పీటర్ పెర్సివల్ గారి జీవిత చరిత్ర
- జననం : 24-07-1803
- మరణం : 11-07-1882
- స్వదేశం : ఇంగ్లాండు
- దర్శన స్థలము : శ్రీలంక, భారతదేశం
పీటర్ పెర్సివల్ ఒక ఆంగ్లేయ మిషనరీ, భాషావేత్త మరియు ఆంగ్లేయులు పాలించిన కాలంలో శ్రీలంక మరియు భారతదేశంలోని దక్షిణ తమిళనాడులలో విద్యను అందించిన మార్గదర్శకులలో ఒకరు. అతను ‘వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ సొసైటీ’ (డబ్ల్యూఎంఎంఎస్) వారిచే 1826వ సంll లో శ్రీలంకలోని జాఫ్నా ద్వీపకల్పానికి పంపించబడ్డారు. 1829-1832 మధ్య కాలంలోని కొద్ది సంవత్సరములు బెంగాల్ ప్రాంతంలో గడిపినది మినహా 1851వ సంll వరకు కూడా జాఫ్నాలోనే ఉన్న అతను, తన వయోజన జీవితములో అధిక భాగం ఆ ద్వీపకల్పంలోనే గడిపారు. బెంగాల్ లో ఉన్న సమయములో అతను ప్రెస్బిటేరియన్ మిషనరీ అయిన అలెగ్జాండర్ డఫ్ యొక్క విద్యా విధానాల ద్వారా ఎంతో ప్రభావితులయ్యారు. ఫలవంతమైన మిషనరీ కార్యకలాపాలకు విద్యే ఆధారమని అతను గ్రహించారు.
కాగా జాఫ్నాకు తిరిగి వచ్చినప్పుడు అతను అనేక పాఠశాలలను ప్రారంభించారు మరియు అంతకు మునుపు స్థాపించబడిన ప్రాథమిక పాఠశాలలను ఉన్నత శ్రేణికి అభివృద్ధి పరిచారు. అతను ఆ జిల్లాలో పాఠశాలలను స్థాపించుచూ, ఉపాధ్యాయులను నియమించుచూ గ్రామం నుండి గ్రామానికి వెళ్ళారు. ఆ పాఠశాలలు అక్షరాస్యతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా సామాజిక పరిస్థితులను మార్చాయి, మరి ముఖ్యముగా సువార్త ప్రచార మాధ్యమాలుగా పనిచేశాయి. ఆంగ్ల భాషలోనో లేక పోర్చుగీసు భాషలోనో బైబిలు బోధించబడుట కంటే స్థానిక భాషలో బోధించబడవలెనని అతను విశ్వసించారు. కాబట్టి అతను మునుపు తన విద్యార్ధి మరియు తమిళ పండితుడైన ఆరుముగ నావలర్ యొక్క సహకారముతో శ్రీలంక తమిళ మాతృకలోనికి బైబిలును అనువదించారు. తద్వారా తామే స్వయంగా దేవుని వాక్యమును చదివి ఆత్మీయముగా ఎదుగులాగున ప్రజలు ప్రోత్సాహమొందారు. అంతేకాకుండా 1836వ సంll లో జాఫ్నాలో సెయింట్ పాల్స్ ప్రార్థనా మందిరమును కూడా స్థాపించారు పెర్సివల్. ఇది అక్కడ తమిళ భాషలో ఆరాధించే మొదటి క్రైస్తవ ఆరాధనా స్థలమయ్యింది.
1851వ సంll లో ఇంగ్లాండు దేశానికి తిరిగి వెళ్ళిన అతను, అక్కడ డీకనుగా (క్రైస్తవ సంఘ సహాయక పరిచారకునిగా) నియమించబడ్డారు మరియు కొన్ని సంవత్సరాల పాటు కాంటర్బరీలోని సెయింట్ అగస్టిన్స్ కళాశాలలో బోధకునిగా పనిచేశారు. పిమ్మట 1854వ సంll లో తిరిగి భారతదేశానికి వచ్చి మద్రాసులో పరిచర్య చేశారు. అప్పటిలో నూతనముగా స్థాపించబడిన మద్రాస్ విశ్వవిద్యాలయంలో స్థానిక భాషా సాహిత్య ఆచార్యునిగా కూడా అతను నియమితులయ్యారు. అతని బహుళ భాషా నిఘంటువులు మరియు భారతీయ సంస్కృతికి సంబంధించిన పుస్తకములు తరువాత వచ్చిన మిషనరీలు పరిచర్యకు సిద్ధపడి వచ్చునట్లు ఉపకరించాయి. తన చివరి రోజులను తమిళనాడులోని యెర్కాడ్ లో గడిపిన పీటర్ పెర్సివల్, 1882వ సంll లో పరమునందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, క్రొత్త విషయములను నేర్చుకొని, వాటి ద్వారా ప్రభువును సేవించుటకు మీరు అంగీకారయుతమైన మనస్సును కలిగియున్నారా?
ప్రార్థన :
"ప్రభువా, ఇతరులకు బైబిలు యొక్క సత్యములను అందించే సాధనముగా నన్ను వాడుకొనుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment