జేమ్స్ రెన్విక్ గారి జీవిత చరిత్ర
- జననం : 15-02-1662
- మరణం : 17-02-1688
- స్వస్థలం : మోనియైవ్
- దేశం : స్కాట్లాండ్
- దర్శన స్థలము : స్కాట్లాండ్
జేమ్స్ రెన్విక్ ప్రెస్బిటేరియన్ సంఘములో పరిచర్య చేసిన ఒక దైవ సేవకులు. అతను దేవుని వాక్యానికి అమితమైన విధేయత చూపిన కారణముగా హతసాక్షిగా మరణించారు. స్కాట్లాండుకు చెందిన ఒక భక్తిగల కుటుంబములో జన్మించిన రెన్విక్, చాలా చిన్న వయస్సు నుండే క్రైస్తవ సంఘ కార్యకలాపాలతో బలమైన అనుబంధమును కలిగియున్నారు. కాగా పదమూడేళ్ళ వయసులో ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయములో చేరిన అతను, అక్కడ మతమును మరియు వేదాంతశాస్త్రమును అభ్యసించారు. అక్కడ చదువుకుంటున్న సమయములో స్కాట్లాండ్ చర్చిపై అధికారమును బిషప్పులకు ఇచ్చుట ద్వారా క్రైస్తవ సంఘమును తన చేతులలో ఉంచుకొనుటకు ప్రయత్నిస్తున్న రెండవ చార్లెస్ రాజును ప్రతిఘటించినందుకుగాను చంపబడిన రిచర్డ్ కామెరూన్ యొక్క బోధనల వైపు అతను ఆకర్షితులయ్యారు. తదుపరి వేదాంతములో శిక్షణ కొరకై నెదర్లాండ్సుకు వెళ్ళిన రెన్విక్, అక్కడ సంఘ సేవకులుగా నియమించబడ్డారు.
రెన్విక్ 1683వ సంll లో స్కాట్లాండుకు తిరిగి వచ్చారు. క్రైస్తవ సంఘమును తమ అధికారము క్రింద నియంత్రించుటకు ప్రయత్నిస్తున్న రాజును ఎదిరిస్తున్నందుకుగాను ఒక ప్రక్క ప్రెస్బిటేరియన్లు చంపబడుతున్న పరిస్థితులలో రెన్విక్ ధైర్యముగా సేవ చేయడం ప్రారంభించారు. అతని పరిచర్య యొక్క మొదటి సంవత్సరంలో ఐదు వందల మందికి పైగా క్రీస్తు వద్దకు నడిపించబడ్డారు. తరువాతి ఐదు సంవత్సరములు అతను స్కాట్లాండు దేశమంతటా పర్యటించి, వినుటకు చెవియొగ్గిన ప్రతియొక్కరికీ లేఖన సత్యములను బోధించారు. తత్ఫలితముగా అతను ఒక తిరుగుబాటుదారుడని ప్రకటించి, అధికారులు అతనిని నిత్యము వెంటాడారు. అతను వెనుకకు మళ్ళకపోతే బంధింపబడే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, వెనుకంజ వేయక సేవను కొనసాగించారు రెన్విక్. అతను ఎక్కడ ఉన్నా, ఆపద వస్తే వేగంగా తప్పించుకొనులాగున ఎల్లప్పుడూ ఒక గుఱ్ఱం సిద్ధపరచబడి, సన్నద్ధమై ఉండేది.
పలుమార్లు మరణచ్ఛాయల నుండి కొద్దిలో తప్పించుకున్న రెన్విక్, చివరికి 1688వ సంll ప్రారంభంలో పట్టుబడ్డారు. విచారణలో రాజద్రోహానికి పాల్పడ్డారని మరియు దేవుని దూషించారని అతనిపై ఆరోపణలు చేసి అతనికి మరణశిక్ష విధించారు. కొంతమట్టుకైనా రాజు యొక్క అధికారమునకు అంగీకరించమని అనేక మంది అతనిని ఒప్పించుటకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. "లేదు, దేవుని వాక్యమునకు అనుగుణముగా నియమనిబంధనలు మరియు పరిమితులను కలిగియున్న అధికారమునే నేను అంగీకరిస్తాను" అని చెప్పి వారి విజ్ఞాపనలనన్నింటినీ నిరాకరించారు రెన్విక్. సున్నితమైన శరీర దారుఢ్యమును కలిగి, మంచి యవ్వనంలో ఉండి ధైర్యముగా ఉరికంబము వైపుకు అడుగులు వేస్తున్న రెన్విక్‌ను చూసి ఆశ్చర్యపోయిన సైన్యాధిపతి, 'దేశమును అంతగా కలవరపరచినది రెన్విక్ అనే ఈ పడుచువాడా?' అని పలికారు. రెన్విక్ ఉరితీయబడినప్పుడు అతని వయస్సు ఎంతో మీకు తెలుసా? ఇరవై ఆరు! కరపత్రాలుగా ప్రచురించబడిన రెన్విక్ యొక్క ఉపన్యాసాలు మరియు లేఖలు ఈనాటికీ మనకు ప్రేరణను కలిగించేవిగా ఉన్నాయి.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ యవ్వనం ప్రభువుకు ఉపయోగకరమైనదిగా ఉన్నదా?
ప్రార్థన :
"ప్రభువా, నా యవ్వనమును మీకు యోగ్యముగా ఉపయోగించుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment