ఫ్రాన్సిస్ లే జౌ గారి జీవిత చరిత్ర
- జననం: 1665
- మహిమ ప్రవేశం: 10-09-1717
- స్వస్థలం: యాంజియర్స్
- దేశం: ఫ్రాన్స్
- దర్శన స్థలము: సౌత్ కరోలినా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
'సొసైటీ ఫర్ ది గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్' (ఎస్.పి.జి. - విదేశీ ప్రాంతాలలో సువార్త సేవ కొరకైన సంస్థ) అనే సంస్థ తరపున దక్షిణ కరోలినాలో సేవ చేసిన తొలి మిషనరీలలో ఫ్రాన్సిస్ లే జౌ ఒకరు. అతను దైవభక్తి కలిగిన ఒక ఫ్రెంచ్ హుగెనాట్ కుటుంబములో జన్మించారు. హుగెనాట్ క్రైస్తవులు అనగా 16, 17వ శతాబ్దములలోని ఫ్రెంచ్ ప్రొటెస్టంట్లకు చెందిన ఒక క్రైస్తవ సమూహం. 16 వ శతాబ్దం చివరిలో హుగెనాట్లకు తీవ్రమైన హింస కలిగినప్పుడు, ఫ్రాన్సిస్ ఇంగ్లాండుకు పారిపోయారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుండి పట్టా పొందిన పిమ్మట అతను క్రిస్టఫర్ దీవులకు పంపబడ్డారు. స్వల్పకాలం అతను అక్కడి స్థానిక తెగల మధ్య పరిచర్య జరిగించారు.
1706వ సంll లో మిషనరీ సేవ చేయుటకై దక్షిణ కరోలినాకు పంపబడ్డారు లే జౌ. అక్కడ గూస్ క్రీక్ అనే ప్రాంతములో స్థిరపడిన అతను, అక్కడి క్రైస్తవ సంఘము అబద్దపు ప్రవక్తలచే తీవ్రముగా తప్పుదారి పట్టించబడినట్లు గ్రహించారు. అంతేకాక, ఆ ప్రాంతమునకు వచ్చి స్థిరపడి నాయకత్వమును చేజిక్కించుకొనినవారు తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నప్పటికీ, ఏ విధముగానూ వారు క్రీస్తు ప్రేమకు మాదిరిగా జీవించకపోగా కౄరమైన బానిస వ్యాపారములో పాలిభాగస్థులుగా ఉన్నారు. అందువలన అణగారిన స్థానిక అమెరికన్లలో సువార్త ప్రకటించడం ఫ్రాన్సిస్ యొక్క మొదటి ప్రాధాన్యతగా మారింది. అతను కౄరత్వముతో నిండియున్న బానిసల యజమానులకు వ్యతిరేకముగా అలుపెరుగక పని చేశారు మరియు వారి సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సువార్తను ప్రకటించారు. తన స్వజనుల నుండే అనేక ఎదురుదెబ్బలను మరియు అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ, వెనుకంజవేయక క్రైస్తవ సంఘము లోపటను వెలుపలను కూడా సమానత్వమును కలిగియుండవలెనని బోధించుటయే కాక దానిని అనుసరించి నడిచే క్రైస్తవ సంఘములను స్థాపించుటకు సమర్పణ కలిగి ముందుకు సాగిపోయారు ఫ్రాన్సిస్.
క్రియలలో విశ్వాసం కనబడితేనే గాని ఒకనిని క్రైస్తవునిగా పిలవవలెనని ఫ్రాన్సిస్ విశ్వసించారు. ఇతర దైవసేవకులు తమ సంఘముల గురించి స్వయంతృప్తిని కలిగియున్నప్పటికీ, ఫ్రాన్సిస్ మాత్రం తన సంఘము సామాజిక బాధ్యతను స్వీకరించులాగున చేసి, పేదలు మరియు రోగులకు సహాయమును అందించారు. పలు యుద్ధములు నెలకొన్నప్పటికీ కూడా, ఆ క్లిష్ట పరిస్థితులన్నింటి మధ్యలో అతను మిషనరీ సేవ కొరకైన తన పిలుపులో స్థిరముగా నిలబడినవారై, నీగ్రో బానిసల ఆత్మీయ మరియు భౌతిక సంక్షేమం కొరకు శ్రమించారు.
తన మిషనరీ పరిచర్య ప్రారంభం నుండి కూడా అతను పలుమార్లు మలేరియా బారినపడ్డారు. అందువలన క్రమేపీ అతని శరీరము బలహీనపడింది. దేవుని కొరకు ఎంతో గొప్ప ఆసక్తిని కలిగియుండి, ఎన్నో విజయాలను సాధించిన ఫ్రాన్సిస్ లే జౌ, 1717వ సంll లో తీవ్రమైన మలేరియా జ్వరముతో బాధపడిన తరువాత తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకము విడిచి వెళ్ళారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, కష్టాలు మరియు అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సేవించుటకు మీరు సిద్ధమేనా?
ప్రార్థన :
"ప్రభువా, మీ ప్రేమను ఇతరులతో పంచుకునేటప్పుడు భౌతిక పరిస్థితులకు అతీతముగా నేను దూరదృష్టి కలిగియుండగలుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment