Search Here

May 13, 2023

John Mark | మార్కు అనబడు యోహాను

మార్కు అనబడు యోహాను గారి జీవిత చరిత్ర


Pictures shown are for illustration purpose only


  • జననం : -
  • మరణం : 1 వ శతాబ్దం
  • స్వస్థలం :
  • దేశం : -
  • దర్శన స్థలము : -


మొదటి శతాబ్దంలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినది. ఆ శ్రమలు కొనసాగుతున్నప్పుడు, అపొస్తలుడైన యాకోబును చంపించిన హేరోదు రాజు, పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేయించాడు. అయితే దేవుని దూత ద్వారా పేతురు ఆశ్చర్యకరమైన రీతిలో చెరసాలలో నుండి విడిపించబడగా, అతను మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో విశ్వాసులు అక్కడ కూడుకొని ప్రార్థన చేయుచున్నారు. మార్కు గురించి బైబిలులో మొదటిసారిగా ఈ సందర్భంలో ప్రస్తావించబడింది. అతనిని గురించి బైబిలులో కొన్ని సార్లు మాత్రమే చెప్పబడినప్పటికీ, దేవుని దృష్టిలో ఎవరూ అల్పులు కారు.


బర్నబాకు బంధువు అయిన ఈ మార్కు, పౌలు మరియు బర్నబాల‌ యొక్క మిషనరీ ప్రయాణంలో వారితో పాటు కలిసికొని వారికి ఉపచారము చేయువానిగా ఉన్నారు. అయితే వారు పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చినప్పుడు, మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు. ఈ చర్య పౌలును ఎంతో నిరాశపరిచింది. కాగా, వారి తదుపరి మిషనరీ ప్రయాణంలో మార్కు‌ను కూడా వెంట తీసుకువెళ్ళవలెనని బర్నబా తలంచగా, పౌలు అందుకు నిరాకరించారు. తత్ఫలితముగా చివరికి పౌలు మరియు బర్నబాలు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. కాగా, బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్ళారు. అప్పుడు మార్కు ప్రభువుకు నమ్మకంగా సేవ చేసిన దానిని బట్టి తదుపరి పౌలు కూడా మార్కు‌ను తన జతపనివానిగా పేర్కొన్నారు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు తిమోతికి లేఖను వ్రాస్తూ, "మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు" అని చెప్పారు. అంతేకాకుండా కొలస్సీ సంఘమునకు మార్కు వచ్చినయెడల అతనిని చేర్చుకొనమని సూచించారు. ఒకప్పుడు సేవలో వెనుకంజ వేసిన మార్కు, తిరిగి సేవలో అంత స్థిరముగా నిలబడ్డారు.


అపొస్తలుడైన పేతురుకు కూడా పరిచర్యలో మార్కు సహకారిగా ఉన్నారు. కాగా పేతురు తాను వ్రాసిన పత్రికలో ‘నా కుమారుడు’ అని మార్కును గూర్చి పేర్కొన్నారు. తదుపరి మార్కు ఐగుప్తుకు వెళ్ళి, ఆఫ్రికాలో క్రైస్తవ సంఘములను స్థాపించిన మొదటి వ్యక్తి అయినట్లుగా చెప్పబడుతుంది. అతను అలెగ్జాండ్రియాలో సంఘమును స్థాపించి, అక్కడ పరిచర్య చేశారు. బైబిలు గ్రంథములో చేర్చబడిన "మార్కు సువార్త"ను వ్రాసింది ఈ మార్కేనని అధిక శాతం బైబిలు పండితులు భావిస్తారు. యేసు క్రీస్తును దేవుని కుమారునిగా తెలియపరిచే ఈ  సువార్త పుస్తకం, పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుమని అవిశ్వాసులకు మరియు 'సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి' అని దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞకు విధేయులుకమ్మని విశ్వాసులకు పిలుపునిచ్చేదిగా ఉంది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు విఫలమైనప్పుడు, మీరు తిరిగి విశ్వాస మార్గంలో కొనసాగుటకు మీ కొరకై ఎల్లప్పుడూ ఒక తెరువబడిన ద్వారం ఉన్నదని జ్ఞాపకము చేసికొనుము. 

ప్రార్థన :

"ప్రభువా, మీ సేవ కొరకు మా ఇంటి ద్వారములను ఎల్లప్పుడూ తెరిచియుంచునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment