Search Here

May 14, 2023

Augustine of Hippo | హిప్పోకు చెందిన అగస్టిన్

హిప్పోకు చెందిన అగస్టిన్ గారి జీవిత చరిత్ర

  • జననం : 13-11-354
  • మహిమ ప్రవేశం : 28-08-430
  • స్వదేశం : అల్జీరియా, ఉత్తర ఆఫ్రికా
  • దర్శన స్థలము : ఉత్తర ఆఫ్రికా

అంతర్గత అబద్ద బోధకుల నుండి ఆదికాల సంఘము అనేక దాడులను ఎదుర్కొంది. నిజమైన క్రైస్తవ సంఘ సిద్ధాంతము నశించునేమోయన్న అపాయకరమైన పరిస్థితులలో సెయింట్ అగస్టిన్ ఎంతో జ్ఞానయుక్తముగా అందుకు ప్రతిస్పందించారు. అతని యొక్క ప్రతిస్పందనల రచనలు క్రైస్తవ సంఘమునకు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తరువాత అతి ముఖ్యమైన రచనలుగా కొందరు ఈ నాటికీ భావిస్తారు. అతను వ్రాసిన ‘కన్ఫెషన్స్’ (ఒప్పుకోలు) మరియు ‘ది సిటీ ఆఫ్ గాడ్’ (దేవుని పట్టణం) మొదలగు అనేక రచనలు బైబిలు లేఖనముల భావములను వివరించు పద్ధతికి ఒక రూపమును చేకూర్చినవిగాను మరియు ఆధునిక క్రైస్తవ ఆలోచనా విధమునకు పునాది వేసినవిగాను ఉన్నాయి.


రోమా సమాజంలో గౌరవప్రదమైన తరగతికి చెందిన కుటుంబంలో జన్మించారు అగస్టిన్. తన యవ్వనప్రాయంలో అతను స్వార్థపూరితమైన జీవితమును జీవించుటకు ఎంచుకొని, లోకేచ్ఛలను అనుసరించి ఇహలోక భోగములను వెన్నంటి జీవించారు. కార్తేజ్‌లో విద్యాభ్యాసమును ముగించిన పిమ్మట కొంతకాలం అక్కడే బోధించిన అతను, తదుపరి రోమ్‌కు తిరిగి వెళ్ళారు. అటు పిమ్మట తన భవిష్యత్తు పురోగతి కొరకై మిలన్‌కు వెళ్ళారు. అయితే అక్కడ కొన్ని సంవత్సరములు నిరాశాజనకమైన పని చేసిన తరువాత అతను రాజీనామా చేసి తన స్వస్థలమునకు తిరిగి వచ్చారు. ఆ విధముగా తన భవిష్యత్తు అనూహ్యమైన రీతిలో పతనమవడం మరియు తన ఏకైక కుమారుని కోల్పోవడం తన ఆత్మీయ స్థితిని గురించి మరియు దేవునితో తన సహవాసమును గురించి అతనిని ఆలోచింపచేశాయి. ఒకానొక రోజు అతను తన తోటలో నడుస్తున్నప్పుడు, పిల్లవాడు పాడుతున్నట్లు “తీసుకొని చదువు” అని తిరిగి తిరిగి చెబుతున్న ఒక స్వరమును విన్నారు. అప్పుడు అక్కడ ఒక బల్లపై అపొస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక ఉండగా, అతను దానిని తీసుకొని చదవడం ప్రారంభించారు. అతను రోమీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుచున్నప్పుడు తనలో మార్పు కలుగవలసిన ఆవశ్యకతను గురించి అతని మనస్సాక్షి అతనిని ఎంతగానో ఒప్పింపజేసింది. ఆ దినాన దేవుని ప్రేమ ద్వారా అతని జీవితం రూపాంతరం చెందింది.


మారుమనస్సు పొందిన అగస్టిన్, ఆపై స్వార్థపూరితముగా జీవించలేదు. అతను తన ఆశయాలను మరియు ఆస్తులన్నింటినీ వదులుకున్నారు. లేఖనములను అధ్యయనం చేయుటకును మరియు ప్రార్థనలో సమయమును గడుపుటకును అతను తన స్నేహితులతో కలిసి మతపరమైన శిక్షణ పొందియుండనవసరం లేని ఒక క్రైస్తవ సన్యాసి సంఘమును స్థాపించారు. పిమ్మట హిప్పో యొక్క బిషప్పుగా నియమించబడిన అతను, తరువాతి 35 సంవత్సరాలు అక్కడ బోధించుచూ, కూడికలు నిర్వహించుచూ మరియు స్థానిక వివాదములను పరిష్కరించుచూ సేవలో ముందుకు సాగిపోయారు. ఎంతో జాగ్రత్తగా లేఖనముల భావములను వివరించినవిగా ఉండే అతని ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి బయలుపరచబడేది. అనేక వివాదాస్పద మరియు తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పోరాడి, తప్పుడు త్రోవలోనికి తొలగిపోకుండా తన మందను జాగ్రత్తగా కాచారు అగస్టిన్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు మీ పాపముల కొరకు పశ్చాత్తాపమొంది దేవునితో మిమ్మును సమాధానపరచుకున్నారా? 

ప్రార్థన :  

"ప్రభువా, నన్ను వెదకి కనుగొని మీతో సమాధానపరచిన మీ యొక్క గొప్ప ప్రేమకై మీకు వందనములు. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment