Search Here

May 14, 2023

William Goudie | విలియం గౌడీ

విలియం గౌడీ గారి జీవిత చరిత్ర

  • జననం : 06-05-1857 
  • మరణం : 09-04-1922
  • స్వస్థలం : చానర్‌విక్
  • దేశం : స్కాట్లాండ్
  • దర్శన స్థలము : భారతదేశం

క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించిన విలియం గౌడీ తన చిన్ననాటి నుండే దేవుని వాక్యమునందు ఎంతో ఆనందించెడివారు. ఆత్మను ప్రజ్వలింపజేసే విధముగా ఉండే డి. ఎల్. మూడీ మరియు సాంకీ వంటి గొప్ప ప్రసంగికుల ఉపన్యాసములు  లేతప్రాయములో ఉన్న గౌడీపై ఎంతో ప్రభావమును చూపాయి. తత్ఫలితముగా తాను కూడా దేవుని ప్రేమాసందేశమును ప్రపంచములోని మారుమూల ప్రాంతములకు తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు గౌడీ. ఒకరోజు సాయంత్రం ఒక ఉజ్జీవ కూడికలో అతను తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నారు. దేవుని పిలుపును వెన్నంటి ముందుకు సాగిపోవుటకుగాను అతను 1879వ సంll లో రిచ్‌మండ్ బైబిలు కళాశాలలో చేరారు. లండన్‌లో సేవ కొరకైన నియామక అభిషేకం పొందిన తరువాత భారతదేశంలో మిషనరీ సేవ చేయుటకైన అవకాశము తలుపు తట్టగా అతను సంతోషముతో దానిని అంగీకరించారు.


1882వ సంll లో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై నగరములో అడుగుపెట్టారు గౌడీ. మొదటిగా అక్కడి జార్జ్ టౌన్ ప్రాంతములో తన పరిచర్యను ప్రారంభించిన అతను, తరువాత సెయింట్ థామస్ మౌంట్ లోని ఇంగ్లీష్ వెస్లీ సంఘములో సేవలందించారు. అతను స్థానిక భాషను నేర్చుకొని, స్థానికులకు వారి మాతృభాషలో పరిచర్య చేశారు. 1883వ సంll లో తిరువల్లూర్ అనే పట్టణమునకు వెళ్ళిన అతను, పలు విధములుగా అణగారిన స్థితిలో ఉన్న వారి మధ్య సేవ చేశారు. పేదలు మరియు అంటరానివారి పట్ల అతను చూపిన కనికరము క్రీస్తు ప్రేమను మరియు ఆయన పరిచర్యను ప్రతిబింబిస్తుంది. అతను కేవలం వారి ఆత్మీయ జీవితమును గురించి మాత్రమే కాకుండా వారి ఆర్థిక మరియు సామాజిక సంక్షేమమును గురించి కూడా చింత కలిగియుండేవారు.


అంటరానివారికి, తక్కువ కులాలకు చెందిన అట్టడుగు వర్గాల వారికి మద్దతుగా అతను నిలువబడినప్పుడు, ఉన్నత కులాలవారు అతనికి వ్యతిరేకముగా లేచి, అతనిపై రాళ్ళను, పాడైపోయిన ఆహారపదార్థములను విసిరివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, గౌడీ తాను కలిగియున్న దైవభక్తికి అనుగుణముగా స్పందించి, “మీరు నాపై రాళ్ళు కురిపించారు, అయితే దేవుడు మీపై ఆహారమును కురిపిస్తాడు” అని వారిని ఆశీర్వదించారు. ఏలయనగా ఆ సమయములో ఆ ప్రాంత ప్రజలు కరువు వలన బాధపడుతున్నారు. 1889-91 మధ్య కాలంలో గొప్ప కరువు మరియు భయంకరమైన కలరా వ్యాధి సంభవించిన సమయములో అతను పేదల కొరకు ఎంతో శ్రమించారు మరియు వారికి ఆహారమును అందించుటకు తన శక్తికొలది సకల విధములుగా ప్రయత్నించారు. ఈ సేవలు మాత్రమే కాదు, పేదవారికి మరియు అవసరతలలో ఉన్నవారికి సహాయమందించుటకుగాను ఈక్కాడు మరియు తిరువల్లూర్ ప్రాంతములలోను మరియు వాటి పరిసర ప్రాంతములలోను అతను పాఠశాలలు, ఆసుపత్రులు, కుట్టు పని నేర్పించే సంస్థ మరియు  లేసులు తయారుచేసే ఒక పరిశ్రమను స్థాపించారు.


భారతదేశంలో 25 సంవత్సరాల పాటు అలుపులేకుండా సేవ చేసిన పిమ్మట ఇంగ్లాండు దేశానికి తిరిగి వెళ్ళిన అతను, 65 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. ‘ఈక్కాడు యొక్క నిజమైన అపొస్తలుడు’ అని సరియైన విధముగానే ప్రశంసలు అందుకున్న విలియం గౌడీ, తన జీవితమంతా క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా జీవించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ శత్రువులు మరియు పేదవారి యెడల మీరు ఎటువంటి ప్రేమాకనికరములను కలిగియున్నారు? 

ప్రార్థన :

"ప్రభువా, నాలో నుండి ఇతరులకు ప్రేమాధారలు ప్రవహించునట్లు మీ ప్రేమతో నన్ను నింపుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment