జాన్ డ్రెయిస్‌బాక్ గారి జీవిత చరిత్ర
- జననం : 1921
- మరణం : 2009
- స్వస్థలం : వాయువ్య ఓహియో
- దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము : నైజీరియా
దైవభక్తిగల ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన జాన్ డ్రెయిస్‌బాక్, వారి కుటుంబములోని ముగ్గురు సంతానంలో ఆఖరివాడు. అతని తండ్రి ఆదివారపు బైబిలు పాఠశాల (సండే స్కూల్) యొక్క నిర్వాహకులు. అతని తల్లి 'ఉమెన్స్ మిషనరీ సొసైటీ' (మహిళా మిషనరీ సంస్థ) లో క్రియాశీల సభ్యురాలు మరియు ఆదివారపు బైబిలు పాఠశాల యొక్క ఉపాధ్యాయురాలు. కాగా విదేశాలలో మిషనరీ సేవ పట్ల మిగుల ఆసక్తి కలిగియున్న అతని తల్లిదండ్రులు తమకు పిల్లలు కలుగక మునుపే వారిని ప్రభువు సేవ కొరకై సమర్పించారు. జాన్ కు 12 సంll ల వయసు ఉన్నప్పుడు వారి సంఘములో జరిగిన ఒక ఉజ్జీవ కూడికలో తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపమొంది, వాటిని ఒప్పుకొని రక్షణ కొరకై దేవుని సన్నిధిలో వేడుకొనగా, అతను తిరిగి జన్మించిన అనుభవమును పొందారు. మిషనరీల జీవిత చరిత్రలను చదివే అతని తల్లి, వాటిని చదువుటకు జాన్ ను కూడా ప్రోత్సహించారు. ఇది ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయుట కొరకైన అతని పిలుపును నిశ్చయపరచుటలో కీలక పాత్ర పోషించింది.
వైద్య కళాశాల నుండి పట్టా పొందిన తరువాత 1948వ సంll లో తన జీవిత భాగస్వామియైన బెట్టీతో కలిసి పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాకు మిషనరీగా వెళ్ళారు జాన్. అక్కడ అతను ఉత్తర నైజీరియాలోని మూడు పెద్ద కుష్ఠురోగుల ఆసుపత్రులను పర్యవేక్షించే నిర్వాహకులుగా పనిచేశారు. ఈ ప్రాంతం ప్రధానంగా ముస్లిం ప్రజలచే ఆక్రమించబడినందున వారు చేస్తున్న సేవలో ప్రధానముగా సువార్త ప్రకటనపై వారి దృష్టి కేంద్రీకరించబడింది. అంతేకాకుండా దేవుని వాక్య జ్ఞానములో ఎదుగులాగున ప్రజలను ప్రోత్సహించుటకుగాను మరియు పురుషులకు పాదిరులుగా శిక్షణనిచ్చుటకుగాను వారు బైబిలు పాఠశాలలను కూడా నిర్వహించారు.
సెలవు దినములలో అతను ఆఫ్రికా నుండి వచ్చినప్పుడు సువార్త సేవ చేసే విశ్వవిద్యాలయమైన దక్షిణ కెరోలినాలోని బాబ్ జోన్స్ విశ్వవిద్యాలయం వారు వైద్యపరమైన మిషనరీ సేవ కొరకు పాఠ్యాంశాలను అభివృద్ధి చేయుటకై జాన్ ను నియమించారు. దానిని గురించి అతను దృఢముగా విశ్వసించినది ఏమంటే వైద్య మిషనరీ శిక్షణలో అనుభవపూర్వకమైన శిక్షణ ఎంతో ముఖ్యమైన అంశమని. కాగా అతను ‘ప్రాజెక్ట్ కంపాషన్’ (కరుణా పరియోజన) అనుదానిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా అనేకమంది విద్యార్థులు నిజముగా జరుగుతున్న సేవాకార్యక్రమాలలో పాల్గొని అనుభవపూర్వక శిక్షణ పొందారు. అతను ఆ విశ్వవిద్యాలయము యొక్క ఒక ఉద్యోగిగానే పరిగణింపబడినప్పటికీ, జాన్ దంపతులు తమ అధిక సమయమును వైద్యపరమైన వివిధ సేవా కార్యకలాపాలలో సేవలందించుటకు వెచ్చించి స్వతంత్ర మిషనరీలుగా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.
అంతేకాకుండా, తన జీవితములో చెప్పుకోదగినంత కాలం పాటు విదేశాలలో మిషనరీ సేవ చేయుటను గురించి కళాశాల విద్యార్థులకు ఆలోచన చెబుతూ, అందుకు వారిని ప్రోత్సహించుచూ కూడా జాన్ సేవలందించారు. జాన్ ప్రపంచ నలుమూలలా సువార్త ప్రకటించబడుటను గురించి ఎల్లప్పుడూ యవ్వనస్థులను సవాలు చేసేవారు. అది ఎంతో ఫలభరితమైనదనుటకు అతని ద్వారా ప్రోత్సహించబడి ప్రపంచమంతటా విదేశీ మిషనరీ పరిచర్యలలో తమ సేవలనందించుచున్న యవ్వనస్థులు సాక్ష్యముగా నిలుస్తారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, ఇంతకు మునుపెన్నడూ సువార్త విననివారికి సాక్ష్యమిచ్చే అవకాశం మీరు కూడా కలిగియున్నారని మీరు గ్రహించగలుగుతున్నారా?
ప్రార్థన :
"ప్రభువా, నా స్వార్థపూరితమైన జీవితమును విడిచిపెట్టి, విమోచననిచ్చే కృపా సందేశము యొక్క అవసరతలో ఉన్నవారికి ఆ సందేశమును చేరవేయుటకు నన్ను నేను సమర్పించుకొనెదను. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment