శామ్యూల్ కబూ మోరిస్ గారి జీవిత చరిత్ర
- జననం : 1872
- మహిమ ప్రవేశం : 12-05-1893
- స్వస్థలం : ఆఫ్రికా
- దర్శన స్థలము : అమెరికా
శామ్యూల్ కబూ మోరిస్ (ప్రిన్స్ కబూ/కబూ యువరాజు) ఆఫ్రికాలోని లైబీరియాలో ఉన్న క్రూ అనే తెగ యొక్క నాయకుని కుమారుడు. అతను బాలునిగా ఉన్నప్పుడు గ్రీబో తెగవారు అతనిని బంధించి, క్రూ తెగ నుండి కప్పం వసూలు చేయుటకై అతనిని ఒక పాచికగా వాడుకున్నారు. కప్పం చెల్లించుటలో క్రూ తెగ ఎప్పుడైనా విఫలమయినట్లయితే గ్రీబో తెగవారు కబూ శరీరమునకు తేనె పూసి సజీవముగా అతనిని తిని వేయుటకు చీమల మధ్య అతనిని వదిలివేసేవారు. మరణపుటంచులలో నిస్సహాయమైన స్థితిలో ఉన్న కబూ, ఆ చిత్రహింసల వలన నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోయారు. ఒక రాత్రి అతను కొరడాతో కొట్టబడబోతున్నప్పుడు, అకస్మాత్తుగా అక్కడ కళ్ళు బైర్లు కమ్మేటంత గొప్ప వెలుగు మెరుపులా మెరిసింది. అంతలో అతను "కబూ, పారిపో!" అనే శబ్దమును వినడం జరిగింది. వెంటనే అతను అడవిలోనికి పరుగెత్తారు. ఆపై దివారాత్రుళ్ళు ప్రయాణించి మన్రోవియా చేరుకున్నారు.
మన్రోవియాలో కొన్ని సంవత్సరాల పాటు గృహాలకు రంగులు వేస్తూ తన జీవనోపాధిని పొందారు కబూ. ఒక రోజు అతను స్థానికముగా ఉన్న క్రైస్తవ సంఘమునకు వెళ్ళగా, అక్కడ ఒక మిషనరీ కళ్ళు బైర్లు కమ్మేటంత ఒక ప్రకాశవంతమైన వెలుగు ద్వారా సౌలు ఏవిధముగా మారుమనస్సు పొందారో చెబుతుండగా విన్నారు. తన స్వంత జీవితగాథకు ఆ లేఖన భాగముతో ఉన్న సారూప్యతను చూచి ఆశ్చర్యపోయిన కబూ, “నేను ఆ వెలుగును చూశాను!” అని అరిచారు. తదుపరి అతను యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందగా అతనికి శామ్యూల్ మోరిస్ అనే క్రైస్తవ నామం ఇవ్వబడింది. అప్పటి నుండి అతను క్రీస్తును గురించి మరి అధికముగా తెలుసుకొనవలెననే వాంఛను కనుబరిచారు. కాగా ఒక మిషనరీ సూచన మేరకు అమెరికాకు పయనమైన అతను, 18సంll ల వయస్సులో న్యూయార్క్ నగరమునకు చేరుకున్నారు. అక్కడ స్టీఫెన్ మెరిట్ అనే వ్యక్తి సహాయంతో అతను ఇండియానాలోని టేలర్ విశ్వవిద్యాలయంలో చేరారు. సాధారణమైనదిగా ఉండే అతని శ్రేష్టమైన విశ్వాసం మరియు అతని యొక్క అద్భుత గాథ కళాశాలలోను మరియు ఆ చుట్టుప్రక్కల ఉండే జనసమూహములలోను ఉజ్జీవమును తీసుకువచ్చాయి.
మోరిస్ ముఖ్యముగా తన ప్రార్థన జీవితమును బట్టి పేరొందారు. రాత్రి సమయములో అతను తన గదిలో ప్రార్థించుచుండుటను వినవచ్చు. దానిని అతను ఎంతో సాధారణముగా ‘నా తండ్రితో మాట్లాడుతున్నాను’ అని పేర్కొనేవారు. ఇతరులకు సాక్ష్యమిచ్చుటకు కలిగిన ప్రతి అవకాశమును అతను వినియోగించుకున్నారు. అయితే సువార్తను తన స్వజనుల యొద్దకు తీసుకువెళ్ళవలెనని అతని హృదయం ఎంతగానో వాంఛించింది. ఏదేమైనప్పటికీ కేవలం 21 ఏళ్ళ యవ్వన ప్రాయంలో తీవ్రమైన జలుబు బారినపడిన అతను, లేత వయస్సులోనే తన పరమ వాసస్థలమునకు చేరుకున్నారు. అతని అకాల మరణం అతని తరపున ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళి సేవ చేయుటకు అతని తోటి విద్యార్థులను ప్రేరేపించింది. తద్వారా ఏదో ఒక రోజు తన స్వజనులకు సేవ చేయుటకు తన స్వస్థలమునకు తిరిగి వెళ్ళవలెనన్న శామ్యూల్ మోరిస్ యొక్క కల నెరవేరింది.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ పరలోకపు తండ్రితో మీరు ఎంత తరచుగా మాట్లాడుతున్నారు?
ప్రార్థన :
"ప్రభువా, మరింత తరచుగా మీతో సంభాషించుటకును, మీతో నేను కలిగియున్న వ్యక్తిగత సహవాసములో మరింతగా బలపరచబడి అభివృద్ధి చెందుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment