రాబర్ట్ కాల్డ్వెల్ గారి జీవిత చరిత్ర
- జననం : 07-05-1814
- మరణం : 28-08-1891
- స్వస్థలం : క్లాడీ
- దేశం : ఐర్లాండ్
- దర్శన స్థలము : భారతదేశం
ఒక బీద కుటుంబమైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబములో జన్మించిన రాబర్ట్ కాల్డ్వెల్, తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండే పనిచేయడం ప్రారంభించారు. అతను అధికారికముగా కొంత వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, లండన్ మిషనరీ సొసైటీ (ఎల్ఎమ్ఎస్) ద్వారా గ్లాస్గో విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందే అవకాశమును పొందగలిగారు. సేవ చేయుట కొరకు నియామక అభిషేకం పొందిన పిమ్మట 1838వ సంll లో ఎల్ఎమ్ఎస్ తరపున మద్రాసుకు చేరుకున్నారు రాబర్ట్. అక్కడి స్థానిక ప్రజలను సంధించవలసిన ఆవశ్యకతను గ్రహించిన అతను, తమిళ భాషలో పట్టు సాధించి స్థానిక ప్రజలకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దినములు గడువగా, తమిళ పండితునిగా పేరుగాంచిన రాబర్ట్, ‘ఎ కంపారటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ (ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం) అనే పుస్తకమును వ్రాశారు. ఆ ప్రాంతములో పరిచర్య చేయుటకు సిద్ధపడుటలో తరువాత వచ్చిన మిషనరీలకు ఈ పుస్తకం ఎంతో ఉపకరించింది.
జి. యు. పోప్ మరియు బెంజమిన్ షుల్ట్జ్ వంటి మిషనరీలచే ఎంతో ప్రభావితులయ్యారు కాల్డ్వెల్. అతను పేదల అభ్యున్నతి కొరకు అంకితభావంతో కృషి చేశారు. 1877వ సంll లో తిరునెల్వేలి యొక్క బిషప్పుగా నియమించబడిన తరువాత, అతను ప్రజల జీవితాలలో మార్పును చేకూర్చిన అనేక ప్రణాళికలను చేపట్టారు. అతను పట్టణాలు మరియు గ్రామాలలో పాఠశాలలను స్థాపించారు మరియు పేరుగాంచిన అనేక క్రైస్తవ ఆలయములను నిర్మించారు. వీటిలో ఇడైయంగుడిలోని ‘హోలీ ట్రినిటీ చర్చి’ ఒకటి. క్రైస్తవ సంఘములలో క్రైస్తవ మత విలువలను బోధించే స్థానిక కాటేకిస్టుల సహాయంతో పేదప్రజల మధ్య క్రమబద్ధమైన క్రైస్తవ సంఘములను ఏర్పరుచుటకు ప్రణాళికలను తయారుచేశారు. అతని భార్యయైన ఎలిజా అతని మిషనరీ కార్యకలాపాలన్నిటిలో అతని వెన్నంటి నిలిచినవారై రాబర్ట్ యొక్క బలముగా మరియు అతనికి మంచి ఆధారముగా మారారు. రాబర్ట్ చేపట్టిన పాఠశాల నిర్మాణ ప్రాజెక్టులలోను మరియు స్థానిక సముదాయాల ప్రజలకు సహాయక ఆదాయ వనరుగా ఉండునట్లు ఆ జిల్లాలో లేసు తయారీ పరిశ్రమలను స్థాపించుటలోను ఆమె ఎంతో తోడ్పాటునందించారు.
తమిళ ప్రజలతో అతని అనుబంధం రాబర్టుకు విస్తృతముగా ఖ్యాతిని సంపాదించి పెట్టింది. అయినప్పటికీ, తన జీవితాంతం ఒక సాధారణమైన దీనత్వము కలిగిన వ్యక్తిగానే మిగిలిపోయిన రాబర్ట్, తాను దేని నిమిత్తమై పిలువబడ్డారో ఆ గొప్ప ప్రణాళిక నుండి ఏనాడూ తొలగిపోలేదు. అతను తనకు అప్పగింపబడిన గొర్రెల మందకు శ్రద్ధ మరియు సానుభూతి కలిగిన అప్రమత్తమైన గొర్రెల కాపరిగా ఉన్నారు. అపొస్తలుని పోలిన అతని పరిచర్య మరియు మాదిరికరమైన సేవా జీవితం ద్వారా అతను అనేక మంది స్థానిక ప్రజలకు పరిచర్య చేయుటలో శిక్షణనిచ్చారు. క్రైస్తవుల మరియు క్రైస్తవేతరుల గుణగణాలను మరియు స్థాయిని మెరుగుపరిచినదిగా అతని పరిచర్య గుర్తింపునొందింది. అర్ధ శతాబ్దం పాటు పరిచర్య చేసిన పిమ్మట 1891వ సంll లో పరమునందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు రాబర్ట్ కాల్డ్వెల్.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, క్రీస్తు కొరకు ఆయన సంఘమును కట్టే పనిలో మీరు ఎప్పుడు చేరెదరు?
ప్రార్థన :
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment