్యార్థులలో మూడింట రెండు వంతుల మందిని క్రైస్తవ మార్గములోనికి నడిపించారు. పాఠశాల సెలవు దినములలో ఆమె తన పూర్వపు విద్యార్థుల గృహములకు వెళ్ళి వారిని దర్శించి, స్త్రీల కూడికలను నిర్వహించేవారు. ఆమె రోగులకు సేవలను  అందించారు మరియు తన మిషనరీ పనిని గ్రామీణ ప్రాంతాలకు మరియు కొండ జాతులవారి మధ్యకు విస్తరింపచేశారు. ఆమె పరిచర్య ద్వారా కుర్దిష్ తెగల నాయకులతో సహా ఎంతోమంది ప్రమాదకరమైన వ్యక్తులు క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు.


అయితే అనేక సంవత్సరాలు ఎడతెగక శ్రమించినందు వలన క్షీణించిపోయారు ఫిడేలియా. కాగా 1858వ సంll లో అనారోగ్యం కారణంగా ఆమె మసాచుసెట్స్‌కు తిరిగివెళ్ళారు. అయినప్పటికీ తిరిగి కోలుకొనలేకపోయిన ఫిడేలియా ఫిస్క్ 1864వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఈ లోకము విడిచివెళ్ళారు. ఆమె మరణించడంతో ఎంతో కృంగిపోయిన ఒక పర్షియా బాలిక ఎబిసిఎఫ్ఎమ్ సంస్థకు ఈ విధంగా లేఖ వ్రాసింది – "మీ దేశంలో మరో మిస్ ఫిస్క్ ఉన్నారా?"


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, ఈ లోకములో మీరు యేసు క్రీస్తు ప్రభుని జీవితమును మీ జీవితము ద్వారా కనుబరచుచున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, మీ పోలికలోనికి నన్ను మార్చుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment