చార్లెస్ సిమియన్ గారి జీవిత చరిత్ర
- జననం : 1759
- మహిమ ప్రవేశం : 1836
- స్వస్థలం : బెర్క్‌షైర్
- దేశం : ఇంగ్లాండు
- దర్శన స్థలము : యునైటెడ్ కింగ్‌డమ్
చాలా మంది క్రైస్తవ విశ్వాసవీరులు ప్రపంచము యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి ప్రయాణించడం ద్వారా వైవిధ్యమును కనుపరచగా, యాభై నాలుగు సంవత్సరాల పాటు ఒకే ప్రదేశంలో సేవ చేసిన చార్లెస్ సిమియన్ మరొక విధమైన వైవిధ్యమును కనుపరిచారు.
క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ, మొదటి నుండి కూడా సిమియన్‌కు ఏమాత్రం మతపరమైన ఆసక్తి లేదు. అయితే, అతను కింగ్స్ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు ‘సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్’ (క్రైస్తవ జ్ఞానమును అభివృద్ధి పరచు సంస్థ) అని పిలువబడే ఒక క్రైస్తవ సమూహం పట్ల ఆకర్షితులయ్యారు. ఈ సంస్థ ద్వారా సిమియన్‌కు అనేక ఆధ్యాత్మిక పుస్తకములను చదివే అవకాశం కలుగగా, అది చివరికి 1779వ సంll లో అతను మారుమనస్సు పొందుటకు దారితీసింది. ఆర్ట్స్‌లో పట్టభద్రులైన అతను, తదుపరి ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ కు పాదిరిగా నియమించబడ్డారు. సువార్త ప్రకటన గానీ, సువార్తకు సాక్ష్యులుగా ఉన్నవారు గానీ కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువగా లేని సమయంలో సిమియన్ అక్కడ బోధించడం ప్రారంభించారు. సెయింట్ ఎడ్వర్డ్ సంఘములో కూడా బోధించిన అతను, పిమ్మట కేంబ్రిడ్జ్ లోని హోలీ ట్రినిటీ సంఘములో పూర్తి సమయం సేవచేయుటకు పాదిరిగా బాధ్యతలు చేపట్టారు. కాపరిగా అతని సంరక్షణలోను మరియు సువార్త కేంద్రబిందువుగా ఉండే అతని బోధనల ద్వారాను అభివృద్ధి చెందిన ఆ సంఘము, సువార్త సాక్ష్యమునకు మరియు ఆత్మీయ జీవితమునకు కేంద్రముగా ఆవిర్భవించింది.
సిమియన్ యొక్క పరిచర్యలో మూడు విషయములు కీలకమైన ప్రాధాన్యతను కలిగియున్నవి. వాటిలో మొదటిది, దేవుని పరిచర్య చేయుటకు మరియు బోధించుటకు యవ్వనస్థులను, మరి ముఖ్యముగా విద్యార్థులను ప్రోత్సహించడం. అతని రెండవ ప్రాధాన్యత మిషనరీ సేవ. అతను శుక్రాదివారాలలో సాయంకాల సమయములో తన గృహమునందు ఏర్పాటుచేసే ‘సంభాషణ సమావేశముల’ ద్వారా అనేక మిషనరీలకు శిక్షణనిచ్చారు. ఈ సమావేశముల ద్వారా ప్రపంచ నలుమూలలకు, బహు దూర ప్రాంతములకు కూడా సువార్తను మోసుకువెళ్ళుటకు ఎంతోమంది యువకులు ప్రోత్సహించబడ్డారు. అంతేకాదు, ‘చర్చి మిషనరీ సొసైటీ’ వ్యవస్థాపకులలో సిమియన్ కూడా ఒకరు. చివరిగా మూడవ ప్రాధాన్యత ఏమంటే, క్రైస్తవ సంఘ సంస్కరణ. నామమాత్రముగా క్రైస్తవ ఆలయమునకు వెళ్ళేవారిని క్రీస్తుకు నిజమైన శిష్యులుగా మార్చుటకై అతను ఎంతో శ్రమించారు.
సిమియన్ ప్రార్థనాపరులు. అతను వేకువనే నాలుగు గంటలకు లేచి ప్రార్థన మరియు వాక్య ధ్యానములలో నాలుగు గంటల పాటు తన సమయమును గడిపేవారు. బోధించడం మరియు ప్రార్థించడం అనునవి అతని జీవితములో రెండు ప్రధానమైన విషయములుగా ఉండేవి. తన స్వంతవారి నుండే శ్రమలు మరియు పోరాటాలు కలిగినప్పటికీ, సహనము పట్టుదల కలిగి ఈ లోకమునందు తన పరుగును విజయవంతముగా కడముట్టించారు చార్లెస్ సిమియన్.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీరు నివసించుచున్న, చదువుకుంటున్న మరియు పనిచేస్తున్న స్థలములలో మీరు ఎటువంటి మార్పును తీసుకువస్తున్నారు?
ప్రార్థన :
"ప్రభువా, నా జీవితము యొక్క ప్రతి భాగములోను మరియు ప్రతి కోణములోను సువార్తకు విలువైన సాధనముగా నేను ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment