Search Here

May 14, 2023

Hans Egede | హాన్స్ ఎగెడే

హాన్స్ ఎగెడే  గారి జీవిత చరిత్ర

  • జననం : 31-01-1686
  • మరణం : 05-11-1758
  • స్వదేశం : నార్వే
  • దర్శన స్థలము : గ్రీన్‌లాండ్‌

హాన్స్ ఎగెడే డానిష్-నార్వే లూథరన్ మిషనరీ. అతను కోపెన్‌హాగన్‌లో వేదాంతశాస్త్రమును అభ్యసించారు. తదుపరి నార్వేలోని లోఫోటెన్ దీవులలో ఉన్న ఒక చిన్న లూథరన్ సంఘమునకు పాదిరిగా నియమించబడగా, అతను ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి అక్కడి ప్రజలకు సేవ చేశారు మరియు క్రీస్తునందు వారి విశ్వాసమును బలపరిచారు. లోఫోటెన్‌లో ఉన్న సమయంలో గ్రీన్‌లాండ్‌లో స్థిరపడి, శతాబ్దాల తరబడి మిగిలిన ప్రంపంచముతో సంబంధాలు లేనటువంటి ఓల్డ్ నార్స్ ప్రజలను గురించి పలు కథలు అతను వినడం జరిగింది. అయితే ఒక రోజు అతను తాను వారిని వెదకి కనుగొని, వారికి పాదిరిగా ఉండవలెనని తన ఆంతర్యములో ఒక స్వరమును విన్నారు. ఆ పిలుపు అతనిని ఏనాడూ విడిచిపెట్టలేదు. కాగా అతను తన భార్యతో పాటు గ్రీన్‌లాండ్‌కు వెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు. అందుకొరకై అతను అన్యజనులు ఉన్నంతవరకు సేవ చేయవలసిన బాధ్యత క్రైస్తవులందరికీ ఉందని ఎత్తి చూపిస్తూ డానిష్ (డెన్మార్క్) రాజైన నాలుగవ ఫ్రెడరిక్ కు ఒక లేఖ వ్రాసి పంపారు. దాదాపు పదేళ్ళు వేచియుండిన తరువాత చివరకు అతను గ్రీన్‌లాండ్‌ మిషన్‌కు ఆమోదం పొందగలిగారు.


1722వ సంll లో గ్రీన్‌లాండ్‌కు వచ్చారు హాన్స్. అక్కడి ప్రజలతో అతని మొట్టమొదటి పరిచయం అంత ప్రోత్సాహకరముగా లేదు. ఏలయనగా నాగరికతలేని ఆ ప్రజలు బోధింపబడనివారు, అన్యదేవతలను పూజించేవారు మరియు కౄర స్వభావం కలిగినవారు. కాగా వారి మీద కనికరముతో చలించిన అతని హృదయం కరుణతో వారిని చేరుకొనుటకు ముందుకు వెళ్ళింది. ఆదివారమున క్రమం తప్పకుండా అతను కూడికలను నిర్వహించేవారు. ప్రారంభంలో ఆ కూడికలకు చాలా కొద్దిమంది మాత్రమే హాజరైనప్పటికీ, అతను స్థానిక భాషలో సేవచేయడం కొనసాగించడంతో ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోగలిగారు. తద్వారా అతను శ్రమించి చేసిన పరిచర్య కొంత ఫలమును చూడటం ప్రారంభమయ్యింది. కాగా అతను గ్రీన్‌లాండ్‌కు చెందిన ప్రజలలో మరింత దురుసుగా ఉండేటటువంటి వారికి కూడా బోధించగలిగారు. ప్రజలలో మశూచి తెగులు విజృంభించిన సమయములో రోగులకు సేవలందించుటకును మరియు చనిపోయినవారిని సమాధి చేయుటకును దివారాత్రుళ్ళు శ్రమించి పనిచేశారు హాన్స్. ప్రసంగాల ద్వారా కంటే ప్రేమను కనుపరిచే అటువంటి చర్యల ద్వారా మరింత సమర్థవంతంగా అతను సువార్తను ప్రకటించగలిగారు.


1758వ సంll లో మహిమలోనికి పిలవబడే వరకు కూడా హాన్స్ సువార్తను నమ్మకముగా ప్రకటించారు. అతను పరిచర్య చేసిన ప్రాంతం ఈ భూమిపైన నివసించుటకు అతి క్లిష్టమైన ప్రదేశాలలో ఒకటని చెప్పవచ్చు మరియు ఆ ప్రజలు, సువార్త ప్రకటించుటకు మిగుల కష్టతరమైన ప్రజలని చెప్పవచ్చు. అయినప్పటికీ, హాన్స్ ఎగెడే దేవుడు తనకు ఇచ్చిన పిలుపుకు విధేయత చూపించినవారై, ఆయన తనకు అప్పగించిన ప్రాంతములో తనకు అప్పగింపబడిన ప్రజల మధ్య సేవ చేయుటలో చివరి వరకూ స్థిరముగా నిలిచారు. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, స్థితిగతులతో నిమిత్తం లేకుండా దేవుని పిలుపుకు విధేయులుగా ఉండుటకు దృఢమైన సంకల్పమును మీరు కలిగియున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, నా ప్రయాసము మీయందు వ్యర్థముకాదనే నిరీక్షణనిచ్చినందులకై వందనములు. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment