జోహన్నెస్ థియోడోరస్ వాన్ డెర్ కెంప్ జీవిత చరిత్ర
- జననం: 17-05-1747
- మహిమ ప్రవేశం: 15-12-1811
- స్వస్థలం: రోటర్‌డామ్
- దేశం: నెదర్లాండ్స్
- దర్శన స్థలము: దక్షిణాఫ్రికా
కర్తవ్యం పిలుపునిస్తే, మరి ముఖ్యముగా ఆ పిలుపు దేవుని నుండి వచ్చినదయితే, ఎప్పుడైనాసరే నూతన ప్రారంభమును కలిగియుండుటకు అది ఆలస్యం కానేరదు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో వైద్య మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళిన జోహన్నెస్ థియోడోరస్ మునుపు ఒక ప్రముఖ పండితుడు, సైనికుడు మరియు వైద్యునిగా ఉన్నారు. అయితే తన జీవితపు చివరి భాగములో దేవుని పిలుపును అందుకొన్నవారై నూతన లక్ష్యముతో ముందడుగు వేశారు.
థియోడోరస్ యొక్క తండ్రి డచ్ రిఫార్మ్డ్ చర్చిలో సేవ చేసేవారు. లైడెన్ విశ్వవిద్యాలయములో వైద్యశాస్త్రమును అభ్యసించిన థియోడోరస్, 1763వ సంll లో పట్టభద్రులైన పిమ్మట పదహారు సంవత్సరాల పాటు సైన్యములో పనిచేశారు. అక్కడ పరాక్రమము గలిగిన ఒక సైనికునిగా ఉన్న అతను, సైన్యాన్ని విడిచిపెట్టిన తరువాత ఆధునిక భాషలు మరియు సామాన్యశాస్త్రములను అభ్యసించుటకు ఈడెన్‌బర్గ్ వెళ్ళారు. తదుపరి అతను హాలాండుకు తిరిగి వచ్చి వైద్యము చేయడం ప్రారంభించి అందులో సఫలులయ్యారు. అయితే అనుకోని విధంగా ఒక ప్రమాదంలో అతని భార్యాబిడ్డలు మరణించడంతో అతను గొప్ప శోక సంద్రములో మునిగిపోయారు. ఈ అనుభవం అతనిని క్రీస్తు నొద్దకు నడిపించింది. కాగా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన అతను, తన మిగిలిన జీవితమును ఆయన సేవ చేయుటకు ఉపయోగించారు.
తత్ఫలితముగా అతను లండన్ మిషనరీ సొసైటీలో చేరగా, ఆ సంస్థ ద్వారా అతను దక్షిణాఫ్రికాకు పంపించబడ్డారు. తద్వారా యాభై ఏళ్ళు పైబడిన థియోడోరస్, 1798వ సంll లో నేరస్థులను తీసుకువెళుతున్న ఒక ఓడలో దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. తన ప్రయాణమంతటిలో కూడా నేరస్థుల యొక్క ఆత్మీయ మరియు భౌతికపరమైన అవసరతలను తీర్చుటకు అతను నిర్విరామంగా పనిచేశారు.
దక్షిణాఫ్రికాలో అతను వివిధ ప్రదేశాలలో పరిచర్య చేశారు. అక్కడి రాజు ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపొమ్మని అతనిని ఆదేశించిన పిమ్మట అతను దక్షిణాఫ్రికా యొక్క సంచార ప్రజలైన హాటెంటాట్ అనే తెగవారి కొరకు ఒక ప్రత్యేకమైన సేవను ప్రారంభించారు. 1803వ సంll లో అతను అల్గోవా బే సమీపంలో బెథెల్స్‌డోర్ప్ అనే మిషన్ స్టేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా అతను హాటెంటాట్ ప్రజలకు సువార్తను ప్రకటించారు, నాగరికతను నేర్పించారు మరియు వారిని ఒక సమాజముగా తీర్చిదిద్దారు. ఏడు సంవత్సరాల వ్యవధిలో అక్కడ ఆరాధన కూడిక కొరకు సమకూడే వారి సంఖ్య వెయ్యి లెక్కకు చేరుకుంది.
అక్కడ ప్రబలముగా ఉన్న బానిస వ్యాపారం యొక్క క్రూరత్వం మంచి మనసుగల ఈ వైద్యుడికి ఎంతో బాధను కలిగించింది. కాగా, అతను బీదలైన బందీలను విడిపించుటకు తనకు కలిగినదంతటినీ వెచ్చించారు. చివరికి అతని ప్రయత్నాల వలన ఇతరులు సహకారమందించగా హాటెంటాట్ ప్రజలు స్వేచ్ఛను పొందారు. 1811వ సంll లో ఈ లోకమును విడిచి ప్రభు సన్నిధానమును చేరుకున్న అతని పరిచర్య ఎక్కువ కాలవ్యవధిని కలిగియుండకపోయినప్పటికీ, అతను ఆది సంఘము యొక్క అపొస్తలుల వంటి ఒక అద్భుతమైన దైవసేవకులు అని చెప్పబడుతుంది.
ధైర్యవంతులైన ఈ గొప్ప మిషనరీ ఒక గొప్ప సమాజం నుండి వచినవారైనప్పటికీ అత్యల్పులైనవారితో కలిసియుండి వస్త్రధారణ కూడా ఎరుగని పేద హాటెన్‌టాట్ ప్రజల జీవితములలో వెలుగును నింపుటకు అన్నింటినీ విడిచి వచ్చారు. ఏలయనగా వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకొనుటకు అర్హులని థియోడోరస్ బాగుగా ఎరిగియున్నారు!
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుని ప్రేమను పంచుకొనుటకై మీరు ఎవరిని వెతుకుతూ వెళుతున్నారు?
ప్రార్థన :
"ప్రభువా, థియోడోరస్ వలె ధైర్యముతోను మరియు నమ్మకముగాను మిమ్ములను సేవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment