Search Here

May 14, 2023

Saint Titus | తీతు

 తీతు గారి జీవిత చరిత్ర

  • జననం : 1 వ శతాబ్దం
  • మహిమ ప్రవేశం : క్రీ.శ. 107
  • స్వస్థలం : క్రీట్ (క్రేతు)
  • దర్శన స్థలము : కొరింథు

బైబిలు గ్రంథములో పేర్కొనబడిన వాడైన తీతు క్రైస్తవ్యము యొక్క ప్రారంభకాలంలోని మిషనరీ, సంఘ నాయకుడు మరియు అపొస్తలుడైన పౌలు యొక్క నమ్మకమైన సహచరుడు. గ్రీసు దేశస్థుడైన అతను క్రేతు పట్టణమునకు చెందినవారు. తన యవ్వనప్రాయంలో గ్రీకు తత్వశాస్త్రం మరియు కవిత్వమును అతను అభ్యసించారు. పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో యేసు క్రీస్తు గురించి అతను ప్రసంగిస్తుండగా వినిన తీతు యొక్క హృదయం ఆ సువార్త సందేశమునకు వెంటనే ప్రతిస్పందించింది. తద్వారా అతను యేసు క్రీస్తు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. పిమ్మట యూదులైన విశ్వాసుల మాదిరిగానే యూదుడు కానివాడు మరియు గ్రీసు దేశస్థుడైన ఒక అన్యుడు కూడా దేవుని పట్ల ఎటువంటి ప్రేమను కలిగియుండగలడో సాక్ష్యమిచ్చుటకుగాను పౌలు తీతును యెరూషలేమునకు తీసుకువెళ్ళారు.


అప్పటి నుండి అపొస్తలుడైన పౌలు యొక్క అత్యంత నమ్మకమైన సహచరులలో ఒకనిగా మారిన తీతు, సువార్త సేవలో పౌలుకు సహాయకారిగా ఉన్నారు. కాగా “మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతు” అని అపొస్తలుడైన పౌలు తీతును గురించి తన పత్రికలో పేర్కొన్నారు. కొరింథు సంఘములో విభేదాలు ఏర్పడినప్పుడు, ఆ సమస్యను పరిష్కరించుటకు పౌలు తన నమ్మకమైన సహచరుడైన తీతును పంపారు. ఆ సమయములో కేవలం పౌలు యొక్క హెచ్చరిక వలన మాత్రమే కాదు గాని, “అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే” కొరింథుకు వెళ్ళినట్లు 2 కొరింథీ 8:17లో చెప్పబడుతుంది. దైవిక జ్ఞానముతో అతను అక్కడి వివాదములను పరిష్కరించి కొరింథు సంఘములో శాంతిని నెలకొల్పారు.


పౌలు రోమీయుల ఖైదు నుండి విడుదలపొందిన తరువాత తీతు అతనితో పాటు క్రేతు ద్వీపానికి వెళ్ళి, పౌలుతో కలిసి క్రేతువారికి సువార్తను ప్రకటించారు. క్రేతు సంఘం అభివృద్ధి చెందుతూ, దినదినము నూతన విశ్వాసులు సంఘములో చేర్చబడుచుండుటచే క్రేతు విశ్వాసులకు పరిచర్య చేయుటకు సంఘ నాయకులను నియమించారు తీతు. పిమ్మట అతను అప్పటికి సువార్త వెలుగును చూడని ప్రాంతములకు సువార్తను ప్రకటించుచూ క్రేతుకు ఉత్తరముగా ప్రయాణించారు. ఆ విధముగా అతను ప్రయాణించిన ప్రాంతములలో ప్రస్తుతమున్న యుగోస్లేవియా, సెర్బియా మరియు మోంటెనెగ్రోలు కూడా ఉన్నాయి. ప్రజలకు బోధింపబడవలసిన ముఖ్యమైన విషయములను గురించి అపొస్తలుడైన పౌలు పత్రికల ద్వారా తీతుకు తరచుగా సూచనలు అందిస్తూ ప్రోత్సహించేవారు. 


దేవునికి నమ్మకమైన సేవకునిగా తనకు అప్పగింపబడిన బాధ్యతలను తన మరణపర్యంతము శ్రద్ధాసక్తులతో నిర్వర్తించారు తీతు. అతను నమ్మదగినవారు మరియు ఆశ్రయించదగినవారు. సత్యము పట్ల అతనికున్న సమర్పణ, సువార్తను విస్తరింపజేయుటకు కలిగియున్న అత్యాసక్తి మరియు సంఘము యెడల ఉన్న ఉత్సాహభరితమైన ప్రేమ నేడు ప్రతి ఒక్కరికీ మాదిరికారముగా నిలుస్తాయి. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుని సంఘములో ఆసక్తితో నిండిన సహచరులుగా మీరు ఉన్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, తీతు వలెనె యేసు క్రీస్తు ప్రభుని సంఘమునకు సాక్షిగా నన్ను నిలుపుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment