గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్ జీవిత చరిత్ర
- జననం: 23-01-1830
- మహిమ ప్రవేశం: 10-03-1898
- స్వస్థలం: జీస్ట్
- దేశం: నెదర్లాండ్స్
- దర్శన స్థలము: జపాన్
ఒకసారి జపాన్ దళాలన్నింటికీ పైన అత్యున్నత అధికారంలో ఉన్న సేనాధిపతి నీటిలో తేలియాడుతున్న ఒక పుస్తకమును చూశాడు. దానిని తీసుకొనిరమ్మని అతను ఒకనిని పంపి దానిని తెప్పించి చూసినప్పుడు, ఆ పుస్తకం క్రొత్త నిబంధన ప్రతి అని గ్రహించాడు. దానిని గురించి వివరంగా తెలుసుకోవాలనుకున్న అతనిని అతని తోటి అధికారి జపాన్‌లో ఉన్న ఏకైక మిషనరీ యొద్దకు నడిపించాడు. ఆ మిషనరీ మరెవరో కాదు, తీవ్రమైన వ్యతిరేకత మధ్య ఆ దేశంలో ధైర్యముగా సేవను కొనసాగిస్తున్న గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్. అతను ఆ సేనాధిపతికి క్రీస్తు ప్రేమను వివరించి, అతను నిజమైన దేవునిని కనుగొనుటకు సహాయం చేశారు.
పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యభాగంలో జపాన్‌లో సేవచేసిన డచ్ మార్గదర్శక మిషనరీ వెర్బెక్. తన ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకొనిన తరువాత, అతను ఒక లోహపు కర్మాగారంలో పని చేయుటకు అమెరికా వెళ్ళారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో, కలరా కారణంగా అతను మరణిస్తారేమో అన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ సమయంలో అతను నేను బాగుపడితే మిషనరీ అవుతానని దేవునికి మాట ఇచ్చారు. ఆనాడు తాను చేసిన ప్రమాణమును బట్టి అతను న్యూయార్క్‌లోని ఒక బైబిలు వేదాంత కళాశాలలో చేరారు.
డచ్ రిఫార్మ్డ్ చర్చి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి, వెర్బెక్ మరియు అతని భార్యయైన మారియా మేనియన్ 1859వ సంll లో మిషనరీలుగా జపాన్ దేశములోని నాగసాకీకి వెళ్ళారు. అప్పటిలో క్రైస్తవ మతాన్ని ప్రకటించడం జపాన్‌లో నిషేధించబడినందున అతను మొదటి రెండు సంవత్సరములు పరిచర్య కొరకు తనను సిద్ధపరుచుకొనుటలో సమయమును వెచ్చించారు. అతను ఒకవైపు జపానీయుల భాషను నేర్చుకుంటూనే, ఆసక్తిగల స్థానిక విద్యార్థులకు ఆంగ్లమును నేర్పించారు. యేసు క్రీస్తును జపానీయులకు పరిచయం చేయుటకు ఇది ఒక సూక్ష్మమైన మాధ్యమంగా మారింది. వారి మనసు మంచిదే అయినప్పటికీ, తమ సంస్కృతిని బట్టి గర్వించే జపానీయులు క్రైస్తవ మతం బోధించబడుటను సహించలేకపోయారు. దాని కారణంగా, ప్రమాదకరమైన షిమాజు తెగవారి చేతులలో చంపబడకుండా తప్పించుకొనుటకు వెర్బెక్ తరచుగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళవలసి వచ్చింది.
ఒకవైపు పాశ్చాత్యులను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు చెలరేగుతున్నప్పటికీ, మరొకవైపు జపానీయులలో ఎటువంటి మార్పు కనబడకపోయినప్పటికీ, జపాన్‌లో తన పరిచర్యను కొనసాగించారు వెర్బెక్. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రమును మరియు భాషలను విద్యార్థులకు నేర్పించుటకు అతనికి ఉన్న సామర్థ్యమును బట్టి అతను జపాన్ ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని సంపాదించి వారికి సలహాదారునిగా మారారు. నలభై సంవత్సరాల పాటు జపాన్ దేశంలో ప్రొటెస్టంట్ మిషన్ యొక్క పురోగతికి నాయకత్వం వహించిన గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్, ఆ దేశంలో సువార్త ద్వారములు తెరువబడుటలో కీలక పాత్ర పోషించారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీరు దేవునికి చేసిన ప్రమాణములను నెరవేర్చితిరా?
ప్రార్థన :
"ప్రభువా, నా అవిశ్వాస్యతను మన్నించుము. నేను మీకు చేసిన నా ప్రమాణములన్నింటినీ నేను నెరవేర్చెదను. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment