మేరీ జోన్స్ గారి జీవిత చరిత్ర
- జననం : 16-12-1784
- మహిమ ప్రవేశం : 28-12-1864
- స్వస్థలం : నార్త్ వేల్స్, యునైటెడ్ కింగ్‌డమ్
- దర్శన స్థలము : -
మేరీ జోన్స్ ఆరు సంవత్సరాల పాటు డబ్బును దాచుకొని, తన మాతృభాషలో బైబిలు గ్రంథమును కొనుటకు ఇరవై ఆరు మైళ్ళు నడిచి వెళ్ళిన ఒక బాలిక. ఆమె బాల్యములో తన తల్లితో కలిసి వెల్ష్ గ్రామీణ ప్రాంతములోని ఒక చిన్న కుటీరంలో నివసించేవారు. నేత నేసేవాడైన ఆమె తండ్రి తన కుటుంబమును పోషించుటకు ఎంతో కష్టపడి పనిచేసేవారు. అయితే, మేరీకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు అనుకోని విధంగా ఆమె తండ్రి మరణించారు. కాగా తన భుజములపై పడిన కుటుంబ పోషణ బాధ్యతను నెరవేర్చుటకు ఆమె తల్లి చాలా కష్టపడవలసి వచ్చింది. అటువంటి సమయములో ఎటువంటి సణుగుడు లేకుండా మేరీ ఇంటిలో తన వంతు పనులను చేస్తూ తన తల్లికి సహకరించేవారు.
ఎనిమిదేళ్ళ వయసులో క్రీస్తును తెలుసుకొనిన మేరీకి అప్పటినుండి బైబిలు కథలు చదవడం అభిరుచిగా మారింది. ఆదివారం నాడు ఆమె తమ పాదిరిగారు బైబిలు చదువుచుండగా వినుటకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలోని చిన్న ప్రార్థనా మందిరమునకు కాలినడకన వెళ్ళేవారు. చదువబడుచున్నప్పుడు ఎంతో సుందరమైనవిగా తోచే బైబిలులోని ఆ పదములను బట్టి ఎంతో అచ్చెరువొందే ఆమె, వాటిని తన హృదయములో భద్రపరచుకునేవారు. ఒక ఆదివారం ఉదయం వారి గ్రామంలో ఒక పాఠశాల ప్రారంభించనున్నట్లు ప్రకటించబడగా మేరీ యొక్క ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే తద్వారా బైబిలును ఎలా చదవాలో నేర్చుకొనవచ్చునని ఆమె తలంచారు. చదవడం నేర్చుకొనిన తరువాత తన స్వంత బైబిలును కలిగియుండాలని కోరుకున్నారు మేరీ. అయితే వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమె తల్లి దానిని కొనలేక పోయినందున, బైబిలు కొనుటకు తగినంత డబ్బు సమకూర్చుకొనవలెనని ఆమె ఆరు సంవత్సరాలు పలు విధ ఉద్యోగాలు చేశారు.
బైబిలు కొనుటకు వారి గ్రామమునకు సమీపములో ఉన్న ప్రదేశం ఏదనగా అక్కడికి ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న రెవ. థామస్ చార్లెస్ అనే పాదిరిగారి స్థలం. కాగా బైబిలు కొరకు చెప్పులు కూడా లేకుండా అన్ని మైళ్ళు నడిచివెళ్ళిన ఆమెకు చివరి బైబిలు అప్పటికే అమ్ముడైందన్న వార్త వలన నిరాశే మిగిలింది. ఏదేమైతేనేమి, రెండు రోజుల తరువాత ఆమె తన స్వంత బైబిలు ప్రతిని పొందగలిగారు. కొంతకాలం తరువాత రెవ. చార్లెస్ పాదిరి మేరీతో తనకు కలిగిన అనుభవమును గురించి లండన్‌లో జరిగిన ‘రిలిజియస్ ట్రాక్ట్ సొసైటీ’ సమావేశంలో పంచుకున్నారు. తత్ఫలితంగా, వెల్ష్ బైబిళ్ళను సరఫరా చేయుటకు ఒక క్రొత్త సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తదుపరి ‘ది బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ’ గా ఉద్భవించింది. ఇది 1804వ సంll నుండి 700 భాషలలో అర్థ బిలియనుకు పైగా బైబిళ్ళను ప్రచురించింది.
ఒక చిన్న హృదయంలో దేవుని వాక్యం పట్ల ఉన్న లోతైన వాంఛ మరియు తృష్ణ, ప్రపంచ నలుమూలలకు బైబిలు సరఫరా చేయబడుటకు కారణమవుతుందని ఎవరైనా ఊహించగలరా?
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, ఈ రోజు మీరు దేవుని వాక్యమును చదివారా?
ప్రార్థన :
"ప్రభువా, మీ వాక్యము ద్వారా మిమ్ములను మరింతగా తెలుసుకొనవలెననే తృష్ణ కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment