జాన్ లివింగ్‌స్టన్ నెవియస్ జీవిత చరిత్ర
- జననం: 04-03-1829
- మహిమ ప్రవేశం: 19-10-1893
- స్వస్థలం: సెనెకా కౌంటీ
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: చైనా
అమెరికాకు చెందిన జాన్ లివింగ్‌స్టన్ నెవియస్ చైనాలో నలభై సంవత్సరాల పాటు దేవుని సేవ చేసిన మిషనరీ. అతని పరిచర్య మరియు దేశీయ క్రైస్తవ సంఘ స్థాపన పై అతను చేసిన రచనలు చైనా మరియు కొరియా దేశాలలోని మిషనరీలను అతను జీవించియున్న కాలములోనే కాక అతని మరణానంతరం కూడా ఎంతో ప్రభావితం చేసినవిగా ఉన్నాయి.
న్యూయార్క్‌లోని యూనియన్ కాలేజీలో చదువు పూర్తిచేసుకొనిన పిమ్మట నెవియస్ వేదాంతశాస్త్రమును అభ్యసించుటకుగాను ప్రిన్స్టన్ సెమినరీలో చేరారు. అక్కడ చదువుతున్న సమయంలో మిషనరీ సేవకైన తన పిలుపును గ్రహించిన అతను దానిని గొప్ప భాగ్యముగా ఎంచారు. కాగా అతను ‘ప్రెస్బిటేరియన్ బోర్డ్ ఆఫ్ మిషన్స్’ సంస్థకు దరఖాస్తు పెట్టుకొనగా, ఆ సంస్థ అతనిని చైనాలోని నింగ్పోలో సేవ చేయుటకు నియమించింది. తద్వారా తన భార్యయైన హెలెన్‌తో కలిసి 1853వ సంll లో చైనాకు పయనమైన అతను, ఆరు నెలల తరువాత నింగ్‌పోకు చేరుకున్నారు.
చైనాలో అతను ఏడాదిలో అధిక భాగం సంచార బోధకునిగా సేవ చేస్తూ, మిగిలిన సమయంలో మిగుల తీవ్రముగా యేసుక్రీస్తుని శిష్యులుగా మారుటకు శిక్షణనిచ్చేవారు. పరిచర్య నిమిత్తం అతను చేసే ప్రయాణాలు ఎంతో కష్టతరమైనవి. ఆ ప్రయాణాలు అధికశాతం గుర్రంపై చేసే ప్రయాణాలుగా ఉండేవి. నెవియస్ ప్రధానముగా స్వయం ఆధారిత సంఘములను స్థాపించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేవారు. మిషనరీలు ఇతర దేశాల నుండి జీతాలు పొందే విధానమునకు వ్యతిరిక్తులైన నెవియస్, అందుకు బదులుగా విశ్వాసము పై ఆధారపడి సేవ చేయమని తన సహపరిచారకులను ప్రోత్సహించేవారు. మిషన్ యొక్క నిధులతో అధికారిక చర్చి భవనాలను మరియు ఉపకరణములను నిర్మించే విధానమును అతను విశ్వసించలేదు. అయితే విశ్వాసులు తాము ఆశీర్వదింపబడులాగున వారు ఎంత అల్పులైనా ఆరాధనా కూడికలు నిర్వహించుట కొరకు కావలసిన ఏర్పాట్లను తామే స్వయంగా సిద్ధపరచుకొనవలెనని అతను వేడుకొనేవారు. అతని పరిచర్య పద్ధతులు స్థానిక సంఘ కార్యకలాపాలపై పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించాయి మరియు సంఘమునకు దేశీయతను చేకూర్చాయి. అయితే విదేశీ నిధులపైనే అధికముగా ఆధారపడియున్న అతని స్వంత సహచరులే అతని పద్ధతులను తీవ్రంగా విమర్శించారు.
1877వ సంll లో చైనాలో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సహాయక చర్యలలో తోడ్పాటునందించిన నెవియస్, దాని మూలముగా అనేకమందికి సువార్తను అందించగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి లేఖనముల రహస్యములను బయలుపరుచునట్లు అన్యజనులకు మొదట యేసు క్రీస్తును తెలియపరచిన తరువాతనే బైబిలును ఇవ్వవలెనని అతను నిర్ధిష్టముగా చెప్పేవారు.
చైనా మరియు కొరియాలలో అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ సంఘ స్థాపనకు కారణమైన ఈ అలుపెరుగని దేవుని పరిచారకుడు 1893వ సంll లో తన పరలోకపు వాసస్థలమును చేరుకున్నారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, విశ్వాసముపైనే ఆధారపడి దేవుని సేవచేసేవారిగా మీరు ఉన్నారా?
ప్రార్థన :
"ప్రభువా, ఎల్లప్పుడూ నిలిచియుండగలిగే ఆత్మీయ ఫలములను ఫలించుటకు నేను మీ పైనే ఆధారపడునట్లు చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment