గోర్డాన్ హాల్ జీవిత చరిత్ర
Pictures shown are for illustration purpose only |
- జననం: 08-04-1784
- మహిమ ప్రవేశం: 20-03-1826
- స్వస్థలం: కనెక్టికట్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: భారతదేశం
గోర్డాన్ హాల్ ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులలో ఒకరు మరియు భారతదేశంలో అమెరికన్ ప్రొటెస్టంట్ మిషన్లకు మార్గదర్శకులు. ఒక పేద రైతు కుటుంబములో జన్మించిన గోర్డాన్, మిషనరీ సేవ పట్ల ఎంతో శ్రద్ధాసక్తులను, ఉత్సాహమును కలిగియున్న ఒక యువకునిగా ఉన్నారు. అతను ఆండోవర్ థియోలాజికల్ సెమినరీలో చేరగా, అక్కడ అన్యజనుల దేశాలకు సువార్తను తీసుకువెళ్ళుటకు అత్యుత్సాహముతో ఉన్న అడోనిరామ్ జడ్సన్ మరియు మరికొందరిని కలుసుకొనడం జరిగింది. కాగా వుడ్‌బరీలో ఉన్న ఆర్థికముగా గొప్పదైన ఒక క్రైస్తవ సంఘములో పాదిరిగా సేవ చేయుటకు అతనికి అవకాశం లభించినప్పటికీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించిన గోర్డాన్ ఈ విధముగా పలికారు – “నేను నేలమీద పడుకోగలను, ఆకలి బాధను మరియు కష్టములను భరించగలను; అన్యజనుల యొద్దకు వెళ్లుటకై దేవుడు నన్ను పిలుస్తున్నాడు; అయ్యో, అన్యజనులకు నేను సువార్తను ప్రకటించకపోతే అది నాకు ఎంతటి దుఃఖం!”
తత్ఫలితముగా, 1812వ సంll లో భారతదేశానికి పయనమై బొంబాయి (ముంబై) నగరంలో ‘అమెరికన్ మరాఠీ మిషన్’ లేదా ‘బొంబాయి మిషన్’ ను స్థాపించారు గోర్డాన్. ఎంతో శ్రద్ధగా మరాఠీ భాషను నేర్చుకొని, వెనువెంటనే మత్తయి సువార్తను మరాఠీలోకి అనువదించడం ప్రారంభించారు. దేవాలయాలు, అంగడి ప్రదేశాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో అతను సువార్తను ప్రకటించేవారు. అతను చెప్పునది కొందరు శ్రద్ధగా ఆలకించగా మరికొందరు అతనిని అపహాస్యం చేశారు. ఏదేమైనప్పటికీ, ఎవరైనా వింటున్నారా లేదా విస్మరిస్తున్నారా అనునది మనస్సునకు తెచ్చుకొనక ప్రజలకు క్రీస్తును తెలియపరచుటలో గోర్డాన్ స్థిరముగా ముందుకు సాగిపోయారు. అతని ప్రసంగాలు విన్న చాలా మంది స్థానికులు క్రీస్తును అంగీకరించారు మరియు సంఘ సహవాసములోనికి చేర్చబడ్డారు.
ప్రజల సామాజిక శ్రేయస్సు గురించి కూడా చింతను కలిగియున్నారు గోర్డాన్. కాగా అతను పాఠశాలలను స్థాపించారు మరియు పాఠ్యాంశాలను కూడా తయారుచేశారు. ఆ పాఠ్యాంశాలలో బైబిలలోని విలువలు, సూత్రాలు మిళితమై ఉన్నాయి. ప్రతి పాఠశాల స్థానిక ప్రార్థనాలయముగా కూడా పనిచేసింది. ఏలయనగా అక్కడ అతను చుట్టుప్రక్కల ఉన్నవారికి బైబిలు పఠనములను నిర్వహించేవారు. అంతేకాకుండా అతను స్థానికులకు వైద్య సేవలను కూడా అందించారు. 1826వ సంll లో నాసిక్‌లో కలరా వ్యాధి వ్యాపించినప్పుడు, అవసరతలలో ఉన్నవారికి వైద్య సహాయం అందించుటకు వెంటనే అప్రమత్తమైన గోర్డాన్, పరుగున అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు అతను కూడా కలరా వ్యాధి వలన అనారోగ్యానికి గురయ్యారు. కాగా ప్రక్కన ఉన్నవారు అతనికి సహాయం చేయుటకు త్వరపడగా, తన సమయం ఆసన్నమైనదని గ్రహించిన గోర్డాన్, తన చుట్టూ గుమిగూడిన ప్రజలకు తన శక్తికొలదీ చెప్పగలిగినంత శబ్దముతో సువార్తను ప్రకటించారు. తదుపరి అతను నేలమీద పడుకుని, తన ఆత్మను ప్రభువు చేతులకు అప్పగించారు. అతను మరణిస్తున్నప్పుడు అతని పెదవులపై మెదిలిన చిరు ప్రార్థన – "ఓ దేవా, నీకు మహిమకలుగునుగాక!"
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, అన్యజనులకు సువార్తను తీసుకువెళ్ళమని దేవుడు మిమ్ములను పిలుచుచున్నాడు. అందుకు మీ స్పందన ఏమిటి?
దేవునికే మహిమ కలుగునుగాక! ఆమేన్ !
No comments:
Post a Comment